రోడ్డుపైనే మురుగు

ABN , First Publish Date - 2022-06-23T05:06:15+05:30 IST

రోడ్డుపైనే మురుగు

రోడ్డుపైనే మురుగు


  • మ్యాన్‌హోళ్ల మూతలను పైకి లేపుకొని రోడ్డుపైకి..
  • పట్టణ ప్రగతి నిర్వహించినా ఫలితం శూన్యం
  • పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

ఘట్‌కేసర్‌, జూన్‌ 22 : అది వందశాతం దళితులుండే దళితవాడ. అక్కడ రోడ్డుపై మురుగునీరు పారుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇది ఎక్కడో మారుమూల పల్లెలో జరుగుతున్నది కాదు. నగరానికి కూతవేటు దూరం ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలోని 12వ వార్డు అంబేద్కర్‌ నగర్‌లో జరుగుతున్నది. 16 రోజుల పాటు పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎంతో చేసినట్లు ఊదరగొట్టిన ప్రజాప్రతినిధులకు, అధికారులకు సమస్యలు కనిపించకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 15 రోజుల క్రితం ప్రారంభమైన వర్షాలతోనే కాలనీలో సమస్యలు ప్రారంభమయ్యాయి. ఎగువనుండి పెద్దఎత్తున వస్తున్న మురుగు దిగువన ఉన్న చిన్నపైపుల డ్రైనేజీలో పట్టక మ్యాన్‌హోల్‌ మూతలను పైకి నెడుతున్నాయి. దీంతో వాటిలోని మురుగు నీరంతా రోడ్డుపైకి చేరుతోంది. దీనికితోడు అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై ఇష్టానుసారంగా డ్రైనేజీల కనెక్షన్‌లు కలుపుతుండటంతో లొతట్టు కాలనీల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. 

పెద్ద డ్రైనేజీని తెచ్చి చిన్న లైన్లలో కలపడంతో సమస్యలు

ఘట్‌కేసర్‌లోని ఏదులాబాద్‌ రోడ్డుకు ఎగువన ఉన్న డ్రైనేజీని తీసుకువచ్చి దిగువన ఉన్న చిన్న డ్రైనేజీ లైన్‌లో కలపడం వలన మురుగు కిందికి వెళ్లడానికి పైపులు సరిపోక మ్యాన్‌హోల్‌ మూతలను పైకి లేపుకొని బయటకు వస్తోంది. పట్టణ ప్రగతి కార్యక్రమంలో అదికారులు తమ కాలనీవైపు కన్నెత్తి అయినా చూడలేదని కాలనీవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలో ఏ ఇంటిలో కూడా సెప్టిక్‌ ట్యాంక్‌ లేకుండా ఇళ్లు నిర్మిస్తున్నారు. ఆ ఇళ్లలోని మరుగుదొడ్ల కనెక్షన్‌లను నేరుగా డ్రైనెజీలను కలుపుతున్నారు. దీంతో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. సమస్యలు ఉత్పన్నమైనప్పుడు తీవ్ర దుర్వాసనతో ఇబ్బందులు పడాల్సివస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్‌ నగర్‌లో రోడ్లపై పారుతున్న మురుగునీటి సమస్యను పరిష్కరించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని వారు పోతున్నారు. దీనికితోడు తాగునీటిని అందించే బోరు నిరంతరాయంగా నడుస్తుండడంతో నీరంతా వృథాగా పోతోంది. ఆ నీరు చేరడంతో గడ్డి విపరీతంగా పెరిగి వాటిలో పాములు, విష పురుగులు తిరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రోడ్డుపైనే మురుగంతా

15 రోజులుగా మురుగునీరంతా రోడ్లపైనే పారుతోంది. దీంతో ఇంట్లోకి వెళ్లాలన్నా, ఇంటినుండి బయటకు రావాలన్నా తీవ్ర ఇబ్బందిగా మారింది. అధికారులకు. లీడర్లకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. చిన్నపిల్లలతో ఇళ్లల్లో ఉంటున్నాం ఎలాంటి రోగాలు వస్తాయోననే భయంతో వణికిపోతున్నాం.

                                                          - అనెగళ్ల లావణ్య, గృహిణి, అంబేద్కర్‌నగర్‌

దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నాం 

మ్యాన్‌హోల్‌ నుంచి మురుగు పొంగిపొర్లుతూ ఇళ్లచుట్టూ చేరి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. రాత్రి పగలు కంపులో ఉండలేక పోతున్నాం. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించు కోవడం లేదు. పేరుకు మున్సిపాలిటీ కానీ ఎలాంటి పనులూ చేయడం లేదు. మాకు ఈ మురుగు సమస్య నుండి విముక్తి కల్పించాలి. 

                                                                - తిక్క సరిత, గృహిణి, అంబేద్కర్‌నగర్‌

డ్రేనేజీ మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నాం

మున్సిపాలిటీలోని 12వ వార్డులో నెలకొన్న మురుగు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం, ఎగువ నుంచి వచ్చే మురుగును మళ్లించేందుకు చర్యలు చేపట్టాం. కౌన్సిల్‌ అమోదం సైతం ఉన్నందున రెండు మూడు రోజుల్లోనే పనులు చేపడతాం. జెట్‌ మిషన్‌ వాడినా ఫలితం కనిపించడం లేదు డ్రైనేజీ మళ్లింపే పరిష్కారం కనుక ఆ దిశగా పనులు చేపడతాం.

                                                          - వసంత, మున్పిపల్‌ కమిషనర్‌, ఘట్‌కేసర్‌

Updated Date - 2022-06-23T05:06:15+05:30 IST