ఆ రెండు చోట్ల ‘షేమ్ సీన్!’

ABN , First Publish Date - 2020-09-15T16:34:05+05:30 IST

సచివాలయ ఉద్యోగుల పొరపాట్లు, గ్రామ వలంటీర్లు, అధికార పార్టీ నేతల..

ఆ రెండు చోట్ల ‘షేమ్ సీన్!’

తోటకూరపాలెం, పొట్నూరు ఆర్‌బీకేల్లో ఎరువులు పక్కదారి పట్టినట్టు నిర్ధారణ

అనారోగ్య కారణాలతో సెలవులో సిబ్బంది

ఎరువుల బుకింగ్‌ కోసం పాస్‌వర్డ్‌, ఓటీపీ చెప్పాలన్న వలంటీర్లు, అధికార పార్టీ నేతలు

గుడ్డిగా వివరాలు చెప్పిన ఇన్‌చార్జులు

ఇష్టారాజ్యంగా ఎరువుల బుకింగ్‌... దారిమళ్లింపు

అధికారుల విచారణలో వెలుగుచూసిన వాస్తవాలు

బాధ్యులపై క్రిమినల్‌ చర్యలు?


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): సచివాలయ ఉద్యోగుల పొరపాట్లు, గ్రామ వలంటీర్లు, అధికార పార్టీ నేతల తప్పుడు ఆలోచనల కారణంగానే రైతు భరోసా కేంద్రాల్లో యూరియా పక్కదారి పట్టినట్టు అధికారుల విచారణలో తేలింది. రావికమతం మండలం తోటకూరపాలెంలో గ్రామ ఉద్యానవన సహాయకురాలు, పద్మనాభం మండలం పొట్నూరులో గ్రామ వ్యవసాయ సహాయకుడు...అనారోగ్యానికి గురికావడంతో పాస్‌వర్డ్‌ను స్థానిక వలంటీర్లకు చెప్పారు. స్థానిక వైసీపీ నాయకులు, వలంటీర్లు కుమ్మక్కై అడ్డగోలుగా ఎరువులను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుని, పక్కదారి పట్టించి సొమ్ము చేసుకున్నారు. ఈ రెండు గ్రామాల్లో అధికారులు నిర్వహించిన విచారణలో పలు విషయాలు వెల్లడయ్యాయి.

 

తోటకూరపాలెం రైతు భరోసా కేంద్రం ఇన్‌చార్జిగా వున్న గ్రామ ఉద్యానవన సహాయకురాలు జూలైలో అనారోగ్యానికి  గురవడంతో దీర్ఘకాలిక సెలవు పెట్టారు. ఇదే సమయంలో యూరియాను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవ డానికి పలువురు రైతులు ఆర్‌బీకేకు రావడంతో గ్రామ వలంటీర్‌ ఒకరు...గ్రామ ఉద్యానవన సహాయకురాలికి ఫోన్‌ చేశారు. తాను సెలవులో వున్నానని ఆమె చెప్పడంతో.... ఆన్‌లైన్‌లో ఎరువులు బుక్‌ చేసే సైట్‌ను ఓపెన్‌ చేయడానికి పాస్‌వర్డ్‌ చెప్పాలని అడిగాడు. అతనిపై నమ్మకంతో ఆమె పాస్‌వర్డ్‌ చెప్పారు. ఆ తరువాత సెల్‌ఫోన్‌కు వచ్చే ఓటీపీ నంబర్‌ కూడా వలంటీర్‌కు చెబుతున్నారు. దీంతో వలంటీర్‌, అధికార పార్టీకి చెందిన స్థానిక నేత ఒకరు భారీగా యూరియాను బుక్‌ చేశారు.


దీనిలో సుమారు 200 బస్తాల యూరియాను సదరు నేత బంధువైన ఒక ఎరువుల వ్యాపారి ఇంటికి తరలించారు. ఆలస్యంగా ఈ విషయం తెలుసుకున్న మిగిలిన రైతులు ఆందోళన చేయడం, పత్రికల్లో వార్తలు రావడంతో వ్యవసాయ శాఖ అధికారులు ఉలిక్కిపడ్డారు. జేడీ ఆదేశాల మేరకు నర్సీపట్నం ఏడీ తోటకూరపాలెం వెళ్లి విచారణ చేపట్టారు. కానీ ఇరువర్గాల వారు వాదనకు దిగడంతో విచారణను వాయిదా వేశారు. అయితే ప్రాథమికంగా ఉద్యానవన సహాయకురాలు, మండల వ్యవసాయాధికారి నుంచి కొంత సమాచారం తీసుకున్నారు. ఉద్యానవన సహాయకురాలు పాస్‌వర్డ్‌, ఓటీపీ వివరాలు చెప్పిన విషయం బయటకు వచ్చింది. 


పద్మనాభం మండలం పొట్నూరు ఆర్‌బీకేలో కూడా దాదాపు ఇదేవిధంగా ఎరువులు పక్కదారి పట్టాయి. ఇక్కడ గ్రామ వ్యవసాయ సహాయకుడికి కరోనా సోకడంతో విధులకు రాలేకపోయారు. అధికార పార్టీకి చెందిన స్థానిక నేతలు...వ్యవసాయ సహాయకుడితో తమకున్న పరిచయాల మేరకు ఫోన్‌ చేసి, రైతులకు యూరియా బుక్‌ చేయాలంటూ పాస్‌వర్డ్‌, ఓటీపీ వివరాలు అడిగారు. వారిపై నమ్మకంతో ఆయన వాటి వివరాలు తెలియజేశారు. అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతలు 20 బస్తాల డీఏపీ, 120 బస్తాల యూరియా...మొత్తం 150 బస్తాల ఎరువును తమ ఇళ్లకు తీసుకువెళ్లి అక్కడి నుంచి రైతులకు అందజేశారు. ఆర్‌బీకేలో ఇవ్వాల్సిన ఎరువులు, నాయకుల ఇళ్ల వద్ద ఇవ్వడం ఏమిటంటూ పలువురు రైతులు వ్యవసాయ ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు. దీనిపై భీమిలి ఏడీ విచారణ చేపట్టారు. వ్యవసాయ సహాయకుడి పాస్‌వర్డ్‌, ఓటీపీ వివరాలను ఇతరులకు చెప్పడమే ఈ సమస్యకు కారణమని నిర్ధారణ అయ్యింది.


క్రిమినల్‌ చర్యలు?

తోటకూరపాలెం, పొట్నూరు ఆర్‌బీకేల్లో ఎరువులు పక్కదారి పట్టడానికి సంబంధిత ఇన్‌చార్జులే కారణమని అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు. పాస్‌వర్డ్‌, ఓటీపీ వివరాలను ఇతరులకు చెప్పినందుకు సదరు ఉద్యోగులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా తోటకూర పాలెంలో సంబంధిత వలంటీర్‌తోపాటు ఎరువులను అడ్డగోలుగా బుక్‌ చేసిన అధికార పార్టీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం.

Updated Date - 2020-09-15T16:34:05+05:30 IST