అన్నదాత ఆక్రందన

ABN , First Publish Date - 2022-08-03T05:56:03+05:30 IST

ఇది ఈ ఇద్దరి పరిస్థితే కాదు. దాదాపు జిల్లావ్యాప్తంగా ఇదే దుస్థితి నెలకొంది. ఈ ఏడాది ముందస్తుగా వర్షాలు పలకరించడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. కానీ ప్రస్తుతం వర్షాలు ముఖం చాటేయ్యడంతో ఆందోళన నెలకొంది. అయితే సాగులో పెట్టుబడులు తగ్గించుకోవడానికి ఎక్కువ మంది వరి ఎ

అన్నదాత ఆక్రందన

- రసాయనాలు, పురుగు మందుల పేరుతో దోపిడీ

- ప్రైవేటు దుకాణాల్లో అధిక ధరలకు విక్రయాలు

- నకిలీ మందుల అమ్మకాలు

- ఉత్సవ విగ్రహాలుగా రైతుభరోసా కేంద్రాలు

(హరిపురం)

- మందస మండలం హరిపురం గ్రామానికి చెందిన  బైరిశెట్టి గున్నయ్య అనే రైతు స్థానికంగా ఉన్న ఓ ఎరువుల దుకాణంలో కలుపు మందు కొనుగోలు చేశాడు. ధర రూ.2,100 చెల్లించాడు. బిల్లు అడిగినా షాపు యజమాని ఇవ్వలేదు. ఇదేమని ప్రశ్నిస్తే మీ ఇష్టం ఉంటే తీసుకెళ్లు.. లేదంటే వదిలేయ్‌ అంటూ దురుసుగా సమాధానం చెప్పాడు. ఎమ్మార్పీ చూస్తే రూ.1,710గా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. 

- మందస మండలం రట్టి గ్రామానికి చెందిన రైతు పులారి తవిటయ్య పలాసలోని ఓ ఎరువుల దుకాణంలో గడ్డి, పురుగుల మందులను కొనుగోలు చేశాడు. బ్రాండెడ్‌ పేరుతో ఉన్న మందులనే ఇచ్చినా బిల్లు ఇవ్వలేదు. రసాయనాలు పిచికారీ చేసినా కనీసం ప్రభావం చూపించలేదని వాపోతున్నాడు. 

 ..ఇది ఈ ఇద్దరి పరిస్థితే కాదు. దాదాపు జిల్లావ్యాప్తంగా ఇదే దుస్థితి నెలకొంది. ఈ ఏడాది ముందస్తుగా వర్షాలు పలకరించడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. కానీ ప్రస్తుతం వర్షాలు ముఖం చాటేయ్యడంతో ఆందోళన నెలకొంది. అయితే సాగులో పెట్టుబడులు తగ్గించుకోవడానికి ఎక్కువ మంది వరి ఎదలు చల్లుకున్నారు. దీంతో పొలాల్లో కలుపు, గడ్డి ఎక్కువగా పెరిగిపోయింది. వాటిని నియంత్రించేందుకు రసాయన ఎరువులు, పురుగు మందులను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఉద్దానంలో కొబ్బరి, జీడి పంటలకు సైతం రసాయనాలు అధికంగా వాడుతున్నారు. ఈ నేపథ్యంలో వాటి విక్రయాలు గణనీయంగా పెరిగాయి. ఇదే అదునుగా పంపిణీదారులు (డీలర్లు) అధిక ధరలకు విక్రయిస్తున్నారు. రైతుల నుంచి నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. అధిక ధరలపై ప్రశ్నిస్తున్న వారితో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. దీనికితోడు సరిహద్దు మండలాల్లో నకిలీ మందులు అండగడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒడిశా నుంచి దిగుమతి చేసుకొని విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. రసాయనాలు పనిచేయడం లేదని రైతులు చెబుతున్నారు. సంబంధిత డీలర్లతో పాటు వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడం లేదు. దీంతో ఏం చేయాలో రైతులకు పాలుపోవడం లేదు. 

ఇదీ పరిస్థితి..

జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో సుమారు 2.78 లక్షల ఎకరాల్లో వరి సాగువుతోంది. జీడి, మామిడి, కొబ్బరి వంటి ఉద్యానవన, మెట్ట పంటలు సుమారు 60 వేల హెక్టార్లులో సాగువుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. వర్షాలు సకాలంలో పడడంతో గతేడాది బీడుగా ఉన్న భూములు సైతం ఈ ఏడాది సాగులోకి వచ్చాయి. కాగా జిల్లాలో రైతులు ప్రతీ పంటకు పురుగు మందులతో పాటు యూరియా, డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువులను వినియోగిస్తున్నారు. దీనిని డీలర్లు సొమ్ము చేసుకుంటున్నారు. 

 ఆర్బీకేల్లో నో స్టాక్‌..

విత్తనాల నుంచి ఎరువుల వరకూ.. రసాయన, క్రిమిసంహారక మందులు రైతుభరోసా కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచినట్టు ప్రభుత్వం చెబుతోంది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ఆర్బీకేలు కేవలం ఉత్సవవిగ్రహాలుగా దర్శనమిస్తున్నాయి. దీంతో రైతులు బయట మార్కెట్‌లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా 256 ప్రైవేటు దుకాణాలు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. కానీ చాలావరకూ నిబంధనలు పాటించడం లేదన్న ఆరోపణలున్నాయి. ప్రధానంగా సరిహద్దు ప్రాంతాల్లో నకిలీ మందులు విక్రయిస్తున్నట్టు 

ఇవీ నిబంధనలు..

- అనుమతి పొందిన దుకాణం వద్ద ధరల పట్టికను విధిగా ఏర్పాటు చేయాలి. నిల్వ వివరాలు అందులో పొందుపరచాలి. కానీ ఇవెక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు.

- ఎరువులు, పురుగు మందుల కొనుగోలు చేసిన రైతులకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలి. వీటిపై రైతుల నుంచి సంతకాలు తీసుకోవాలి. కానీ పలు దుకాణాల్లో రైతులకు బిల్లులు ఇవ్వడం లేదు. 

- ప్రతి వ్యాపారి ఎవరి వద్ద ఎరువులు కొనుగోలు చేస్తున్నారన్న పత్రం(పీసీ)ఉండాలి. దీని నిర్ణీత గడువు ముగిస్తే మళ్లీ నవీకరణ చేయించుకోవాలి. ఇలా పలు దుకాణాల్లో అనుమతి పత్రాల్లేకుండా ఎరువులను విక్రయిస్తున్నారు. 

- అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తునట్లు రైతుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి.  కంపెనీలు నిర్ణయించిన ధరల మేరకు అమ్మకాలు చేపట్టాలి. 

- జేడీ కార్యాలయానికి నిల్వ నివేదికలు క్రమం తప్పకుండా పంపాలి. దీనిని చాలామంది వ్యాపారులు విస్మరిస్తున్నారు. 


కఠిన చర్యలు

ఎరువులు, పురుగుల మందులు నకిలీలు, అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవు. దుకాణాల్లో బిల్లులను పరిశీలించి నేరుగా రైతుల వద్దకు వెళ్లి ధరలపై పరిశీలన జరుపుతాం. అక్రమాలకు పాల్పడితే తగిన చర్యలు తీసుకుంటాం. అనుమతి లేని ఎరువుల దుకాణాలపై, అక్రమ నిల్వలపై, నకిలీలు వంటి వాటిపై రైతులే నేరుగా తెలియజేయాలి. వాటిని సీజ్‌చేసి తగు చర్యలు చేపడతాం. 

- ఎల్‌.మధు, వ్యవసాయ శాఖ ఏడీ, పలాస



Updated Date - 2022-08-03T05:56:03+05:30 IST