దోమలతో సీజనల్‌ వ్యాధులు

ABN , First Publish Date - 2022-08-08T06:28:46+05:30 IST

వర్షాకాలంలో నిలువ ఉండే నీటిలో వృద్ధి చెందే దోమలతో డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్‌ వ్యాధులు అధికంగా ప్రబలే అవకాశాలుంటాయని మేయర్‌ యాదగిరి సునీల్‌రావు అన్నారు.

దోమలతో సీజనల్‌ వ్యాధులు
52వ డివిజన్‌లో అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్న మేయర్‌ సునీల్‌రావు

 - పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి 

- మేయర్‌ యాదగిరి సునీల్‌రావు 

కరీంనగర్‌ టౌన్‌, ఆగస్టు 7: వర్షాకాలంలో నిలువ ఉండే నీటిలో వృద్ధి చెందే దోమలతో డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్‌ వ్యాధులు అధికంగా ప్రబలే అవకాశాలుంటాయని  మేయర్‌ యాదగిరి సునీల్‌రావు అన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతతోపాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని  సూచించారు. ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు డ్రై డే పాటించాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయన కార్పొరేటర్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్న 33వ డివిజన్‌ భగత్‌నగర్‌లో పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ పూల కుండీలు, మట్టిచిప్పలు, పాత టైర్లు, ఇళ్లలో నిలువ ఉంచుకున్న నీటితొట్టిలు, డ్రమ్ములను పరిశీలించి నీటిని తొలగించారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే దోమల బెడద తగ్గి వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చన్నారు.  నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో దోమల నివారణ చర్యలను చేపడుతున్నామని తెలిపారు. ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారం విధిగా డ్రై డేను పాటించి పరిసరాలను శుభ్రం చేసుకోవాలని, వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏదైనా సమస్య వస్తే తన దృష్టికి తీసుకురావాలని మేయర్‌ ప్రజలకు సూచించారు. 

- నగరంలోని 60 డివిజన్లలో దశలవారీగా అభివృద్ధి పనులను చేపడుతున్నామని మేయర్‌ యాదగిరి సునీల్‌రావు తెలిపారు.  ఆదివారం 52వ డివిజన్‌లో పర్యటించి డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించి నిర్ణీత సమయంలో పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో కమిషనర్‌ సేవా ఇస్లావత్‌, కార్పొరేటర్‌ అఖిల్‌ ఫిరోజ్‌, డీఈ మసూద్‌ అలీ, ఏఈ గంగాధర్‌, డివిజన్‌ ప్రతినిధులు అజీమ్‌, షౌఖత్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-08T06:28:46+05:30 IST