Abn logo
Oct 2 2020 @ 04:07AM

‘పంచాయతీ’ నిర్వీర్యం!

సీతానగరం, అక్ట్టోబరు 1: సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో గ్రామ పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైనట్టే. వాస్తవానికి నవరత్నాల అమలు కోసమే ఈ వ్యవస్థను తీసుకువచ్చామని ప్రభుత్వం తొలుత చెప్పింది. పంచాయతీలకు సం బంధం లేకుండానే గ్రామ సచివాలయాలు పనిచేస్తాయని కూడా చెబుతూ వచ్చారు. కానీ తర్వాత పంచాయతీలనే సచివాలయాలుగా మార్చేశారు. చివరకు సచివాలయాల్లో పెత్తనం గ్రేడ్‌-1 పంచాయతీ సెక్రటరీకి అప్పగించారు. మున్సిపాల్టీలలో అయితే వార్డు సచివాలయాలపై పెత్తనం మున్సిపల్‌ కమిషన్లది. ఇన్‌చార్జిగా మున్సిపాల్టీకి సంబంధించిన ఒక ఉద్యోగి ఉంటారు. ప్రస్తుతం పనిచేసేది సచివాలయ ఉద్యోగులైనప్పటికీ పెత్తనం అంతా ఆయా గ్రామ పంచాయతీల సెక్రటరీలు, మున్సిపల్‌ కమిషనర్లదే. ఇక జిల్లాలో 1271 గ్రామ సచివాలయాలు ఉండగా 13 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వీటిలో ఖాళీల సంఖ్య వందల్లోనే ఉంది.


మున్సిపాల్టీలలో 319 వార్డు సచివాలయాలు ఉండగా, 1609 పోస్టులు ఉన్నాయి. ఇంకా 301 ఖాళీలు ఉన్నాయి. ఇటీవల పరీక్షలు నిర్వహించారు. త్వరలో ఇవి భర్తీ కావచ్చు. ఇంటి పన్నులు, ఇంటి ప్లాన్లు, సంక్షేమ పథకాలు, మీసేవ ద్వారా అందించే సేవలన్నీ ఈ సచివాలయాలకే ప్రభుత్వం ఇచ్చింది. కానీ పూర్తిగా అమలు కావడంలేదు. డిజిటల్‌ అసిస్టెంట్‌కు 540 సేవలను అప్పగించారు. వీరికి ఇప్పటివరకూ శిక్షణ ఇవ్వలేదు. వలంటీర్లు చాలామంది ఇంతవరకూ రాజకీయ నేతల అనుచరులు గా చలామణీ అవుతున్నారు. వీరిపై మండల స్థాయిలో ఒక అధికారిని నియమించారు. వీరి వ్యవహార శైలి ఎలా ఉంటుందో చూడాలి.


జిల్లాలో జేసీ-3, డివిజన్‌లో డీడీవో

సచివాలయ వ్యవస్థ కోసం జేసీ-3ని నియమించారు. సచివాలయాల కార్యకలాపాలన్నీ జేసీ చూసుకోవాలి. మండల స్థాయిలో ఎంపీడీవోలు ఉన్నారు. డివిజన్‌ స్థాయిలో ఇటీవల ప్రభుత్వం డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ (డీడీవో) పోస్టును సృష్టిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఎవరినీ ఇంకా నియమించలేదు. కానీ మున్సిపాల్టీల్లో ఈ స్థాయి అధికారి పోస్టును ఇంకా సృష్టించలేదు.Advertisement
Advertisement
Advertisement