సచివాలయంలో రాష్ట్రపతి ఎన్నికల ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-07-10T12:59:27+05:30 IST

సచివాలయంలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ప్రస్తుత రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ పదవీ కాలం ఈ నెల 24న

సచివాలయంలో రాష్ట్రపతి ఎన్నికల ఏర్పాట్లు

                              - 12న బ్యాలెట్‌ పత్రాల రాక


చెన్నై, జూలై 9 (ఆంధ్రజ్యోతి): సచివాలయంలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ప్రస్తుత రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ పదవీ కాలం ఈ నెల 24న ముగియనుండటంతో కొత్త రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు బ్యాలెట్‌ పద్ధతిలో పోలింగ్‌ జరుగనుంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్‌సిన్హా పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రానికి చెందిన 234 మంది శాసనసభ్యులు, 39 మంది లోక్‌సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులు ఓటు వేయనున్నారు. ఎంపీలు ఢిల్లీలోనూ లేదా ఇతర రాష్ట్రాలలోనూ ఓటవేయడానికి వీలుంది. అయితే ఎంపీలు ముందుగా తాము ఏ చోట ఓటు హక్కును వినయోగించుకోనున్నారనే విషయాన్ని ముందుగా ఎన్నికల అధికారికి తెలియజేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్‌ పత్రాలను ముద్రించే పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సచివాలయంలో జరుగనున్న పోలింగ్‌కు బ్యాలెట్‌ పత్రాలను ఢిల్లీ నుంచి తీసుకువచ్చేందుకు తగు సన్నాహాలు చేపడుతున్నారు. ఈ నెల 11న శాసనసభ కార్యనిర్వహణ అధికారి విమానంలో ఢిల్లీకి వెళ్ళనున్నారు. మరుసటి రోజు బ్యాలెట్‌ బాక్స్‌, బ్యాలెట్‌ పత్రాలతో ఆయన విమానంలో భారీ భద్రతా ఏర్పాట్ల నడుమ చెన్నైకి చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి పోలీసుల భద్రత మధ్య వాటిని సచివాలయానికి తరలించనున్నారు. సచివాలయంలో ప్రత్యేక స్ట్రాంగ్‌ రూమ్‌లో బ్యాలెట్‌ బాక్స్‌, బ్యాలెట్‌ పత్రాలను భద్రపరచనున్నారు. వాటిని ఈ నెల 18న పోలింగ్‌ ముగిసిన రోజు సాయంత్రమే భారీ భద్రతా ఏర్పాట్ల నడుమ విమానంలో ఢిల్లీకి తరలించనున్నారు.

Updated Date - 2022-07-10T12:59:27+05:30 IST