న్యూఢిల్లీ : మరికొద్ది రోజుల్లో పెట్రోలు ధర లీటరు రూ. 200 కు చేరుకోవచ్చన్న వార్తలు ఇప్పుడు షికారు చేస్తున్నాయి. ఇందుకు కారణం... దేశ అవసరాలకు కావాల్సిన ఇంధనలో 80 శాతానికి పైగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడమేనని ఇంధనరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ కొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో దీపావళి పండుగ సందర్భంగా కేంద్రం... పెట్రోల్‌పై రూ. 5, డీజిల్‌పై రూ. 10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి భారాన్ని కాస్త దింపింది. దీంతో పెట్రోల్ ధరలు కాస్త తగ్గాయి.
అయితే, ఈ ఉపశమనం తాత్కాలికమేనని ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరుగుతాయని చెబుతున్నారు. దేశంలో రానున్న నెలల్లో ఇంధన ధరల పెరుగుదలపై ఇంధన నిపుణులు స్పందిస్తూ, 2023 నాటికి మరో రూ. 100 పెరిగి లీటర్ పెట్రోల్ రూ. 200 లకు చేరుతుందని అంచనా. దేశంలో వినియోగించే చమురులో 86 శాతం విదేశాల నుంచి దిగుమతి అవుతుంది కాబట్టి.. వీటి ధరలు కేంద్రం నియంత్రణలో ఉండబోవని చెబుతున్నారు. డిమాండ్-సరఫరాలో సమతుల్యత లేని సందర్భాల్లో ధరలు పెరుగుతాయన్న అభిప్రాయాలు వినవస్తున్నాయి. అందువల్ల ఇంధన ధరలను అదుపులోకి రావాలంటే... జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడమొక్కటే మార్గమని, లేదా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలన్న సూచనలు వ్యక్తమవుతున్నాయి.