నిరీక్షణకు తెర

ABN , First Publish Date - 2022-01-27T06:04:02+05:30 IST

టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ను నియమితులయ్యారు.

నిరీక్షణకు తెర

- టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కోరుకంటి చందర్‌

- ఉత్తర్వులు జారీ చేసిన పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌

- వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ప్రజాప్రతినిధులకు పార్టీ పగ్గాలు

- చందర్‌ నియామకంలో మంత్రి కేటీఆర్‌ ముద్ర

- నిరాశ చెందుతున్న ఆశావహులు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ను నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ఐదు మాసాలుగా పార్టీ అధ్యక్ష పదవి ఎవరిని వరించనున్నదనే ఊహాగానాలకు తెరపడింది. ఈ పదవిపై ఆశలు పెంచుకున్న పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు ఆ పదవి తమకు దక్కకపోవడంతో నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారు. జిల్లాల పునర్విభజనకు ముందు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు కాల్వశ్రీరాంపూర్‌ మండలం ఉషన్నపల్లి గ్రామానికి చెందిన ఈద శంకర్‌రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు. కొత్త జిల్లాలు ఏర్పడ్డ తర్వాత కొత్తగా అధ్యక్షులను నియమిస్తారని అంతా భావించినప్పటికీ నియమించలేదు. 2017లోనే జిల్లా కమిటీలు ఉండవని, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, సమన్వయకర్తలు ఉంటారని కేసీఆర్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లా కమిటీలు అవసరమని భావించిన కేసీఆర్‌ గత ఏడాది జూలైలో జరిగిన పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో జిల్లా కమిటీలను నియమిస్తామని ప్రకటించారు. సెప్టెంబర్‌లోపే కమిటీలను నియమించాల్సి ఉన్నప్పటికీ, హుజూరాబాద్‌ ఉపఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో ఆలస్యమయ్యింది. ఇప్పట్లో జిల్లా కమిటీ అధ్యక్షులను నియమించరని పార్టీ నాయకులు భావించగా, అనూహ్యంగా పార్టీ అన్ని జిల్లాల అధ్యక్షుల జాబితాను బుధవారం విడుదల చేశారు. పార్టీ అధ్యక్ష పదవిని ఆశించిన నల్ల మనోహర్‌రెడ్డి, రఘువీర్‌సింగ్‌, గండ్ర వెంకటరమణారెడ్డి, పీట్ల గోపాల్‌, కొంకటి లక్ష్మీనారాయణ, పలువురు నాయకులు ఒక్కసారిగా నిరాశకు లోనయ్యారు. 

- అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని..

మరో రెండేళ్లలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు గాను ద్వితీయ శ్రేణి నాయకులకు గాకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లనే పార్టీ అధ్యక్షులుగా నియమించినట్లుగా తేటతెల్లం అవుతున్నది. అందులో భాగంగా జిల్లాలోని పార్టీలో అందరు నేతలతో సత్సంబంధాలు ఉన్న చందర్‌ వైపే మొగ్గు చూపిన పార్టీ అధినేత ఆయనకు పదవిని కట్టబెట్టినట్లుగా కనబడుతున్నది. జిల్లా అధ్యక్షుల నియామకాల్లో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ముద్ర కొట్టొచ్చినట్లుగా కనబడుతున్నది. చందర్‌ కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉంటారనే పేరు జిల్లా పార్టీ వర్గాల్లో ఉన్నది. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి చందర్‌ నియోజకవర్గ అభివృద్ధికి కావాల్సిన నిధుల కోసం ఎక్కువగా మంత్రి కేటీఆర్‌, సీఎం కేసీఆర్‌ను చందర్‌ కలుస్తుండడం గమనార్హం. పార్టీ ఆవిర్భావం నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తగా పని చేసిన చందర్‌ తెలంగాణ ఉద్యమ పోరాటంలో కీలక పాత్రను పోషించిన విషయం తెలిసిందే. ఉద్యమం సందర్భంగా ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. కోరుకంటి లక్ష్మి, మల్లయ్య దంపతులకు రెండో సంతానంగా 1972 సెప్టెంబర్‌ 23న జన్మించిన చందర్‌ది జూలపల్లి మండలం బాలరాజుపల్లి (తుల్షపల్లి) గ్రామం. తన తండ్రి సింగరేణి కార్మికుడు కావడంతో గోదావరిఖనిలోనే స్థిరపడ్డారు. చందర్‌ డిగ్రీ వరకు గోదావరిఖనిలోనే చదివి కాకతీయ యూనివర్శిటిలో ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ చదివారు. 

- చందర్‌ రాజకీయ ప్రస్తానం..

డిష్‌ ఆపరేటర్‌గా పని చేస్తూనే రాజకీయాలపై ఉన్న ఆసక్తితో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1993 నుంచి 97 వరకు తెలుగు యువత కార్యదర్శిగా, 1997-99 వరకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా యువత కార్యదర్శిగా పని చేశారు. కొప్పుల ఈశ్వర్‌ 2001లో టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆయన వెంట చందర్‌ కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. 2002లో టీఆర్‌ఎస్వీ సంయుక్త కార్యదర్శిగా పనిచేసిన ఆయన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 2009 నుంచి నియోజకవర్గ ఉద్యమ సారథిగా కొనసాగాడు. పల్లె నిద్ర, బస్తీ నిద్ర వంటి కార్యక్రమాలను చేపట్టి ప్రజలను చైతన్యపరిచారు. 2011లో తెలంగాణ సాఽధన కోసం 100 రోజుల పాటు దీక్ష కూడా చేశారు. 2012లో కుక్కలగూడూరు నుంచి యైుటింక్లయిన్‌ కాలనీ వరకు 48 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు. 2004లో రామగుండం మున్సిపాలిటీ కౌన్సిలర్‌గా ఎన్నికై ఫ్లోర్‌లీడర్‌గా వ్యవహరించారు. అసెంబ్లీ నియోజవర్గాల పునర్విభజన అనంతరం అప్పటివరకు ఉన్న మేడారం నియోజకవర్గం రామగుండం నియోజకవర్గంగా ఏర్పాటు చేసి జనరల్‌ చేశారు. ఈ నియోజకవర్గానికి 2009లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ, టీడీపీ, సీపీఐ, సీపీఎంలు కలిసి మహాఫ్రంట్‌ను ఏర్పాటు చేయడంతో ఈ నియోజకవర్గానికి టీఆర్‌ఎస్‌కు కేటాయించారు. ఆ సమయంలో చందర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసి 15,984 ఓట్లు సాధించి నాల్గవ స్థానంలో నిలిచారు. తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఇక్కడి నుంచి పార్టీ నుంచి టిక్కెట్‌ ఆశించినప్పటికీ, అప్పటికే టీఆర్‌ఎస్‌లో చేరిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణకు పార్టీ టిక్కెట్‌ ఇచ్చారు. దీంతో తిరుగుబాటు అభ్యర్థిగా ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ నుంచి పోటీలో నిల్చుని 33,494 ఓట్లు సాధించి 2295 ఓట్ల తేడాతో సత్యనారాయణ చేతిలో ఓటమి చెందారు. ఆ తర్వాత ఆయన తిరిగి టీఆర్‌ఎస్‌ పార్టీలోనే కొనసాగారు. 2018లో మరోసారి టీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ ఆశించి భంగపడ్డ చందర్‌ తాడోపేడో తేల్చుకోవాలని పట్టుదలతో మళ్లీ ఏఐఎఫ్‌బీ పార్టీ నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో 61,400 ఓట్లు సాధించిన చందర్‌, సత్యనారాయణపై 26,419 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన టీఆర్‌ఎస్‌ పార్టీలోనే కొనసాగుతున్నారు. పబ్లిక్‌ అండర్‌ టేకింగ్‌ కమిటీ మెంబర్‌గా కూడా పనిచేస్తున్నాడు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి చందర్‌ కృషి చేస్తున్నారు. గడిచిన మూడేళ్లలో వివిధ పనులు చేయడంతో పాటు అతి కీలకమైన మెడికల్‌ కళాశాలను సాధించడం గమనార్హం. ఆయనకు టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి రావడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 


Updated Date - 2022-01-27T06:04:02+05:30 IST