కాల్వ కను‘మురుగు’

ABN , First Publish Date - 2022-07-04T04:58:23+05:30 IST

వందేళ్ల కిందట రైతులకు ఉపయోగంగా నిర్మించిన కాల్వ నేడు కనుమరుగైంది. చెత్తతో నిండి.. కంపచెట్లు, పిచ్చిమొక్కలు పెరిగి ఆనవాళ్లు కోల్పోయింది.

కాల్వ కను‘మురుగు’
ఊరి మధ్యలో ఉన్న దాదాకాల్వ

ఆనవాళ్లు కోల్పోయిన దాదాకాల్వ

గ్రామంలోని చెత్తంతా అందులోనే 

డంపింగ్‌ యార్డులా మారిన వైనం 

 వందేళ్ల కిందట రైతులకు ఉపయోగంగా నిర్మించిన కాల్వ నేడు కనుమరుగైంది. చెత్తతో నిండి.. కంపచెట్లు, పిచ్చిమొక్కలు పెరిగి ఆనవాళ్లు కోల్పోయింది. ఫలితంగా సాగునీటి కాల్వ కాస్తా డ్రైనేజీ కాల్వగా మారిపోయింది. దుర్వాసన, పాముల బెడదతో స్థానికుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఆ వివరాల్లోకెళ్తే... 

కడప(మారుతీనగర్‌), జూలై 3: నగర 49వ డివిజన్‌ పరిధి ఆలంఖాన్‌పల్లెలో దాదాపు వందేళ్లుగా కేసీ కెనాల్‌కు అనుసంధానంగా ఒక పంట కాల్వ ఉంది. ఈ కాల్వను ‘దాదాకాల్వ’ అని పిలుస్తుంటారు. ఈ కాల్వ ఊరి మధ్యలో ఉంది. కాల్వకు ఇరుపక్కలా వందల కుటుంబాలు నివాసం ఉన్నారు. ఒకప్పుడు ఊరి చివరన ఉన్న పంటలకు ఈ కాల్వ గుండా నీరు ప్రవహించేది. క్రమేణ పంటల సాగు విస్తీర్ణం తగ్గి ప్లాట్లుగా, ఇతర అవసరాల నిమిత్తం వినియోగిస్తుండడంతో కాల్వ రూపురేఖలు మారిపోయాయి. ఎక్కడికక్కడ పిచ్చిమొక్కలు, కంపచెట్లు ఏపుగా పెరిగిపోవడంతో నీటి ప్రవాహానికి అడ్డుగా తయారైంది. దీనికి తోడు గ్రామస్థులు చెత్త, ప్లాస్టిక్‌ కవర్లు ఇందులో వేస్తుండడంతో పంటకాల్వ కాస్తా.. డ్రైనేజీ కాల్వలా మారిపోయింది.

దీంతో దుర్వాసనతో ఇంటి బయట కూర్చోలేకున్నామని, రాత్రి పూట దోమలు విజృంభించి రోగాలబారిన పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. పైగా పాములు, విషపురుగులు ఇళ్లలోకి వస్తుండడంతో గ్రామస్థులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నామని చెబుతున్నారు. ఏ పాము ఎటు నుంచి వస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న పల్లెలు సైతం శుభ్రంగా ఉన్న ఈ రోజుల్లో... కార్పొరేషన్‌లో ఉండే తమకు ఏమిటీ తిప్పలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాల్వను శుభ్రం చేసి దుర్వాసన, విషపురుగుల బారి నుంచి తమను రక్షించాలని కోరుతున్నారు. దీనికి తోడు కాల్వ చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయడమో లేక కాల్వపైన కప్పు వేసి పైపుల ద్వారా నీరు ప్రవహించేలా చేస్తే గ్రామస్థులు రోగాల బారిన పడకుండా ఉంటారని వేడుకుంటున్నారు. 


పాముల బెడద ఎక్కువైంది

నీరు ప్రవహించకపోవడంతో మురికికాల్వలా మారి పాముల బెడద ఎక్కువైంది. రెండు రోజులకొక పామైనా ఇళ్లలోకి వస్తున్నాయి. ఇప్పుడే ఒక పామును చంపా. చిన్న పిల్లలు బయట ఆడుకోవాలంటే భయపడుతున్నారు. 

- వెంకటేష్‌, స్థానికుడు 


సమస్య త్వరగా పరిష్కరించండి

ఊర్లో ఇంతమంది పెద్దలున్నా ఈ సమస్యను పరిష్కరించే వారు లేరు. వీధుల్లోకి చెత్త బండ్లు రాకపోవడంతో చేసేది లేక స్థానికులు ఈ కాలువలో చెత్తనంతా వేస్తున్నారు. ఇది ఒక డంపింగ్‌ యార్డులా తయారైంది. తద్వారా దుర్వాసనతో ఇళ్లలో ఉండలేకున్నాం. 

- సుబ్బరాయుడు, స్థానికుడు


దుర్వాసనతో చచ్చిపోతున్నాం

కాల్వలో చెత్తనంతా వేస్తుండడంతో దుర్వాసన ఎక్కువైంది. బయట కూర్చోవాలన్నా వాంతొస్తోంది. నీరు ప్రవహిస్తుంటే ఏ సమస్య ఉండదు. ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో కంపు వస్తోంది. ఈ కాలువ ఉపయోగంలో లేకపోవడంతో మురికికాల్వలా తయారైంది. 

- ఓబులేసు, స్థానికుడు 


కాల్వ చుట్టూ కంచె ఏర్పాటు చేయండి

ఊరి మధ్యలో కాల్వ ఉండడంతో చిన్నపిల్లలు అందులో పడే అవకాశం ఉంది. ఇంతకు ముందు ఇలాంటి సంఘటనలు జరిగాయి. కావున కాల్వ చుట్టూ ఎత్తుగా ఫెన్సింగ్‌ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. 

- ఆంజనేయులు, స్థానికుడు 






Updated Date - 2022-07-04T04:58:23+05:30 IST