తగ్గేదే లే.., నన్ను రాజకీయాల నుంచి తప్పించలేరు

ABN , First Publish Date - 2022-04-13T13:24:39+05:30 IST

అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు వీకే శశికళ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ బహిష్కరణ కేసుకు సంబంధించి ఆమెకు చెన్నై కోర్టులో ఎదురు దెబ్బ తగిలినా

తగ్గేదే లే.., నన్ను రాజకీయాల నుంచి తప్పించలేరు

- కార్యకర్తల కల త్వరలో నెరవేరుతుంది

- పార్లమెంటు ఎన్నికల్లోగా అన్నాడీఎంకేలో పెనుమార్పులు

- ఆధ్యాత్మిక పర్యటనలో శశికళ


ప్యారీస్‌(చెన్నై): అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు వీకే శశికళ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ బహిష్కరణ కేసుకు సంబంధించి ఆమెకు చెన్నై కోర్టులో ఎదురు దెబ్బ తగిలినా ‘తగ్గేదేలే’దంటూ ఆమె తన అభిమానుల్ని ఊరటకలిగే ప్రకటన చేశారు. తనను రాజకీయాల నుంచి ఎవ్వరూ తొలగించలేరని, వారి కోరిక కల్లగానే మిగిలిపోతుందని ప్రకటించారు. మంగళవారం ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టిన శశికళ సేలం జిల్లా ఎడప్పాడి బస్టాండు ప్రాంగణంలోని కామరాజర్‌, రాజాజీ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నంజుండేశ్వరాలయం, తారమంగళంలోని కైలాసనాధర్‌ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శశికళ మీడియాతో మాట్లాడుతూ.. కోట్లాదిమంది కార్యకర్తలున్న అన్నాడీఎంకేకు ఏకనాయత్వం ఉండాలని అంతా ఎదురు చూస్తున్నారన్నారు. అది త్వరలోనే నెరవేరుతుందని ఉద్ఘాటించారు. తనను రాజకీయాల నుంచి తరిమేయడం ఎవ్వరివల్లా కాదని ధీమా వ్యక్తం చేశారు. అవినీతిని పారదోలేందుకు దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ అన్నాడీఎంకేను స్థాపించారని, ఆయన తరువాత జయలలిత పార్టీ పగ్గాలు చేపట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి చరిత్రలో నిలిచిపోయారని వెల్లడించారు. ఎంజీఆర్‌, జయ ఆశయాలకు అనుగుణంగా పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమన్నారు.  తాను రాజకీయాల్లో ఉండాలా, లేదా అన్నది అన్నాడీఎంకే సభ్యత్వం ఉన్నవారు నిర్ణయిస్తారని, ఇతరులెవ్వరూ ఆ పార్టీతో తనకున్న బంధాన్ని విడదీయలేరన్నారు. తాను మళ్లీ పార్టీలోకి రావాలని కార్యకర్తల ఆశలు నెరవేర్చే అవకాశం త్వరలోనే వస్తుందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లోపు అన్నాడీఎంకేలో పెనుమార్పులు సంభవించడం ఖాయమన్నారు. ‘ఈపీఎస్‌, ఓపీఎస్ లతో కలిసి చర్చిస్తారా?’ అని మీడియా అడగ్గా.. ‘‘కొంచెం వేచి చూడండి, జరగాల్సినవన్నీ జరుగుతాయి. సమస్యలన్నీ తొలగిపోయి, మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి’’ అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ‘ఈ ఆధ్యాత్మిక పర్యటన రాజకీయ పర్యటనగా మారే అవకాశముందా?’ అని మీడియా అడగ్గా.. ‘‘అలా కూడా మారవచ్చు’’ అంటూ నవ్వులు పూయించారు. 

Updated Date - 2022-04-13T13:24:39+05:30 IST