అప్పుచెల్లించలేదని పేద మహిళ ఇంటికి సీల్‌

ABN , First Publish Date - 2021-10-20T04:07:17+05:30 IST

తమ వద్ద తీసుకున్న అప్పు గడువు ప్రకారం చెల్లించలేదని ఓ ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీ వారు ఏకంగా ఓ పేద మహిళ ఇంటిని జప్తు చేసి సీల్‌ వేసిన ఘటన మంగళవారం ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో జరిగింది.

అప్పుచెల్లించలేదని పేద మహిళ ఇంటికి సీల్‌
మధిరలో ప్రైవేట్‌ ఫైనాన్స్‌ సంస్థ ఉద్యోగులతో వాదనకు దిగిన సీపీఎం నాయకులు

మధిరలో ప్రైవేట్‌ ఫైనాన్స్‌ సిబ్బంది నిర్వాకం

అడ్డుకున్న సీపీఎం నాయకులు

మధిర రూరల్‌, అక్టోబరు 19: తమ వద్ద తీసుకున్న అప్పు గడువు ప్రకారం చెల్లించలేదని ఓ ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీ వారు ఏకంగా ఓ పేద మహిళ ఇంటిని జప్తు చేసి సీల్‌ వేసిన ఘటన మంగళవారం ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో జరిగింది. ఈ విషయం తెలుసుకున్న సీపీఎం నాయకులు అక్కడకు చేరుకొని బాధిత మహిళకు అండగా నిలిచి ఫైనాన్స్‌ కంపెనీ వారిని అడ్డుకున్నారు. మధిర పట్టణంలోని ఎస్సీకాలనీకి చెందిన వంగూరి మంగమ్మ కృష్ణాజిల్లా తిరువూరుకు చెందిన ఫైవ్‌స్టార్‌ ఫైనాన్స్‌ సంస్థ వద్ద తన ఇంటిస్థలం డాక్యుమెంట్లు తనఖా పెట్టి సంవత్సరన్నర క్రితం రుణం తీసుకుంది. అనంతరం సంవత్సరం పాటు ప్రతినెల వాయిదా డబ్బులను జమ చేసింది. బండిపై పండ్లు అమ్ముకునే మంగమ్మ లాక్‌డౌన్‌ కారణంగా కొన్నినెలలపాటు ఇంటికే పరిమితం కావడం, వ్యాపారం సరిగా లేకపోవడంతోపాటు ఇంట్లో అనారోగ్య సమస్యల కారణంగా ఈ ఫైనాన్స్‌ వారికి చెల్లించాల్సిన సొమ్మును గత ఆరు నెలలుగా చెల్లించలేకపోయింది. దీంతో ఆ ప్రైవేట్‌ ఫైనాన్స్‌ ఉద్యోగులు మధిరలోని మంగమ్మ ఇంటికి వచ్చి డబ్బులు చెల్లించలేదంటూ ఆమె ఇంటికి తాళం వేసి సీల్‌ వేశారు. దీంతో బాధితురాలు మధిర సీపీఎం నాయకులను ఆశ్రయించింది. సీపీఎం నాయకులు మద్దాల ప్రభాకర్‌, మండవ ఫణీంద్రకుమారి, మురళీ తదితరులు బాధిత మహిళ ఇంటికి చేరుకొని ప్రైవేట్‌ పైనాన్స్‌ సంస్థ ఉద్యోగులను అడ్డుకొని ఇంటికి వేసిన సీల్‌ తీసివేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేట్‌ పైనాన్స్‌ సంస్థల ఆగడాలు పలు ప్రాంతాల్లో పెచ్చుమీరుతున్నాయని, పేద మహిళల దగ్గర పీల్చిపిండి చేసి అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రైవేట్‌ ఫైనాన్స్‌ సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సీలు తీయించి తమకు అండగా నిలబడిన సీపీఎం నాయకులకు మంగమ్మ కృతజ్ఞతలు తెలిపింది.

Updated Date - 2021-10-20T04:07:17+05:30 IST