4 న షిండే బల పరీక్ష

ABN , First Publish Date - 2022-07-02T08:21:59+05:30 IST

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం తుది అంకానికి చేరు కుంటోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శివసేన రెబెల్‌ నేత ఏక్‌నాథ్‌ శంబాజీ షిండే బలపరీక్షకు సిద్ధమయ్యారు.

4 న షిండే  బల పరీక్ష

3, 4 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు

ముంబై, జూలై 1: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం తుది అంకానికి చేరు కుంటోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శివసేన రెబెల్‌ నేత ఏక్‌నాథ్‌ శంబాజీ షిండే బలపరీక్షకు సిద్ధమయ్యారు. ఈ నెల 3, 4 తేదీల్లో అసెంబ్లీ సమావేశానికి గవర్నర్‌ కోశ్యారీ ఉత్తర్వులిచ్చారు. దీని ప్రకారం 4న షిండే ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకోనుంది. మూడో తేదీన స్పీకర్‌ ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి గవర్నర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. శనివారం మధ్యాహ్నం 12.30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. బీజేపీ నుంచి కోలాబా శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్‌ నర్వేకర్‌ స్పీకర్‌ పదవికి నామినేషన్‌ వేశారు. ఈ పదవికి బీజేపీ పోటీ పడడం ఇదే మొదటిసారి! ఆయనకు పోటీ లేకుంటే ఏకగ్రీవంగా ఎన్నిక వుతారు.


రాహుల్‌ సభాధ్యక్షతలో 4వ తేదీన షిండే సర్కారు తన బలాన్ని నిరూపించుకోనుంది. అయితే.. తమకు 175మంది సభ్యుల బలం ఉందని.. సోమవారం జరిగే బలపరీక్ష లాంఛనమేనని సీఎం ఏక్‌నాథ్‌ షిండే స్పష్టం చేశారు. గురువారం రాత్రి ప్రమాణస్వీకారం, తొలి కేబినెట్‌ భేటీ తర్వాత ఆయన అర్ధరాత్రి గోవా వెళ్లారు. అక్కడి విమానాశ్రయంలో, రెబెల్‌ ఎమ్మెల్యేలు ఉంటున్న దోనా పౌలా రిసార్ట్‌లో ఏక్‌నాథ్‌ విలేకరులతో మాట్లాడారు. తనకు మద్దతిచ్చిన 50 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానన్నారు. కాగా, 2019 ఎన్నికల తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తన మాటపై కట్టుబడి ఉండి ఉంటే ఇప్పు డు మహారాష్ట్రలో బీజేపీ సీఎం ఉండేవారని తాజా మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. 2019 ఎన్నికల్లో అధికారాన్ని పంచుకునే(రొటేటింగ్‌) ఒప్పందంతో ఎన్నికలకు వెళ్లామని.. పొత్తును పక్కనపెట్టిన బీజేపీ సొం తంగా ప్రభుత్వానికి సిద్ధపడిందని గుర్తుచేశారు.


‘‘ఆ పరిస్థితుల్లో ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాను. అప్పట్లో అమిత్‌షా తన మాటపై ఉండి ఉంటే.. మా పదవీకాలం పూర్తయి.. ఇప్పుడు బీజేపీ సీఎం ఉండేవాడు’’ అన్నారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని ‘శివసేనను విభజించి బీజేపీ ఏర్పాటు చేసిన సర్కారు’ అని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ విమర్శిం చారు. మరోవైపు, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ శుక్రవారమంతా వరుస సమావేశాలతో బిజీబిజీగా గడిపారు. ప్రభుత్వ కూర్పు, భవిష్యత్‌ ప్రణాళికలు, విపక్షంలో స్వపక్షాలు, రాజకీయ సమీకరణలపై పలువురు నేతలతో చర్చించినట్లు తెలిసింది. కాగా, షిండేకు మద్దతిస్తున్న 16 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేయాలని ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో శివసేన పిటిషన్‌ దాఖలు చేసింది. 

Updated Date - 2022-07-02T08:21:59+05:30 IST