నిశబ్దం

ABN , First Publish Date - 2020-03-28T12:11:07+05:30 IST

కరోనా నిరోధానికి ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో

నిశబ్దం

ఇళ్లలోనే ఉమ్మడి పాలమూరు జనం

ఐదు రోజులుగా స్వీయ నిర్బంధం

ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యం

నిత్యవసరాలు, అత్యవసరాలకు మాత్రమే రోడ్లపైకి వస్తున్న ప్రజానీకం

సరిహద్దుల వద్ద నిఘా పటిష్ఠం

ఇతర ప్రాంతాల నుంచి నిలిచిన రాకపోకలు

‘లాక్‌డౌన్‌’కు ఆదర్శనంగా నిలుస్తున్న పల్లెలు


మహబూబ్‌నగర్‌, మార్చి 27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : కరోనా నిరోధానికి ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో లాక్‌డౌన్‌ విజయవంతంగా కొనసాగుతోంది. పట్టణాలు, పల్లెలనే బేధం లేకుండా, అన్ని ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధంలోకి రావడంతో, పరిస్థితి అదుపులోకి వచ్చింది. జనతా కర్ఫ్యూ, ఆ తర్వాత లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన ఐదు రోజుల్లో క్రమేసీ ప్రజలందరిలో లాక్‌డౌన్‌కు సహకరించే పరిస్థితి ఏర్పడగా, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లోని అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద నిశబ్ద వాతావరణం నెలకొన్నది. నారాయణపేట జిల్లాలోని కర్ణాటక సరిహద్దులో ఉన్న కృష్ణ చెక్‌పోస్టు, చేగుంట చెక్‌పోస్టులను పూర్తిగా మూసివేయడంతో, అక్కడ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సరిహద్దు గ్రామాలైన సుకూరులింగంపల్లి, చేగుంట, జిలాల్‌పూర్‌, కానుగుర్తి వద్ద పూర్తి నిఘా ఉండడంతో రాకపోకలు ఆగిపోయాయి. జోగుళాంబ గద్వాల జిల్లా పుల్లూరు చెక్‌పోస్టు వద్ద గురువారం రాత్రి తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. 


కంట్రోల్‌లో పట్టణాలు పల్లెల్లో స్వీయ నిర్బంధం

ఉమ్మడి జిల్లాలోని పట్టణాలన్నీ స్వీయ నిర్బంధంలోకి వచ్చాయి. పట్టణాల సరిహద్దులను మూసి వేయడంతో, పట్టణాలకు ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు ఆగిపోయాయి. మహబూబ్‌నగర్‌, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, వనపర్తి వంటి ప్రధాన పట్టణాల్లో కాలనీల్లో సైతం చుట్టూ నిర్బంధం విధించారు. కూరగాయల కొరత లేకుండా, రైతుబజార్లను రెట్టింపు సంఖ్యలో ఏర్పాటు చేయడంతో కూరగాయల కొరత తీరింది. ఇతర ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చిన వారిని ఒకొక్కరిని గుర్తించి, వారిని హోం క్వారంటైన్‌, ఐసోలేషన్‌కు తరలిస్తున్నారు. దీంతో పట్టణాలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. పట్టణాల్లో ఉండే అనాథలు, యాచకులకు నేటి నుంచి ఆహారం అందించడంతో పాటు వారి నివాసానికి కూడా ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయాలని మునిసిపల్‌ అధికారులను మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అదేశించారు. దీంతో ఈ సమస్య కూడా పరిష్కారమవయ్యే అవకాశం ఏర్పడింది. పల్లెల్లో మాత్రం స్ఫూర్తివంతంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. రైతులు, కూలీలలనే బేధం లేకుండా అందరికి అందరూ ఇళ్లల్లోనే ఉంటూ బయటకు రాకుండా సహకరిస్తున్నారు. 


ఇళ్లలోనే జనం

పట్టణాల్లో, పల్లెల్లో ప్రజలు పూర్తిగా పనులన్నీ దాదాపు ఆపేశారు. కార్యాలయాలన్నీ దాదాపు మూసివేయడంతో పట్టణాల్లోని ఉద్యోగులు, చిరుద్యోగులు, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, కార్మికులు ఇళ్లలోనే ఉండిపోయారు. ఉదయం పాలు, కూరగాయల కోసం, నిత్యావసర వస్తువుల కోసం మినహా ఎవరూ బయటకు రావడం లేదు. 


Updated Date - 2020-03-28T12:11:07+05:30 IST