ఆలయాల్లో శని అమావాస్య పూజలు

ABN , First Publish Date - 2021-12-05T04:38:16+05:30 IST

శని అమావాస్యను పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం పంచగామలోని శనైశ్చర ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు కోసం బారులుతీరారు.

ఆలయాల్లో శని అమావాస్య పూజలు
శనైశ్చర విగ్రహానికి తైలాభిషేకం చేస్తున్న భక్తులు

కర్ణాటక, మహారాష్ట్ర నుంచి తరలివచ్చిన భక్తులు

నారాయణఖేడ్‌, డిసెంబరు 4 : శని అమావాస్యను పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం పంచగామలోని శనైశ్చర ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు కోసం బారులుతీరారు. శనివారం అమావాస్య రావడం అరుదు కావడంతో, అలా వచ్చే శని అమావాస్య రోజు శనీశ్వరుడికి కొబ్బరికాయ నైవేద్యంగా సమర్పించి తైలాభిషేకం చేస్తే శనిబాధల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. కార్తీకమాసం చివరిరోజు శనివారం రావడంతో జిల్లా నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. కొబ్బరికాయలను నైవేద్యంగా సమర్పించి, తైలంతో శనైశ్చరుడికి అభిషేకం చేయించారు. అనంతరం ఆలయ పీఠాధిపతి కాశీనాథ్‌ మహరాజ్‌ బాబా ఆశీస్సులు పొందారు. ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.  కొండాపూర్‌లోని హనుమాన్‌ ఆలయంలయానికి కూడా భక్తులు  పోటెత్తారు. పూజల అనంతరం ఆశ్రమ పీఠాధిపతి సంగ్రాం మహరాజ్‌ ఆశీర్వచనాలు అందించారు. 

కేతకీ సంగమేశ్వర ఆలయంలో..

ఝరాసంగం: శని అమావాస్య, కార్తీకమాస ముగింపు సందర్భంగా కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే, మండల పరిధిలోని ఏడాకులపల్లి శివారులోని సప్తపూరి శని ఘాట్‌ క్షేత్రంలో భక్తులు పూజలు నిర్వహించారు. బర్దిపూర్‌ దత్తగిరి ఆశ్రమ ఆవరణలో ఏర్పాటుచేసిన శనైశ్చర విగ్రహానికి తైలాభిషేకాలుచేసి మొక్కులు తీర్చుకున్నారు. 

Updated Date - 2021-12-05T04:38:16+05:30 IST