స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష

ABN , First Publish Date - 2020-03-28T06:41:25+05:30 IST

ప్రభుత్వం సహకారంతో పాటు ప్రజలు స్వచ్చంధంగా జాగ్రత్తలు పాటించాలని, స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష అని మంత్రి సబితారెడ్డి...

స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష

  • జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు లేవు
  • రెవెన్యూ, పోలీస్‌, వైద్య శాఖల సేవలు ప్రశంసనీయం 
  • విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి


వికారాబాద్‌ : ప్రభుత్వం సహకారంతో పాటు ప్రజలు స్వచ్చంధంగా జాగ్రత్తలు పాటించాలని, స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష అని  మంత్రి సబితారెడ్డి తెలిపారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా శుక్రవారం  కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. వివిధ శాఖలు అందిస్తున్న సేవలు ప్రసంశనీయమన్నారు. జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదని, ఇక ముందు కూడా కాకుండా ఉండేందుకు ప్రజల సహకారం అవసరమని తెలిపారు. జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి మాట్లాడుతూ అధికారులు పనితీరు చాలా సంతోషకరమన్నారు. ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ అధికారులకు తమ సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. ఎమ్మెల్యే ఆనంద్‌ మాట్లాడుతూ ప్రైవేటు హాస్పిటల్స్‌లో ఓపీ చూడకుండా ఎమర్జెన్సీ కేసులను మాత్రమే చూడాలని కోరారు. ప్రధాన కూడళ్లలో వైద్యుల ఫోన్‌ నెంబర్లతో కూడిన పోస్టర్లను ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్‌ పౌసుమి బసు మాట్లాడుతూ జిల్లాలో 850 గృహాలను గుర్తించి డేటా ఆన్‌లైన్‌ చేయిస్తున్నామని తెలిపారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారిని హోం క్వారంటైన్‌ చేస్తున్నామన్నారు. జిల్లాలోని 18 మండలాల్లో అధికారులు బృందాలుగా ఏర్పడి క్వారంటైన్‌లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుంటున్నారన్నారు. ప్రతి రోజు 3 లెవెల్స్‌ మానిటరింగ్‌ జరుగుతుందని తెలిపారు. తండాల్లో డాక్టర్‌ అరవింద్‌, డీఎంహెచ్‌వో దశరథ్‌ పర్యటించి క్వారంటైన్‌లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకొని వైద్య సహాయం అందజేస్తున్నట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 9 అంబులెన్స్‌లు ఉన్నాయని తెలిపారు. అనంతరం రాజీవ్‌నగర్‌ వద్ద కొత్తగా ఏర్పాటవుతున్న 100 పడకల ఆసుపత్రిలో ఐసోలేషన్‌ వార్డును మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారులు పరిశీలించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఎస్పీ నారాయణ, జడ్పీ వైస్‌చైర్మన్‌ విజయ్‌కుమార్‌, జడ్పీ సీఈవో శ్రీకాంత్‌రెడ్డి, అడిషనల్‌ కలెక్టర్లు మోతీలాల్‌, చంద్రయ్య, డీఆర్‌డీవో కృష్ణన్‌, సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2020-03-28T06:41:25+05:30 IST