అమిత్ షాతో భేటీ తర్వాత శరద్ పవార్ సంచలన ట్వీట్

ABN , First Publish Date - 2021-08-03T23:29:21+05:30 IST

దేశంలో చక్కెర ఉత్పత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర

అమిత్ షాతో భేటీ తర్వాత శరద్ పవార్ సంచలన ట్వీట్

న్యూఢిల్లీ : దేశంలో చక్కెర ఉత్పత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షాకు  మంగళవారం  నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ వివరించారు. పరిమితికి మించి చక్కెర ఉత్పత్తి అవుతుండటం వల్ల సమస్యలను ఎదుర్కొనవలసి వస్తోందని తెలిపారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ), పంచదార మిల్లుల ప్రాంగణాల్లో ఇథనాల్ తయారీ యూనిట్ల ఏర్పాటుకు అనుమతి వంటి అంశాలపై చర్చించారు. ఈ వివరాలను శరద్ పవార్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. 


శరద్ పవార్ ఇచ్చిన ట్వీట్‌లో, తాను కేంద్ర హోం మంత్రి, సహకార శాఖ మంత్రి అమిత్ షాతో న్యూఢిల్లీలో సమావేశమైనట్లు తెలిపారు. ఈ సమావేశంలో నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ సుగర్ ఫ్యాక్టరీస్ లిమిటెడ్ ప్రెసిడెంట్ జయప్రకాశ్ దండేగావ్‌కర్, ఈ ఫెడరేషన్ ప్రతినిధి ప్రకాశ్ నైక్‌నవ్రే పాల్గొన్నట్లు చెప్పారు. సుగర్ కోఆపరేటివ్ సెక్టర్ ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. దేశంలో ప్రస్తుతం చక్కెర ఉత్పత్తి పరిస్థితులపై చర్చించామన్నారు. డిమాండ్ కన్నా ఎక్కువగా చక్కెర ఉత్పత్తి జరుగుతుండటం వల్ల ఎదురవుతున్న సమస్యలపై కూడా మాట్లాడామని తెలిపారు. ఎంఎస్‌పీ, ఇథనాల్ ఉత్పత్తి యూనిట్లకు అనుమతుల గురించి ప్రస్తావించామని చెప్పారు. సుగర్ మిల్లుల ప్రాంగణాల్లో ఇథనాల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ల ఏర్పాటుకు అనుమతులివ్వడంపై చర్చించామన్నారు. ఈ సమస్యలను అమిత్ షా సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తారని ఆశిస్తున్నామన్నారు. 


దేశంలో కొత్త సహకార మంత్రిత్వ శాఖకు తొలి మంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు అమిత్ షాను అభినందించామని తెలిపారు. ఈ సమావేశం అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ, చక్కెర అమ్మకం ధరలపై అమిత్ షాతో చర్చించినట్లు తెలిపారు. చక్కెర అమ్మకం ధర దాని ఉత్పాదక వ్యయం కన్నా తక్కువగా ఉందన్నారు. దీనిపై పరిశీలించాలని కోరినట్లు చెప్పారు. పెట్రోలియం ఉత్పత్తుల్లో ఇథనాల్‌ను కలపడాన్ని మరింత పెంచవలసిన అవసరం ఉందని చెప్పినట్లు వివరించారు.


శరద్ పవార్ కొద్ది రోజుల క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కూడా సమావేశమైన సంగతి తెలిసిందే. అమిత్ షాతో సమావేశంలో మహారాష్ట్ర రాజకీయాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. 


మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 


Updated Date - 2021-08-03T23:29:21+05:30 IST