మార్క్సిస్టుల లౌకికం!

ABN , First Publish Date - 2020-02-22T08:35:15+05:30 IST

నిరీశ్వరవాదులుగా ఉండే మార్క్సిస్టులు ఇప్పుడు దేవుడివైపు చూస్తున్నారు.

మార్క్సిస్టుల లౌకికం!

  • ఆలయ కమిటీల్లో సెక్యులరిస్టులు ఉండాలని వాదన

కోల్‌కతా, ఫిబ్రవరి 21: నిరీశ్వరవాదులుగా ఉండే మార్క్సిస్టులు ఇప్పుడు దేవుడివైపు చూస్తున్నారు. దేశంలో ‘విస్తరిస్తున్న రాజకీయ విషసంస్కృతిని ఎదుర్కోడానికి’ తాము కూడా ఆలయాలు, ఇతర మతాల ప్రార్థనాస్థలాల కమిటీల్లోకి ప్రవేశించాలని నిర్ణయించారు.  ఈ విషయాన్ని పార్టీవాదులకు సర్క్యులేట్‌ చేసిన ఓ నివేదికలో వెల్లడించారు. ఆలయ వ్యవహారాలను ఆర్‌ఎ్‌సఎస్‌, దాని అనుబంధ సంస్థలు నియంత్రిస్తున్నాయన్నది సీపీఎం అభిప్రాయం. హిందూ ధర్మం పేరిట సంఘ్‌ సంస్థలు తమ ఎజెండాను ఆలయ సంప్రదాయాల్లోకి చొప్పిస్తున్నాయని, తద్వారా చాపకింద నీరు లా హిందూత్వ భావజాలం అన్నిటా వ్యాపిస్తోందని మార్క్సిస్టులు నమ్ముతున్నారు. దీన్ని అడ్డుకోవడానికి ఆలయ కమిటీల్లో లౌకికవాదులకు చోటు కల్పించాలని, తద్వారా బీజేపీ, సంఘ్‌ల ప్రభావాన్ని తగ్గించవచ్చనీ సీపీఎం భావిస్తోంది..


‘‘దైవానుకూలంగా వ్యవహరించడం వల్ల పార్టీకి ఉన్న ప్రగతిశీల ఇమేజి కూడా ఇనుమడిస్తుంది. భారీగా ప్రజలు హాజరయ్యే ప్రదేశాలను, సామాజిక సంరంభాలను మేం ప్రజలకు చేరువయ్యేందుకు ఉపయోగించుకుంటూనే వచ్చాం. గతంలో కేరళలో దీనిని అమలు చేశాం. దేశంలో ఇపుడు బీజేపీ, సంఘ్‌ మతమౌఢ్యాన్ని విస్తరిస్తూ, సమాజంలో చీలికలు తెస్తూ, ఫాసిస్టు భావాలను ప్రోత్సహిస్తోంది. వీటిని అడ్డుకోడానికి ఇలాంటి చర్యలు అవసరమే’’ అని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ మొహమ్మద్‌ సలీం చెప్పారు. మసీదులు, గురుద్వారాలు, చర్చిల కమిటీల్లోనూ లౌకిక భావాలున్నవారుండేట్లు చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు.

Updated Date - 2020-02-22T08:35:15+05:30 IST