చండీగఢ్: బీజేపీపై పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు భగవంత్ మాన్ సంచలన ఆరోపణ చేశారు. బీజేపీలో చేరితే తనకు డబ్బులు, కేంద్ర కేబినెట్లో చోటు కల్పిస్తామని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు ఆఫర్ ఇచ్చారని చెప్పారు. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో భగవంత్ మాన్ ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.
సంగ్రూర్ ఎంపీ అయిన భగవంత్ మాన్ ఆదివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ, డబ్బులో, ఇంకొకటో ఎరచూపించి తనను ఎవరూ కొనలేరని అన్నారు. నాలుగు రోజుల క్రితం బీజేపీ సీనియర్ నేత ఒకరు తనను సంప్రదించారని, బీజేపీలో చేరాలంటే మీకు ఏం కావాలని తనను అడిగారని మాన్ చెప్పారు. మీకు డబ్బులు అవసరం ఉందా? అని కూడా ఆ బీజేపీ నేత తనను అడిగినట్టు పేర్కొన్నారు. అయితే, ఆ నేత ఎవరనేది ఆయన వెల్లడించలేదు. ''నేను ఆయనకు (బీజేపీ నేత) ఒకటే చెప్పాను. నేనంటూ ఒక మిషన్ (బాధ్యత) మీద ఉన్నాను. కమిషన్ మీద కాదు. మీరు కొనాలంటే ఇంకెవరినైనా చూసుకోవచ్చు'' అని తాను సమాధానమిచ్చినట్టు మాన్ తెలిపారు. పంజాబ్లో బీజేపీకి ఎలాంటి పునాది లేదని, రైతు చట్టాల విషయంలో ఆగ్రహంతో ఉన్న రైతులు బీజేపీ నేతలను కనీసం గ్రామాల్లోకి కూడా రానీవడం లేదని మాన్ పేర్కొన్నారు.