Eknath Shinde పై శివసేన వేటు, శాసనసభాపక్ష నేత పదవి నుంచి తొలగింపు

ABN , First Publish Date - 2022-06-21T21:50:05+05:30 IST

మహారాష్ట్రలోని అధికార శివసేన పార్టీలో తలెత్తిన రాజకీయ సంక్షోభం తీవ్రమవుతున్న సంకేతాలు..

Eknath Shinde పై శివసేన వేటు, శాసనసభాపక్ష నేత పదవి నుంచి తొలగింపు

ముంబై: మహారాష్ట్రలోని అధికార శివసేన పార్టీలో తలెత్తిన రాజకీయ సంక్షోభం తీవ్రమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కొందరు పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయి, సూరత్‌‍లో బస చేసిన పార్టీ నేత ఏక్‌నాథ్ షిండేపై శివసేన వేటు వేసింది. శాసనసభా పక్ష నేత పదవి నుంచి ఆయనను తొలగించింది. ఆయన స్థానంలో శివసేన లెజస్లేటివ్ పార్టీ నేతగా సెవ్రి ఎమ్మెల్యే అజయ్ చౌదరి వ్యవహరించనున్నారు.


తాజా పరిణామాలపై ఏక్‌నాథ్ షిండే తక్షణం స్పందించనప్పటికీ, మహారాష్ట్రలో తలెత్తిన రాజకీయ పరిణామాలతో తమ పార్టీకి ఎలాంటి ప్రమేయం లేదని మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ తెలిపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ప్రతిపాదనతో షిండే ముందుకు వస్తే దానిని బీజేపీ తప్పనిసరిగా పరిశీలిస్తుందని చెప్పారు.


ఇది మూడోసారి : పవార్

తాజా పరిణామాలపై ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ ఢిల్లీలో మాట్లాడుతూ, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరుగుతున్న మూడో ప్రయత్నమిదని అన్నారు. ఇది శివసేన అంతర్గత వ్యవహారమైనందున ఉద్ధవ్ థాకరే పరిస్థితిని చక్కబెడతారనే నమ్మకం తనకుందని చెప్పారు.


అసెంబ్లీలో బలాబలాలు..

288 మంది సభ్యుల మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేనకు 55 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎన్‌సీపీకి 53, కాంగ్రెస్ 44, బహుజన్ వికాస్ అఘాడి 3, సమాజ్‌వాదీ పార్టీ 2, ఏఐఎంఐఎం 2, ప్రహర్ జన్‌శక్తి పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంఎన్ఎస్, సీపీఎం, పీడ్ల్యూపీ, స్వాభిమాని పక్ష, రాష్ట్రీయ సమాజ్ పార్టీ, జన్‌సురాజ్య శక్తి పార్టీ, క్రాంతికారి షెట్కారి ప్రక్ష ఒక్కొక్క ఎమ్మెల్యేను కలిగి ఉన్నాయి. బీజేపీకి 106 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా, 13 మంది స్వతంత్ర అభ్యర్థులుగా ఉన్నారు. కాగా, మహావకాస్ అఘాడి ప్రభుత్వానికి ఎలాంటి ముప్పూ లేదని ఎన్‌సీపీ, కాంగ్రెస్ నేతలు తాజా పరిణామాలపై వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-06-21T21:50:05+05:30 IST