500 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2022-01-19T06:34:35+05:30 IST

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నుంచి ఏపీ రాష్ట్రం కాకినాడకు అక్రమంగా తరలిస్తున్న 500క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని సూర్యాపేట జిల్లా పోలీసులు పట్టుకున్నారు.

500 క్వింటాళ్ల  పీడీఎస్‌ బియ్యం పట్టివేత
హుజూర్‌నగర్‌లో పోలీసులు పట్టుకున్న లారీలు

మిర్యాలగూడ నుంచి కాకినాడకు అక్రమ రవాణా

పట్టించిన డయల్‌ 100 కాల్‌

ఇద్దరు లారీ డ్రైవర్ల అరెస్ట్‌

హుజూర్‌నగర్‌, జనవరి 18: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నుంచి ఏపీ రాష్ట్రం కాకినాడకు అక్రమంగా తరలిస్తున్న 500క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని సూర్యాపేట జిల్లా పోలీసులు పట్టుకున్నారు. సోమవారం రాత్రి ఓ వ్యక్తి డయల్‌ 100కు సమాచారమివ్వడంతో పోలీసులు పీడీఎస్‌ బియ్యం లోడుతో ఉన్న రెండు లారీలను పట్టణంలోని ఇందిరా చౌక్‌లో నిలిపి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీనిపై రెవెన్యూ, పోలీస్‌ అధికారులు మంగళవారం దర్యాప్తు ప్రారంభించారు. కాకినాడకు చెందిన రవితేజ ట్రేడర్స్‌కు రెండు లారీల్లో 500 క్వింటాళ్ల బియ్యాన్ని తరలిస్తుండగా, మిర్యాలగూడకు చెందిన ఆర్‌ఎస్‌ ట్రేడర్స్‌కు చెందిన బిల్లులను అధికారులు గుర్తించారు. ఇదిలా ఉండగా మేడ్చల్‌ జిల్లా చెంగిచెర్ల, కాప్రా ప్రభుత్వ గోడౌన్ల వద్ద ఈ నెల ఐదు, ఆరు తేదీల్లో నిర్వహించిన బహిరంగ వేలంలో 1500 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని కొనుగోలు చేశామని రవితేజ ట్రేడర్స్‌ ప్రతినిఽధులు అధికారులకు తెలిపారు. అయితే పీడీఎస్‌ బియ్యం రవాణాకు ఎటువంటి పత్రాలు లేవని, అక్రమంగా తరలిస్తున్నట్లు నిర్ధారించి మిర్యాలగూడకు చెందిన ఇద్దరు లారీ డ్రైవర్లు కృష్ణారెడ్డి, రుక్మారెడ్డిలను అరెస్టు చేసినట్లు సీఐ రామలింగారెడ్డి తెలిపారు. 

పొంతన లేని బిల్లులు?

మిర్యాలగూడలోని ఆర్‌ఎస్‌ గోదాం నుంచి బియ్యం తరలిస్తున్న వ్యాపారులు కాప్రా ప్రభుత్వ గోదాం నుంచి కొనుగోలు చేసినట్లు చూపెడుతున్న బిల్లులకు ఎలాంటి పొంతన లేదని పోలీసులు గుర్తించారు.  సుమారు రూ.30లక్షల విలువచేసే పీడీఎస్‌ బియ్యం ఉమ్మడి జిల్లా స్థాయి సివిల్‌ సప్లయ్‌ అధికారుల అండదండలతోనే కాకినాడకు తరలిస్తున్నారనే ఆరోప ణలు ఉన్నాయి. 

రాజకీయ పార్టీ నాయకుల అండతోనే?

హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో ఒక రాజకీయ పార్టీకి చెందిన ముగ్గురు వ్యక్తులు రేషన్‌ బియ్యాన్ని పెద్ద ఎత్తున కాకినాడకు తరలిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. మఠంపల్లి, హుజూర్‌నగర్‌, మేళ్ళచెర్వు మండలాలకు చెందిన కొంతమంది నాయకులు పీడీఎస్‌ బియ్యాన్ని రేషన్‌ డీలర్ల నుంచి సేకరిస్తున్నారు. దీంతోపాటు డీలర్లు వినియోగదారుల నుంచి ఓటీపీలు తీసుకుని బియ్యాన్ని ఎఫ్‌సీఐ గోదాం నుంచే నేరుగా వ్యాపా రులకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్నేళ్లుగా కొంతమంది డీలర్లు, ఎఫ్‌సీఐ అధికారులు, సివిల్‌ సప్లయ్‌ అధికారులతో కుమ్మక్కై బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారని తెలిసింది. కొంతమంది డీలర్లు మాత్రం వినియోగదారులకు బియ్యానికి బదులుగా ఇతర నిత్యావసర వస్తువులు అందిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా పేదల బియ్యం పెద్దలకు భోజ్యంగా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి. 

మిర్యాలగూడ టు కాకినాడ పోర్ట్‌?

మిర్యాలగూడలోని కొందరు వ్యాపారులు తెలంగాణతో పాటు ఏపీ రాష్ట్రంలో పీడీఎస్‌ బియ్యాన్ని సేకరించి కాకినాడ పోర్ట్‌కు తరలిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోని రేషన్‌ డీలర్ల నుంచి ముగ్గురు వ్యాపారులు అక్రమంగా పీడీఎస్‌ బియ్యాన్ని కొనుగోలు చేసి మిర్యాలగూడకు చెందిన బడా వ్యాపారులకు విక్రయి స్తున్నట్లు సమాచారం. బడా వ్యాపారుల నుంచి కాకినాడకు పోర్టు ద్వారా విదేశాలకు పీడీఎస్‌ బియ్యం తరలివెళుతున్నట్లు పోలీసులు అనుమా నిస్తున్నారు. లారీ డ్రైవర్లు మిర్యాలగూడలోని ఆర్‌ఎస్‌ గోడౌన్‌ నుంచి బియ్యాన్ని  తరలిస్తున్నామని చెబుతుండగా, యజమానులు మాత్రం కాప్రా నుంచి కొనుగోలు చేసిన బియ్యమని చెబుతున్నారని, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామలింగారెడ్డి, డీటీసీఎస్‌ రాజశేఖర్‌ తెలిపారు. రెండు రోజుల్లో విచారణ పూర్తిచేసి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామన్నారు.  

ఏడు క్వింటాళ్ల  పీడీఎస్‌ బియ్యం పట్టివేత

మఠంపల్లి: అక్రమంగా తరలిస్తున్న ఏడు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని  మండల పోలీసులు మంగళవారం పట్టుకున్నారు.  ఏఎస్‌ఐ లింగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ రాష్ట్రానికి చెందిన గుంటూరు జిల్లా మాచవరం మండలం దర్శిపురం గ్రామానికి చెందిన ముడియల నారాయణ, అదే జిల్లా దాచేపల్లి మండలం  ముత్యాలంపాగు గ్రామానికి  చెందిన గొట్టెముక్కల పేరారెడ్డి  రెండు వాహనాల్లో ఏడు క్వింటాళ్ల బియ్యాన్ని తరలిస్తుండగా మట్టపల్లి సమీపంంలో సోమవారం ఉదయం పట్టుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.




Updated Date - 2022-01-19T06:34:35+05:30 IST