Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆ పరీక్ష అవసరమా?

ఆంధ్రజ్యోతి(18-02-2020)

ప్రశ్న: డాక్టర్‌! మాకు పెళ్లై మూడేళ్లు. ఇప్పటికి మూడు సార్లు అబార్షన్లు అయ్యాయి. వైద్యులు ఆయనకు స్పెర్మ్‌ డిఎన్‌ఎ టెస్ట్‌ చేయించమని సూచించారు. కానీ ఆయనకు స్పెర్మ్‌ కౌంట్‌ మెరుగ్గానే ఉంది. అయినా వైద్యులు ఈ పరీక్ష ఎందుకు సూచిస్తున్నారు? ఈ పరీక్ష కోసం మేము హైదరాబాద్‌ రావలసిందేనా?

- ఓ సోదరి, ఘట్‌కేసర్‌.


జవాబు: సాధారణంగా గర్భస్రావాలకు కారణం మహిళల్లోనే ఉందని అనుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో సమస్య పురుషుల్లోనూ ఉండవచ్చు. వీర్యకణాల సంఖ్య, కదలికలు సాధారణంగానే ఉన్నా, వాటి డి.ఎన్‌.ఎ నిర్మాణంలో లోపాలు ఉండవచ్చు. ఫలితంగా గర్భధారణ జరిగినా అబార్షన్లు అయిపోతాయి. ఐ.వి.ఎ్‌ఫలు (ఇన్‌విట్రో ఫర్టిలైజేషన్‌) కూడా వరుసగా ఫెయిల్‌ అవుతూ ఉన్నా కూడా వీర్యకణాల డి.ఎన్‌.ఎలో లోపం ఉందేమోనని అనుమానించాలి. ఈ లోపం సాధారణ వీర్య పరీక్షలో బయల్పడదు. ఇంతటి లోతైన పరీక్ష చేసే సదుపాయాలు హైదరాబాద్‌లోని కొన్ని సెంటర్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీ వారికి స్పెర్మ్‌ డి.ఎన్‌.ఎ టెస్ట్‌ చేయించండి. లోపం ఉంటే, మూడు నెలల పాటు చికిత్స తీసుకోవలసి ఉంటుంది. ఈ సమస్య 45 ఏళ్లు పైబడిన పురుషుల్లో, వేరికోసిల్‌ సమస్య ఉన్న వారిలో, కేన్సర్‌ చికిత్స తీసుకున్న వారిలో తలెత్తుతుంది. వేరికోసిల్‌ సమస్యను సర్జరీతో సరిదిద్దడం ద్వారా, మిగతా సమస్యలను నోటి మాత్రల ద్వారా పరిష్కరించవచ్చు. సమస్యను చక్కదిద్దితే తిరిగి గర్భం దాల్చి, పండంటి బిడ్డను ప్రసవించగలుగుతారు. కాబట్టి వరుస గర్భస్రావాలు జరుగుతున్నాయని, ఐ.వి.ఎ్‌ఫను ఆశ్రయించవద్దు. పదే పదే ఐ.వి.ఎఫ్‌ చేయించుకుంటూ డబ్బు వృథా చేసుకోకుండా వైద్యులను కలిసి, మీ వారికి స్పెర్మ్‌ డి.ఎన్‌.ఎ టెస్ట్‌ చేయించండి.


- డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి

ఆండ్రాలజిస్ట్‌, హైదరాబాద్‌

8332850090 (కన్సల్టేషన్‌ కోసం)

Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...