పాక్‌లో భారతీయ సిక్కు భక్తులు క్షేమం : ఎస్‌జీపీసీ

ABN , First Publish Date - 2021-04-14T21:41:50+05:30 IST

బైశాఖి సందర్భంగా పాకిస్థాన్‌ వెళ్ళిన సిక్కు భక్తులు క్షేమంగా ఉన్నారని

పాక్‌లో భారతీయ సిక్కు భక్తులు క్షేమం : ఎస్‌జీపీసీ

అమృత్‌‌సర్ : బైశాఖి సందర్భంగా పాకిస్థాన్‌ వెళ్ళిన సిక్కు భక్తులు క్షేమంగా ఉన్నారని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్‌జీపీసీ) కార్యదర్శి మొహిందర్ సింగ్ చెప్పారు. తెహరీక్-ఈ-లబాయక్ పాకిస్థాన్ (టీఎల్‌పీ) చీఫ్ సాద్ హుస్సేన్ రిజ్వీని అరెస్టు చేసిన తర్వాత పాకిస్థాన్‌లో హింసాత్మక నిరసనలు చెలరేగిన నేపథ్యంలో భారతీయ సిక్కు భక్తుల యోగ, క్షేమాల గురించి ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే. 


మొహిందర్ సింగ్ బుధవారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, టీఎల్‌పీ నేత రిజ్వీని అరెస్టు చేసిన తర్వాత పాకిస్థాన్‌లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోందని, హింసాకాండ చెలరేగిందని చెప్పారు. దీంతో పాక్‌లోని పంజా సాహిబ్ గురుద్వారాకు వెళ్తున్న భారతీయ సిక్కు భక్తులు మార్గమధ్యంలో చిక్కుకున్నారన్నారు. అనేక ఇబ్బందులు అనుభవించి, ఎట్టకేలకు లాహోర్‌లోని శ్రీ డేరా సాహిబ్‌కు చేరుకున్నట్లు తెలిపారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో వీరు పంజా సాహిబ్‌కు బయల్దేరి వెళ్ళారని, అనంతరం పంజా సాహిబ్ ఆసుపత్రికి చేరుకున్నారని చెప్పారు. భారతీయ సిక్కు భక్తులకు పాకిస్థాన్ ప్రభుత్వం, పాకిస్థాన్ గురుద్వారా ప్రధాన్ సత్వంత్ సింగ్  సంపూర్ణ మద్దతు ఇచ్చారని వివరించారు. 


ఫ్రెంచ్ అంబాసిడర్‌ను పాకిస్థాన్ నుంచి బహిష్కరించాలని, ఫ్రాన్స్ నుంచి దిగుమతులను నిషేధించాలని  టీఎల్‌పీ చీఫ్ రిజ్వీ  డిమాండ్ చేస్తున్నారు. దైవ దూషణగా పరిగణించదగిన కేరికేచర్లను పారిస్‌లో ప్రచురిండాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆయనను అరెస్టు చేయడంతో పాకిస్థాన్ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది.


Updated Date - 2021-04-14T21:41:50+05:30 IST