కార్య‘దర్శనం’ కరువు

ABN , First Publish Date - 2022-07-22T05:35:44+05:30 IST

పల్లెపాలనలో ప్రధాన భూమిక పోషించే పంచాయతీ కార్యదర్శుల కొరత వేధిస్తోంది. ఒకే కార్యదర్శికి నాలుగైదు పంచాయతీలకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడంతో సక్రమంగా సేవలు అందడం లేదు. పర్యవేక్షణ కరువై.. గ్రామ పాలన కుంటుపడుతోంది.

కార్య‘దర్శనం’ కరువు
ముచ్చింద్రలో జనవాసాల మధ్య మురుగునీరు

 జిల్లాలో 912 గ్రామ పంచాయతీలకు 534 మంది కార్యదర్శులే!
 ఇన్‌చార్జిల పాలనతో ప్రజలకు ఇక్కట్లు
(ఇచ్ఛాపురం రూరల్‌)

ఇచ్ఛాపురం మండలం బూర్జపాడు గ్రామానికి చెందిన తెప్పల డిల్లీరావు ఇటీవల కిడ్నీవ్యాధితో మృతి చెందారు. తండ్రి మరణ ధ్రువీకరణ పత్రం కోసం డిల్లీరావు కుమారుడు గణేష్‌ గ్రామ సచివాలయానికి వెళ్లగా కార్యదర్శి అందుబాటులో లేరు. మూడు పంచాయతీలకు ఆ కార్యదర్శే ఇన్‌చార్జి. దీంతో కార్యదర్శి అందుబాటులో లేక.. వారం రోజులవుతున్నా.. మరణ ధ్రువీకరణ పత్రం అందలేదు.

 ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో పారిశుధ్య లోపంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఇన్‌చార్జి కార్యదర్శి విధులు నిర్వహిస్తున్నారు. పర్యవేక్షణ లోపంతో వీధులు, కాలువల్లో చెత్తాచెదారాలు పేరుకుపోయాయి. ఫాగింగ్‌ మిషన్‌ సచివాలయంలో మూలనపడి ఉంది.

 బూర్జపాడు పంచాయతీకి రెగ్యులర్‌ కార్యదర్శి లేరు. సర్పంచ్‌ మోహనాంగి సీసీ రోడ్లు, బోర్లు మరమ్మత్తులు, కాలువల నిర్మాణం, వీధిలైట్లు కోసం సుమారు రూ. 8 లక్షలు వరకు ఖర్చు చేశారు. కార్యదర్శి లేకపోవడంతో బిల్లులు పెట్టలేకపోతున్నామని వాపోతున్నారు.

 మశాఖపురం, బిర్లంగి, ముచ్చింద్ర, బాలకృష్ణాపురం పంచాయతీలకు రెగ్యులర్‌ కార్యదర్శులు లేరు. దీంతో ఎక్కడికక్కడ పారిశుధ్యం, వీధిలైట్లు, ఇతర సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

.. ఇలా పల్లెపాలనలో ప్రధాన భూమిక పోషించే పంచాయతీ కార్యదర్శుల కొరత వేధిస్తోంది. ఒకే కార్యదర్శికి నాలుగైదు పంచాయతీలకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడంతో సక్రమంగా సేవలు అందడం లేదు. పర్యవేక్షణ కరువై.. గ్రామ పాలన కుంటుపడుతోంది.  జిల్లాలో 912 గ్రామ పంచాయతీలు ఉండగా.. ప్రస్తుతం 534 మంది కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారు. అందులో గ్రేడ్‌-1 27, గ్రేడ్‌-2 20, గ్రేడ్‌-3 129 మంది ఉంటే మిగలిన వారంతా గ్రేడ్‌-4 కార్యదర్శులే. వారినే ఆయా పంచాయతీల్లో ఇన్‌చార్జిలుగా సర్దుబాటు చేసి బాధ్యతలు అప్పగించినట్లు అధికారులు చెబుతున్నారు. అదనపు బాధ్యతలు కారణంగా కార్యదర్శులు ఏ రోజు ఏ గ్రామంలో ఉంటారో తెలియడం లేదు. గ్రామాల్లో తాగునీటి క్లోరినేషన్‌, పారిశుఽధ్యం, వీధిదీపాలు, మురుగుకాలువల నిర్వహణ తదితర సమస్యలను తక్షణమే పరిష్కరించాల్సిన బాధ్యత గ్రామ కార్యదర్శులదే. ఒక్కో గ్రామ కార్యదర్శికి రెండు నుంచి నాలుగు పంచాయతీలు అప్పగించడంతో సమస్యలు సకాలంలో పరిష్కారానికి నోచుకోక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం వర్షాకాలంలో గ్రామాల్లో పారిశుధ్య సమస్యలు పెరిగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. మరోవైపు సకాలంలో వసూలు చేయాల్సిన ఇంటిపన్ను, కుళాయిపన్నులతో పాటు ఇతర పన్నులు ఆలస్యమవుతున్నాయి. ఫలితంగా అభివృద్ధి పనులు మందగిస్తున్నాయి. ప్రభుత్వం స్పందించి కార్యదర్శుల భర్తీపై దృష్టి సారించాలని జిల్లావాసులు కోరుతున్నారు.

ఇబ్బందులు లేకుండా..  
ప్రస్తుతం బదిలీల కారణంగా పోస్టులు ఖాళీ అయ్యాయి. ఏఏ మండలాల్లో ఖాళీలు ఉన్నాయో వివరాలు సేకరిస్తున్నాం. వాటి ఆధారంగా చర్యలు తీసుకుంటాం. సచివాలయ ఉద్యోగులు పూర్తిస్థాయిలో ఉండడంతో మౌలిక సదుపాయాల కల్పనకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం.
- రవి కుమార్‌, జిల్లా పంచాయతీ అధికారి, శ్రీకాకుళం.
 

Updated Date - 2022-07-22T05:35:44+05:30 IST