సచివాలయ భవన నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2020-10-01T08:06:35+05:30 IST

జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్‌ఆర్‌ ఆరోగ్య కేంద్రాలు,

సచివాలయ భవన నిర్మాణాలు  త్వరగా పూర్తి చేయాలి

కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి 


 డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ),సెప్టెంబరు 30: జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్‌ఆర్‌ ఆరోగ్య కేంద్రాలు, గోదాములు, అంగన్‌వాడీ భవన నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. స్థలాల గుర్తింపులో ఏమైనా వివాదాలు ఉంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు. కలెక్టర్‌ కార్యాలయం నుంచి కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి జాయింట్‌ కలెక్టర్‌ జి లక్ష్మీశ, జి.రాజకుమారి, జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్‌ సత్తిబాబుతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో మాట్లాడారు.


గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను పటిష్టం చేసే క్రమంలో ఆయా భవన నిర్మాణాలు సత్వరం పూర్తి చేయడంపై దృష్టి సారించాలని రెవెన్యూ, వ్యవసాయ, ఇంజనీరింగ్‌ విభాగాల అధికారులను ఆదేశించారు. స్థలాల గుర్తింపు, నిర్మాణాలు, సచివాలయ సేవలు పర్యవేక్షణకు 12 మంది ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. ఖరీఫ్‌లో పంట ఉత్పత్తుల సేకరణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అక్టోబరు 1న కనీస మద్దతు ఽధరలకు సంబంధించిన పోస్టర్ల ఆవిష్కరణ ఉంటుందని, ఈ పోస్టర్లను 5న ఆర్‌బీకేల్లో ప్రదర్శించాలన్నారు.


నాడు-నేడు పెండింగ్‌ పనులను సత్వరమే పూర్తి చేయాలన్నారు. విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు అందించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఉచిత విద్యుత్‌కు సంబంధించి జిల్లా స్థాయిలో అవగాహన కార్యక్రమాలు పూర్తయినందున, డివిజన్‌ స్థాయిలో కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని వ్యవసాయ, విద్యుత్‌ విభాగాల అధికారులకు సూచించారు. ఇటీవల భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన వారికి వెంటనే పరిహారం అందించాల్సి ఉందన్నారు.


జిల్లా పంచాయతీ అధికారి ఎస్‌వీ నాగేశ్వర్‌నాయక్‌, జడ్పీ ఇన్‌చార్జి సీఈవో పి.నారాయణమూర్తి, జేడీఏ ఎఫ్‌వీఎస్‌ ప్రసాద్‌, ఐసీడీఎస్‌ పీడీ డి.పుష్పమణి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-01T08:06:35+05:30 IST