ఎర్నిమాంబ ఆలయ ఈఓగా సురేశ్‌బాబా
చార్జి తీసుకునేందుకు వెళ్లగా తను నగరంలో లేనని సమాధానం ఇచ్చిన దేవదాయ శాఖ అధికారిణి
మరికొన్నాళ్ల తనను ఇన్‌చార్జి (అదనపు బాధ్యతలు)గా కొనసాగించాలని కమిషనర్‌ను కోరినట్టు ప్రచారం
ఒక్కొక్కటిగా తగ్గుతున్న పోస్టులు
విశాఖపట్నం, మే 21 (ఆంధ్రజ్యోతి):
జ్ఞానాపురం ఎర్నిమాంబ ఆలయ ఈఓగా డీవీఎస్ సురేశ్‌బాబాను నియమిస్తూ దేవదాయ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆ ఆలయ ఈఓగా అసిస్టెంట్ కమిషనర్ కాళింగిరి శాంతి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సురేశ్‌బాబా గతంలో ఇసుకకొండ సత్యనారాయణ స్వామి ఆలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేశారు. ఆ తరువాత విజయనగరం జిల్లాలో సూపరింటెండెంట్ హోదాలో పనిచేస్తూ ఈ నెల ఆరో తేదీన గ్రేడ్-1 ఈఓగా పదోన్నతి పొందారు. ఈ నేపథ్యంలో ఖాళీగా వున్న ఎర్నిమాంబ ఆలయ ఈఓ పోస్టులో ఆయన్ను నియమిస్తూ 18వ తేదీన కమిషనర్ సంతకాలు చేశారు. అవి శుక్రవారం రాత్రి ఇక్కడకు చేరడంతో శనివారం వాటిని విశాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్.సుజాత...ఏసీ శాంతికి, సురేశ్‌బాబుకు సమాచారం అందించారు. ఎటువంటి జాప్యం లేకుండా తక్షణమే బాధ్యతలు చేపట్టాలని కమిషనర్ ప్రత్యేకంగా ఆదేశించినందున వెంటనే చార్జి తీసుకోవాలని సురేశ్‌బాబాకు ఆమె సూచించారు. ఆయన ఏసీ కార్యాలయానికి వెళ్లగా అక్కడ శాంతి లేరు. ఫోన్ ద్వారా ఆమెకు సమాచారం అందించారు. తాను విశాఖలో లేనని, సోమవారం వస్తానని, అప్పుడు చూద్దామని ఆమె సమాధానమిచ్చారు.
కొనసాగేందుకు ప్రయత్నం?
ఎర్నిమాంబ ఆలయ ఈఓగా బాధ్యతలు చేపట్టిన తరువాత దాతల నుంచి నిధులు సేకరించి ఆలయాన్ని అభివృద్ధి చేశానని, మరికొన్నాళ్లు అక్కడే కొనసాగుతానని, అంతవరకు ఆగాలంటూ డిప్యూటీ కమిషనర్ సుజాతకు ఏసీ శాంతి సూచించారు. బాధ్యతలు చేపట్టాలని సురేశ్‌బాబాపై ఒత్తిడి తేవద్దని చెప్పారు. దీనికి డీసీ స్పందిస్తూ కమిషనర్ ఉత్తర్వులు అమలు చేయడమే తన బాధ్యత అని స్పష్టంచేశారు. ఇదిలావుండగా, ఏసీ శాంతి అమరావతిలో కమిషనర్ హరి జవహర్‌లాల్‌ను కలిసి, తనను ఎర్నిమాంబ ఈఓగా మరి కొన్నాళ్లు కొనసాగించాలని కోరినట్టు తెలిసింది. ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నదీ తెలియలేదు. ఇటువంటి సందర్భాల్లో ఆలయానికి వెళ్లి అక్కడ ఏ ఉద్యోగి ఉంటే వారికి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే...ఆమె జిల్లా అధికారి కూడా కావడంతో తరువాత ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉన్నందున సురేశ్‌బాబా ఆ ప్రయత్నం చేయలేదని తెలిసింది. సోమవారం ఆమె బాధ్యతలు ఇస్తేనే తీసుకోవాలని వేచి చూస్తున్నట్టు సమాచారం. ఏమి జరుగుతుందో చూడాలి.
ఒక్కొక్కటిగా తగ్గుతున్న అదనపు పోస్టులు
జిల్లా అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఆ పోస్టుతో అదనంగా మరో మూడు పోస్టులు నిర్వర్తించేవారు. ఇటీవలె అనకాపల్లి జిల్లా ఏసీ బాధ్యతల నుంచి ఆమెను తప్పించారు. అక్కడ సూపరింటెండెంట్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. తాజాగా ఎర్నిమాంబ ఆలయ ఈఓ అదనపు బాధ్యతలు కూడా తప్పించారు. ఆమె దగ్గర ఇంకా కనకమహాలక్ష్మి ఆలయ ఈఓ పోస్టు అదనంగా ఉంది. ఈ నెలాఖరులోగా పదోన్నతులు, బదిలీల ప్రక్రియ చేపట్టి దానిని కూడా కొత్తవారితో భర్తీ చేస్తారని సమాచారం. అలా జరిగితే శాంతికి విశాఖ ఏసీ పోస్టు ఒక్కటి మాత్రమే మిగులుతుంది.