ఆరునెలల అనంతరం...

ABN , First Publish Date - 2020-09-30T11:25:32+05:30 IST

అర్ధ సంవత్సరం పైబడి అంటే.. 192 రోజుల అనంతరం బుధవారం కడప, పులివెందులలోని శిల్పారామాలు ..

ఆరునెలల అనంతరం...

నేడు తెరుచుకోనున్న శిల్పారామం

కొవిడ్‌ నిబంధనలు పాటించాలి

మాస్కు లేకుంటే అనుమతి లేదు


కడప (సిటి), సెప్టెంబరు 29: అర్ధ సంవత్సరం పైబడి అంటే.. 192 రోజుల అనంతరం బుధవారం కడప, పులివెందులలోని శిల్పారామాలు తెరుచుకోనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కార్యక్రమాలు కొనసాగనున్నాయి. రోజువారీ పనులతో అలసట చెందిన పెద్దల మనసు, శరీరానికి కాసింత ఊరట కలిగించేలా పిల్లలు ఆనందభరిత వాతావరణంలో ఆడుకునేందుకు వీలుగా శిల్పారామాలు ఏర్పాటు చేశారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా మార్చి 22న జనతా కర్ఫ్యూ అనంతరం 23 నుంచి కొనసాగిన లాక్‌డౌన్‌లతో శిల్పారామం తలుపులు మూసుకుపోయాయి.


లాక్‌డౌన్‌ సడలింపులు కల్పించినా శిల్పారామంకు ప్రభుత్వం అనుమతినివ్వలేదు. జనం ఒకే చోట పెద్ద సంఖ్యలో గుమికూడతారని, తద్వారా కరోనా వ్యాప్తి చెందే అవకాశాలుంటాయని ప్రారంభానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వలేదు. కాగా కరోనా పట్ల ప్రజల్లో అవగాహన పెరిగిందని, నిబంధనలు పాటిస్తూ శిల్పారామం ఆనందాన్ని అనుభవించేందుకు ప్రభుత్వం తలుపులు తెరిచే చర్యలకు ఉపక్రమించింది.


మాస్కు లేకుంటే.. అనుమతి ఉండదు

సుదీర్ఘ విరామం తరువాత నేడు శిల్పారామం పునఃప్రారంభిస్తున్నట్లు కడప శిల్పారామం పరిపాలనాధికారి పి.శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. అయితే ప్రభుత్వ ఆదేశాల  మేరకు కొవిడ్‌ నిబంధనలు తప్పకుండా అమలు చేయనున్నట్లు చెప్పారు. మాస్కు లేకుండా వచ్చేవారికి ఏ పరిస్థితుల్లో అనుమతి ఉండదని, పిల్లలు, పెద్దలు ఎవరికీ మినహాయింపు ఉండబోదని స్పష్టం చేశారు. శిల్పారామం లోపలికి వచ్చేవారితో పాటు సిబ్బందికి కూడా ధర్మల్‌ స్ర్కీనింగ్‌, శానిటైజేషన్‌ చేస్తామని చెప్పారు. శిల్పారామం లోపల భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 

Updated Date - 2020-09-30T11:25:32+05:30 IST