చూపంతా.. పత్తిపైనే!

ABN , First Publish Date - 2022-06-23T05:30:00+05:30 IST

తెల్ల బంగారానికి డిమాండ్‌ పెరిగింది. ఎక్కడ చూసినా రైతులు పత్తిసాగుకే మొగ్గు చూపుతున్నారు.

చూపంతా.. పత్తిపైనే!


  • ఈ యేడాది భారీగా పెరగనున్న సాగు
  • మద్దతు కంటే ఎక్కువ ధర లభించడమే కారణం
  • సర్కారు ప్రోత్సాహం, అనుకూల భూములూ కారణమే 
  • కంది, మొక్కజొన్నల సాగు కూడా పెరిగే చాన్స్‌...

తెల్ల బంగారానికి డిమాండ్‌ పెరిగింది. ఎక్కడ చూసినా రైతులు పత్తిసాగుకే మొగ్గు చూపుతున్నారు. నీరు తక్కువ అవసరం కావడం, ధర కూడా బాగా ఎక్కువగా వస్తుండడంతో దానిని సాగు చేసేందుకే ఇష్టపడుతున్నారు. ప్రధానంగా దీనిధర బహిరంగ మార్కెట్‌లో మద్దతు ధరకంటే ఎక్కువగా వస్తోంది. అందుకే ఎక్కువమంది రైతులు పత్తి బాట పడుతున్నారు.

పరిగి, జూన్‌23: జిల్లాలో ఏటేటా పత్తి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. జిల్లాలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా పత్తి సాగు విస్తీర్ణం పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. వాణిజ్య పంటగా పేరొందిన పత్తి సాగుపై రైతులు ఆసక్తిని చూపుతున్నారు. గత ఏడాది కంటే ఈ సారి సాగు వీస్తిర్ణం పెరగనుంది. జిల్లాలో  గత వానాకాలంలో 1.96 లక్షల ఎకరాల్లో సాగు కాగా, ఈ సారి 2.50 లక్షల ఎకరాల్లో సాగవుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఇంకా పెరిగి 2.70 లక్షల ఎకరాలకు పెరుగనుందని రైతులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న సాగును నియంత్రించి, పత్తిని బాగా పెంచాలని సర్కారు నిర్ణయించిన సంగతి విధితమే. రెండేళ్ళుగా పత్తికి ఆశించిన విధంగా ధర కూడా లభిస్తోంది. జిల్లాలోని భూములు కూడా పత్తి సాగుకు అనుకూలం కూడా. అందుకే వికారాబాద్‌ జిల్లాలో పత్తి సాగువైపే రైతులు ఆసక్తిని చూపుతున్నారు. పత్తికి ప్రభుత్వం క్వింటాకు రూ.6,026 మద్దతు ధర కల్పించింది. అయితే మార్కెట్‌లో రూ.10వేలకు పైగా కూడా అమ్మకాలు జరిగాయి. ఈసారి ప్రభుత్వం పత్తికి మద్దతు ధరను రూ.6,380కి పెంచింది. పత్తి ఆరుతడి పంట కావడం, వర్షాల అనిశ్చితి కారణంగా దిగుబడి రాకపోయినా ధర ఎక్కువగా ఉండడంతో కనీసం పెట్టుబడి అయినా వస్తుందనే నమ్మకంతో రైతులు పత్తిసాగుపై మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. ఎలాంటి పరిస్థితిలోనైనా ఎంతోకొంత ఆదాయం వస్తుందనే నమ్మకం రైతును పత్తిబాట పట్టేట్టు చేస్తోంది. సాగునీటి సౌకర్యాలు ఉన్నచోట వరికి ప్రాధాన్యత ఇస్తున్నారు. సాగునీరు పుష్కలంగా లభించని ప్రాంతాల్లో నాలుగైదేళ్లుగా పత్తి సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. విత్తనాలు సులభంగా లభ్యం కావడంతో కూడా పత్తి పంటవైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. పత్తి విత్తనాలు ఎలాగూ సబ్సిడీపై ఇవ్వకపోవడంతో ప్రైవేట్‌ వ్యక్తుల దగ్గర కొనుగోలు చేస్తున్నారు. బీటీ విత్తనాలు వచ్చాక తెగుళ్లు తగ్గి పంట దిగుబడులు పెరిగాయి. దీంతో రైతులు పత్తి పంటసాగు చేసేందుకు ఆసక్తిని చూపుతున్నారు.

కంది సాగు కూడా...

జిల్లాలో కందిసాగు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. గత ఏడాది 1.08లక్షల ఎకరాల్లో కంది సాగయింది. ఈ సారి 1.90లక్షల వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. కందులకు మద్దతు ధర రూ.6,600కు పెరిగింది. బహిరంగ మార్కెట్‌ల్లో రూ.ఏడు వేల వరకు పలికింది. వరిసాగును తగ్గించి కందుల వైపు దృష్టి సారించేలా ఽఅధికారులు రైతులకు అవగాహన కూడా కల్పిస్తున్నారు. రైతులు కూడా వరిసాగును తగ్గించి కందుల సాగుపై దృష్టి సారిస్తున్నారు. కంది సాగులో అంతరపంటలుగా పెసర, మినుములు, మొక్కజొన్న సాగు చేసుకునే అవకాశం ఉండడంతో రైతులు వాటిపై ఆసక్తి చూపుతున్నారు. కందులు పప్పు పంట కావడంతో మార్కెట్‌లో మంచి డిమాండ్‌ కూడా ఉంది. అందుకే కందిని ఎంచుకోవడానికి రైతులు ఆసక్తిని కనబరుస్తున్నారు.

మొక్కజొన్న సైతం...

జిల్లాలో రైతులు పత్తి తర్వాత కంది, మొక్కజొన్న పంట సాగుకు రెండవ ప్రాధానత్యను ఇస్తున్నారు. పత్తి, కందుల తర్వాత మొక్కజొన్న సాగుపై రైతులు ఆసక్తిని చూపుతున్నారు. గత ఏడాది మొక్కజొన్న సాగును ప్రభుత్వం నియంత్రించినప్పటీకీ జిల్లాలో 66వేల ఎకరాల్లో మొక్కజొన్నల సాగు చేశారు. గత ఏడాది మొక్కజోన్నలకు మద్దతు ధర రూ.1,870 ఉండగా, ఈసారి అది రూ.1,962కు పెరిగింది. అయితే బహిరంగ మార్కెట్‌లో మాత్రం దాని ధర క్వింటాలుకు రూ.2,350 వరకు పలుకుతున్నది. దీంతో ఈసారి మొక్కజొన్న లక్షా 40వేల ఎకరాలకు వరకు సాగయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

జిల్లాలో పత్తిసాగు ఇలా.

గత ఏడాది సాధారణ సాగు(లక్షల ఎకరాల్లో) 1.70

గత ఏడాది సాగైంది(లక్షల ఎకరాల్లో)         1.96

ఈ ఏడాది అంచనా(లక్షల ఎకరాల్లో)         2.50

ఈ యేడాది సాగయ్యే అవకాశం(లక్షల ఎకరాల్లో) 2.70

పత్తికి అనుకూలంగా ఉంది

నల్లభూములు ఎక్కువగా పత్తి సాగుకే అనుకూలం. రెండేళ్ల నుంచి పత్తికి ధర బాగుంది. ఆడపాదడపా వర్షం కురిస్తే పత్తికి సరిపోతుంది. గత ఏడాది 8 ఎకరాలు సాగు చేశా. ఈసారి 12 ఎకరాల్లో పత్తి సాగుచేస్తున్నా. పదెకరాలు కౌలు, రెండు ఎకరాలు నా సొంత భూమిలో పత్తి విత్తనాలు కూడా విత్తాను. 

                                                          -రాములు, పత్తిరైతు, రాఘవాపూర్‌, పరిగి

వానాకాలం పంటల సాగుకు ప్రణాళికలు సిద్ధం

వానావాలం జిల్లాలో వివిధ రకాల పంటలు కలిపి 5.95 లక్షల ఎకరాల పంటల సాగు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశాం. ఇందులో ప్రఽధానంగా పత్తి 2.50 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించాం. కందులు, మొక్కజొన్నల సాగు కూడా పెరిగే అవకాశం ఉంది. అందుకు సరిపోను ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాం. వర్షం కురిసి పంటలు సాగు చేయడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. 

                                                                    -గోపాల్‌, జిల్లా వ్యవసాయాధికారి

Updated Date - 2022-06-23T05:30:00+05:30 IST