మానస హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్‌లు.. మాజీ ప్రేయసిని తుపాకీతో కాల్చేందుకు ముందస్తు ట్రైనింగ్..!
ABN , First Publish Date - 2021-08-10T18:00:22+05:30 IST
కేరళ మెడికల్ స్టూడెంట్ మానస హత్య కేసులో రోజుకో విషయం వెలుగు చూస్తోంది.
కేరళ మెడికల్ స్టూడెంట్ మానస హత్య కేసులో రోజుకో విషయం వెలుగు చూస్తోంది. కొత్తమంగళంలోని మెడికల్ కాలేజీలో చదువుకుంటున్న మానసను రఖిల్ రఘుథామన్ అనే యువకుడు గత నెల 30న కాల్చి చంపేశాడు.. అనంతరం తనను తాను కాల్చుకుని చనిపోయాడు.. కేరళలోని కొత్తమంగళంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసును దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు బీహార్‌కు చెందిన ఇద్దరు యువకులను తాజాగా అరెస్ట్ చేశారు.
బీహార్‌కు చెందిన సోనూ కుమార్ మోదీ, మనీష కుమార్ అనే వ్యక్తుల నుంచి రఖిల్ తుపాకీ కొన్నట్టు పోలీసులకు తెలిసింది. అంతేకాదు తుపాకీని ఎలా కాల్చాలనే విషయంపై వీరి వద్ద రఖిల్ తర్ఫీదు పొందినట్టు కూడా సమాచారం. దీంతో వీరిద్దరినీ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. బీహార్‌లో వీరిద్దరినీ అరెస్ట్ చేసి కేరళకు తీసుకువచ్చారు. వీరికి రూ.35 వేలు చెల్లించి రఖిల్ తుపాకీ కొన్నాడట. ఇంటిరీయర్ డిజైనర్‌గా పనిచేస్తున్న రఖిల్.. గతంలో మానసతో ప్రేమాయణం సాగించాడు. అయితే రెండు నెలల క్రితం రఖిల్‌కు మానస బ్రేకప్ చెప్పేసింది. అయినా అతను మానసను వెంబడిస్తుండడంతో ఆమె తండ్రి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో పోలీసుల రఖిల్‌ను స్టేషన్‌కు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా రఖిల్.. మానసను వెంబడించడం మానలేదు.
మానస తనతో మాట్లాడేందుకు కూడా అంగీకరించకపోవడంతో ఆమెను హత్య చేయాలని రఖిల్ పథకం వేశాడు. మానస తన ఊరు నుంచి కొత్త మంగళం వచ్చి గాంధీ డెంటల్ అండ్ మెడికల్ సైన్సెస్ కాలేజీలో హౌస్ సర్జెన్సీ చేస్తోంది. ఆ కాలేజ్‌కు సమీపంలోనే ఒక రూమ్ తీసుకుని తన స్నేహితులతో కలిసి ఉంటోంది. ఈ విషయం తెలుసుకున్న రఖిల్ అక్కడకు సమీపంలో ఉన్న ఓ లాడ్జిలో గది తీసుకున్నాడు. నాలుగు రోజుల పాటు అక్కడ ఉండి రహస్యంగా మానసపై నిఘా పెట్టాడు. గత నెల 30న మధ్యాహ్నం 3 గంటలకు మానస రూమ్‌కు వెళ్లి తనతో పాటు తెచ్చుకున్న తుపాకీ తీసి మానసపై కాల్పులు జరిపాడు. వెంటనే తనను తాను కాల్చుకున్నాడు.