సేవా కిరణ్‌ం

ABN , First Publish Date - 2021-06-20T05:34:51+05:30 IST

కరోనా సమయంలో ఒక భిక్షగాడికి సేవలందించి మానవత్వం చాటు కున్నాడు పట్టణానికి చెందిన కిరణ్‌ అనే యువకుడు.

సేవా కిరణ్‌ం
విశాఖ కోస్టల్‌ ఆస్పత్రిలో ఆపరేషన్‌ చేసిన డాక్టర్‌ వంశీధర్‌


భిక్షగాడికి సేవలందించిన యువకుడు

పురుగులు పట్టిన కాలుకు వైద్యం అందించిన కిరణ్‌

ఉచితంగా ఆపరేషన్‌ చేసిన డాక్టర్‌ వంశీధర్‌

అరకులోయ, జూన్‌ 19: కరోనా సమయంలో ఒక భిక్షగాడికి సేవలందించి మానవత్వం చాటు కున్నాడు పట్టణానికి చెందిన కిరణ్‌ అనే యువకుడు. కాలుకు గాయమై పురుగులు పట్టి లేవలేని స్థితిలో ఉన్న భిక్షగాడికి దాతల సాయంతో ఆపరేషన్‌ కూడా చేయించాడు. 

పట్టణంలోని రోడ్డు పక్కన భిక్షమెత్తుకునే వ్యక్తి కాలుకు గాయమై పురుగులు పట్టాయి. ఈ విషయాన్ని పట్టణానికి చెందిన కిరణ్‌ అనే యువకుడు గమనించి, భిక్షగాడికి గుండు కొట్టించి శుభ్రంగా స్నానం చేయించి పాత బట్టలు మార్చాడు. పురుగులు పట్టిన కాలుకు రోజూ డ్రెస్సింగ్‌ చేయించాడు. ఇందుకు సురక్ష క్లినిక్‌ ఆర్‌ఎంపీ రాజు, వేంకటేశ్వర మెడికల్‌ షాపు యజమాని మందులు, ఇంజక్షన్లు ఉచితంగా అందించారు. చివరకు పురుగులు పట్టిన కాలును తొలగించాలని వైద్యులు సూచించారు. దీంతో కిరణ్‌ స్థానికుల సాయంతో విశాఖపట్నంలోని కోస్టల్‌ ఆస్పత్రి అధినేత డాక్టర్‌ వంశీధర్‌ పుట్రేపు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఉచితంగా ఆపరేషన్‌ చేసేందుకు అంగీకరించడంతో మూడు రోజుల క్రితం విశాఖ కోస్టల్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో డాక్టర్‌ మురళీధర్‌ ఆపరేషన్‌ చేసి కాలు కొంతమేరకు తొలగించారు. ఆయనకు సేవలందించేందుకు ఇద్దరు వ్యక్తులను ఏర్పాటు చేసినట్టు కిరణ్‌ తెలిపారు. ఆపరేషన్‌ నిమిత్తం విశాఖపట్నం తరలించి, వైద్య సేవలందించేందుకు పట్టణానికి చెందిన పలువురు ఆర్థిక సాయం చేసినట్టు కిరణ్‌ తెలిపాడు. భిక్షగాడికి ఉచితంగా ఆపరేషన్‌ చేసిన డాక్టర్‌ మురళీధర్‌, మెడికల్‌ షాపు యజమాని గుప్తా, ఆర్‌ఎంపీ వైద్యుడు రాజులకు కిరణ్‌ కృతజ్ఞతలు తెలిపాడు. మానవతా దృక్పథంతో సాయాన్ని అందించిన యువకుడిని పలువురు అభినందించారు.

Updated Date - 2021-06-20T05:34:51+05:30 IST