రవాణా పేరుతో ఘరానా మోసం

ABN , First Publish Date - 2020-08-09T08:31:07+05:30 IST

కార్గో, గూడ్సు సర్వీసుల రవాణా కాంట్రాక్టులు ఇప్పిస్తానంటూ.. మోసాలకు పాల్పడుతూ...

రవాణా పేరుతో ఘరానా మోసం

  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కాంట్రాక్టుల పేరుతో కుచ్చుటోపీ
  • రూ. లక్షలు కొల్లగొడుతున్న సైబర్‌ నేరస్థుడి అరెస్టు


హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): కార్గో, గూడ్సు సర్వీసుల రవాణా కాంట్రాక్టులు ఇప్పిస్తానంటూ.. మోసాలకు పాల్పడుతూ రూ. లక్షలు కొల్లగొడుతున్న ఘరానా సైబర్‌ నేరగాడి ఆటకట్టించారు హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన డొల్ల నాగేశ్వరరావు హైదరాబాద్‌లోని గాజులరామారంలో ఉంటున్నాడు. గతంలో లారీ డ్రైవర్‌గా ఓ ట్రాన్స్‌పోర్టు సంస్థలో పనిచేశాడు. ఆ అనుభవంతో ట్రాన్స్‌పోర్టు సంస్థల యజమానులను ఎలా బురిడీ కొట్టించొచ్చు, ఎలా అడ్డదారిలో డబ్బులు సంపాదించొచ్చో తెలుసుకున్నాడు. ఇలా ఇప్పటివరకు నగరంలోని ట్రై కమిషనరేట్స్‌ పరిధిలో పలువురు ట్రాన్స్‌పోర్టు యజమానులను మోసం చేసి రూ. 20 లక్షల వరకు కొల్లగొట్టినట్లు పోలీసులు ధ్రువీకరించారు. 


శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కాంట్రాక్టులంటూ..

ముందుగా ఓ పథకం ప్రకారం లారీలు, బస్సులను కిరాయిలకు నడిపే ట్రాన్స్‌పోర్టు సంస్థల యజమానులకు ఫోన్‌ చేసి తనను తాను ఒక గూడ్స్‌ సర్వీసు సంస్థ లేదా ఓ కార్గో సర్వీసు సంస్థ ఎండీ వద్ద పీఏగా పరిచయం చేసుకుంటాడు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు వస్తు రవాణా చేయడానికి కొన్ని వాహనాలు అద్దెకు కావాలని నమ్మిస్తాడు. ప్రతినెలా లక్షల్లో ఆదాయం వస్తుందని బురిడీ కొట్టిస్తాడు. మీకు ఇష్టమైతే మిగిలిన విషయాలు మా ఎండీతో మాట్లాడుకోండి అని ఓ ఫోన్‌ నంబర్‌ ఇస్తాడు. అతడి మాటలు నమ్మిన కొందరు యజమానులు ఆ నంబర్‌కు ఫోన్‌ చేయగా అతడే తన గొంతు మార్చి మాట్లాడుతాడు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి వస్తు రవాణా చేయడానికి వాహనాలు కావాల్సిన మాట నిజమేనని, మీ వాహనాల వివరాలు పంపిస్తే మిగతా వివరాలు చెప్తాను అం టూ ట్రాన్స్‌పోర్టు యజమానులను నమ్మిస్తాడు. రెండు గంటల తర్వాత వారికి ఫోన్‌ చేసి మీ వాహనాలు మాకు ఓకే. అయితే మీలాంటి వారు ఎంతోమంది ఈ కాంట్రాక్టు కోసం పోటీపడుతున్నారు. ఈ కాంట్రాక్టు మీకే రిజిస్టర్‌ చేయాలంటే ముందుగా కొంత డబ్బు చెల్లించి రిజర్వు చేయించుకోండి అని చెప్పేవాడు. అంతేకాదు సెక్యూరిటీ డిపాజిట్‌, అగ్రిమెంట్‌ చార్జీల కింద కూడా వాహనాల సంఖ్యను బట్టి రూ.లక్ష నుంచి 6లక్షల వరకు బ్యాంకు ఖాతాలో డిపాజిట్‌ చేయించుకునేవాడు. ఆ తర్వాత కాంట్రాక్టు ఎంత వరకు వచ్చింది. ఎప్పటి నుంచి వాహనాలు పంపాలి అని తెలుసుకోవడం కోసం ట్రాన్స్‌పోర్టు యజమానులు ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ చేసి ఉన్నాయి.


ఇలా అఫ్జల్‌గంజ్‌కు చెందిన గోవిందరాజు అనే యజమానిని ఇటీవల కార్గో సర్వీసు పేరుతో మోసం చేసి రూ. 92 వేలు కాజేశాడు. తన పేరును (నాగేశ్వరరావు) సుబ్బారెడ్డిగా మార్చుకున్నాడు. తానొక కార్గో సంస్థ యజమాని మల్లయ్య వద్ద సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నానని రెండు బస్సులు అద్దెకు కావాలని నమ్మించాడు. ఆ తర్వాత గొంతు మార్చి తానే మల్లయ్యగా మాట్లాడి బాధితుడిని నమ్మించాడు. అనంత రం బాధితుడు ఫోన్‌ చేస్తే స్విచాఫ్‌ చేసి ఉంది. మోసపోయానని గ్రహించి సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌రామిరెడ్డి నిందితున్ని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.  

Updated Date - 2020-08-09T08:31:07+05:30 IST