రెండేళ్ల తర్వాత ‘నవమి’ శోభ

ABN , First Publish Date - 2022-04-10T16:27:17+05:30 IST

సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు నగరం సిద్ధమైంది. ఇందుకోసం ఆలయాలను సర్వాంగ

రెండేళ్ల తర్వాత ‘నవమి’ శోభ

నేటి శోభాయత్రకు భారీ ఏర్పాట్లు

అడుగడునా నిఘా 

రంగంలోకి ప్రత్యేక టీమ్‌లు

హైదరాబాద్/అఫ్జల్‌గంజ్‌: సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు నగరం సిద్ధమైంది. ఇందుకోసం ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. శ్రీ రామనవమి సందర్భంగా ఆదివారం భారీ శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అన్ని శాఖలనూ సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలు ప్రశాంతంగా సాగేలా పోలీసులు చర్యలు చేపట్టారు. శోభాయాత్రలో భారీ హనుమంతుడు, శ్రీరాముడు, భరతమాత, ఛత్రపతి శివాజీ విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కరోనా కారణంగా రెండేళ్లు బ్రేక్‌ రావడంతో ఈసారి అత్యంత వైభవంగా జరిపేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. సీతారాంబాగ్‌ నుంచి భాగ్యనగర్‌ శ్రీరామ నవమి ఉత్సవ సమితి అధ్యక్షుడు డాక్టర్‌ భగవంత్‌ రావు, ప్రధాన కార్యదర్శి గోవింద్‌ రాఠీల ఆధ్వర్యంలో శోభాయాత్ర ప్రారంభం కానుంది. ధూల్‌పేట్‌, జాలీ హనుమాన్‌, చుడీబజార్‌, గౌలిగూడ మీదుగా హనుమాన్‌ టేకిడీలోని హనుమాన్‌ వ్యాయామశాల వద్దకు చేరుకుంటుంది. అక్కడ మైదానంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై భారీ సభ నిర్వహిస్తారు. దారి పొడవునా స్వాగత వేదికలు ఏర్పాటు చేశారు. 


మద్యం దుకాణాలు బంద్‌ 

శ్రీరామ నవమి సందర్భంగా ఆదివారం నగరంలో మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్‌లు మూసివేయాలని ట్రై కమిషనరేట్‌ సీపీలు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం ఉదయం 6:00 నుంచి సోమవారం ఉదయం 6 వరకు ఆదేశాలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. 


ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలి : సీపీ

శ్రీరామ నవమి శోభాయాత్ర ఏర్పాట్లపై శనివారం సీపీ సీవీ ఆనంద్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రద్దీ ప్రదేశాలు, సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాల మోహరింపు, సీసీ కెమెరాల ఏర్పాటు, డ్రోన్లతో నిఘా కొనసాగాలని సూచించారు. యాత్ర నిర్వాహకులు అనుమతి తీసుకున్న మార్గంలోనే వెళ్లాలని, ఆయా రూట్లలో సాధారణ ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సీపీ కోరారు. శోభాయాత్ర రూట్‌ మ్యాప్‌ను పరిశీలించారు. సమావేశంలో అడిషనల్‌ సీపీ డీఎస్‌ చౌహాన్‌, జాయిట్‌ సీపీలు పి. విశ్వప్రసాద్‌, కార్తికేయ, రమేష్‌, ఏవీ రంగనాథ్‌, డీసీపీలు కరుణాకర్‌, జి చక్రవర్తితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-04-10T16:27:17+05:30 IST