సర్వర్‌ డౌన్‌!

ABN , First Publish Date - 2022-05-25T05:12:47+05:30 IST

పీఎం కిసాన్‌ యోజన పథకం డబ్బులు రావాలంటే

సర్వర్‌ డౌన్‌!
చేవెళ్లలో సీఎస్సీ సెంటర్‌ వద్ద గుమికూడిన రైతులు

  • ఓపెన్‌ కాని పీఎం కిసాన్‌ వెబ్‌సైట్‌ 
  • ఆధార్‌ లింక్‌ కోసం రైతుల పడిగాపులు
  • కొన్ని ప్రాంతాల్లో తెరుచుకోని ఆధార్‌ కేంద్రాలు
  • పట్టించుకోని అధికారులు


చేవెళ్ల, మే 24 : పీఎం కిసాన్‌ యోజన పథకం డబ్బులు రావాలంటే ఆధార్‌ నెంబర్‌ను సంబంఽధిత ఫోన్‌ నెంబర్‌కు లింక్‌ చేసుకోవాలని వ్యవసాయ అధికారులు స్పష్టం చేయడంతో రైతులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఆధార్‌కార్డులు తీసుకొని ఇంటర్‌నెట్‌, సీఎస్సీ సెంటర్లు, ఆధార్‌కార్డు కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. రెండు రోజులుగా పీఎం కిసాన్‌ వైబ్‌సైట్‌ సర్వర్‌ సమస్య వస్తుంది. దీంతో మండే ఎండలో రైతులు పడిగాపులు కాయాల్సి వస్తుంది. ప్రభుత్వం ఉచితంగానే ఆధార్‌ నెంబర్‌ను లింక్‌ చేస్తున్నామని చెబుతున్నప్పటికీ అది ఎక్కడా అమలు కావడం లేదు. రైతుల డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని ఆయా ఇంటర్‌నెట్‌ సెంటర్ల నిర్వహకులు ఒక్కకొక్కరి నుంచి రూ.50 వసూలు చేస్తున్నారు. ఆధార్‌ లింక్‌ చేసుకోవడానికి ఈనెల 31వ తేది చివరిరోజుగా ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. కాగా పీఎం కిసాన్‌లో కొత్తగా పేర్లు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం ఆప్షన్‌ ఇవ్వకపోడంతో చాలామంది రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు కొత్తవారికి సైతం ఆప్షన్‌ ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు ఇంటర్‌నెట్‌, సీఎస్సీ కేంద్రాల వైపు పరుగులు తీస్తున్నారు. వివిధ గ్రామాల నుంచి ఉదయాన్నే మండల కేంద్రాలకు చేరుకుని సాయంత్రానికి తిరిగి వెళ్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రైతుల ఇబ్బందులను తొలగించాలని రైతులు కోరుతున్నారు. 


తెరుచుకోని ఆధార్‌ సెంటర్లు

చేవెళ్ల డివిజన్‌ పరిధిలో ఉన్న 8 ఆధార్‌ నమోదు కేంద్రాలు వారం పదిరోజులుగా మూతపడ్డాయి. ఇందులో చేవెళ్లలో రెండు, శంకర్‌పల్లి మండలం శంకర్‌పల్లి, దొంతన్‌పల్లి, మోకిల, మొయినాబాద్‌ మండలంలో రెండు, షాబాద్‌ మండలంలో ఒకటిచొప్పున ఉన్న ఆధార్‌ నమోదు  కేంద్రాలున్నాయి. వాటిల్లో పని చేస్తున్న సిస్టమ్‌ ఆపరేటర్లు ఆధార్‌కార్డు నమోదులో కొన్ని పొరపాట్లు చేయడంతో వారందరినీ సంబంధిత ఆధార్‌ కేంద్రాల నిర్వహణ అధికారి సస్పెండ్‌ చేశారు. దీంతో ఆధార్‌ కార్డు కేంద్రాలు మూతపడ్డాయి. అయితే చాలామంది వివిధ గ్రామాల నుంచి ప్రజలు ఆధార్‌ కార్డు నమోదు కేంద్రాల వద్దకు వచ్చి మూసిఉన్న సెంటర్‌లను చూసి నిరాశగా తిరిగి వెళ్లిపోతున్నారు. ఆధార్‌ సెంటర్లు మూసి ఉండటంపై ప్రజలు అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కొత్త ఆపరేటర్లను నియమించి వెంటనే ఆధార్‌ నమోదు కేంద్రాలు తిరిగి ప్రారంభించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఇదే విషయమై చేవెళ్ల తహసీల్దార్‌ అశోక్‌మార్‌ను వివరణ కోరగా ఆధార్‌ కార్డు నమోదు కేంద్రం విషయం జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తానని వివరించారు. 



Updated Date - 2022-05-25T05:12:47+05:30 IST