రిమ్స్‌లో ఎక్స్‌రే, సీటీస్కాన్‌ ఫిల్మ్‌ల కొరత

ABN , First Publish Date - 2022-04-28T04:41:27+05:30 IST

కడప ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (రిమ్స్‌)లో దాదాపు మూడు నెలల నుంచి ఎక్స్‌రే, సీటీస్కాన్‌ల ఫిల్మ్‌ల కొరత వేధిస్తోంది.

రిమ్స్‌లో ఎక్స్‌రే, సీటీస్కాన్‌ ఫిల్మ్‌ల కొరత
రిమ్స్‌ సీటీ స్కాన్‌ సెంటర్‌ ఇదే..

రోగుల అవస్థలు 

పట్టించుకోని వైద్యాధికారులు


కడప(సెవెన్‌ రోడ్స్‌), ఏప్రిల్‌ 27: కడప ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (రిమ్స్‌)లో దాదాపు మూడు నెలల నుంచి ఎక్స్‌రే, సీటీస్కాన్‌ల ఫిల్మ్‌ల కొరత వేధిస్తోంది. దీంతో వైద్యం కోసం వచ్చే రోగులు అవస్థలు పడుతున్నారు. శరీరంలో ఏదైనా జబ్బును కనుగొనడానికి అవసరం అనిపిస్తే ఎక్స్‌రేను వైద్యులు సూచిస్తారు. ఎముకలు విరిగినా, శరీరంలో సున్నితమైన భాగాలలో సరైన స్పందన లేకపోయినా, ఊపిరితిత్తులు, మెదుడు లాంటి భాగాలకు సీటీస్కాన్‌ను రెఫర్‌ చేస్తారు. ప్రభుత్వాసుపత్రిలో సాధారణ స్కానింగ్‌లు, సిటీ స్కానింగ్‌ మరియు ఎంఆర్‌ఐ, ఎక్స్‌రేలు అన్ని ఉచితమే. రోగులకు స్కానింగ్‌ తర్వాత పేపర్‌ రూపంలో రిపోర్టు అందిస్తారు. కానీ కొన్ని సందర్భాలలో వైద్యులు వివరణాత్మక పరిశీలన కోసం ఫిల్మ్‌లను పరిశీలించాల్సి ఉంటుంది. రోగుల జబ్బు తెలుసుకునేందుకు ఫిల్మ్‌ తీసుకురండి అని చెప్తుంటారు. ఈ మేరకు రోగులు ఎక్స్‌రేలు, సీటీ స్కానింగ్‌ ఫిల్మ్‌లు అడిగితే కాస్త రుసుముతో ఇస్తారు. ఈ ఫిల్మ్‌లను పరిశీలించిన వైద్యులు రోగికి ఖచ్చితమైన వైద్యం అందించగలుగుతారు. అయితే సర్వజన ఆసుపత్రిలో రోగులకు ఫిల్మ్‌ల ఇవ్వడానికి అందుబాటులో లేవు. దాదాపుగా మూడు నెలలు నుంచి ఫిల్మ్‌ల కొరత ఉన్నప్పటికీ పట్టించుకునే వారే లేకపోవడంతో రోగులకు అవస్థలు తప్పడం లేదు.


ప్రైవేటు ల్యాబ్‌ల వైపు.... 

జబ్బు నిర్థారణ కోసం రోగులు ఎక్స్‌రే మరియు సిటీ స్కానింగ్‌ తీయించుకొని ఫిల్మ్‌ కావాలంటే నగరంలోని ప్రైవేటు ల్యాబ్‌లకు వెళ్లి డబ్బులు సమర్పించుకోవాల్సిందే. ఇక్కడ గమ్మత్తయిన విషయం ఏమిటంటే... సర్వజన ఆస్పత్రిలో ఎక్స్‌రేలు, సీటీస్కాన్‌లు తీస్తారు. ఫిల్మ్‌ కావాలంటే నెల రోజులు ఆగండి అని మొదట చెప్తారు. అన్ని రోజలు ఇబ్బంది అని రోగులు అంటే అయితే సీడీ తెచ్చుకొండి కాపీ చేసి ఇస్తాము... బయట (ప్రైవేటు ల్యాబ్‌ల్లో) ఎక్కడైనా ఫిల్మ్‌ తెచ్చుకోండని ఉచిత సలహా ఇస్తారు. పోనీ సీడీ ఏమైనా ఆసుపత్రిలో లభిస్తుందా అంటే అదీ లేదు. రూ.10ల సీడీ కోసం ఆటోలకు ఖర్చు పెట్టుకుంటూ నగరానికి రావాల్సిందే. సరే అంతా కష్టపడి సీడీ తెచ్చుకొని మళ్లీ నగరానికి బయల్దేరి ఫిల్మ్‌ కోసం సంబంధిత సెంటర్‌లో ప్రయత్నిస్తే... సీడీలోని ప్రైవేటు వారి కంప్యూటర్‌లలో పని చేయవు. మళ్లీ ఇంకో సీడీ తీసుకొని రిమ్స్‌కు పరిగెత్తాల్సిందే. ఒక్కోసారి రోగి అదృష్టం బాగుంటే ఏదో లాటరీ తగిలినట్లు సీడీ ఓపెన్‌ అయ్యి ఫిల్మ్‌ దొరకుతుంది. సర్వజన ఆసుపత్రిలో రూ.200లకు దొరికే ఫిల్మ్‌ బయట రూ.500 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నారు. ఇక పై పెచ్చు ఆటో చార్జీలు, వ్యయప్రయాసలు అదనం. ఈ విధంగా  రోగి, రోగి బంధువుల బాధలు వర్ణణాతీతం. దాదాపు మూడు నెలల నుంచి ఈ సమస్య ఉన్నా వైద్యాధికారులు, ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయమై సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రసాద్‌ను సంప్రదించగా అతను సెలవులో ఉన్నారు. ఇన్‌చార్జ్‌గా ఉన్న డాక్టర్‌ లక్ష్మీని అడుగగా సూపరింటెండెంట్‌ సెలవులో ఉన్నారు వచ్చాక చెప్తాను అని తెలిపారు.

Updated Date - 2022-04-28T04:41:27+05:30 IST