నేటితో ప్రచారానికి తెర

ABN , First Publish Date - 2021-10-27T06:06:06+05:30 IST

ఎన్నికల చరిత్రలో ఇదో మరుపురాని ప్రచార ఘట్టం. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచార పర్వం సరికొత్త రికార్డుగా నిలువనున్నది.

నేటితో ప్రచారానికి తెర

- ఈసీ నిబంధనలతో అగ్రనేతలు దూరం 

- ఎన్నడూ లేని విధంగా ఐదు నెలలుగా ప్రచారం 

- నువ్వా నేనా అన్న రీతిలో ప్రజల్లోకి వెళ్ళిన టీఆర్‌ఎస్‌, బీజేపీ 

- చివరివారంలో కాంగ్రెస్‌ రంగ ప్రవేశం 

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ఎన్నికల చరిత్రలో ఇదో మరుపురాని ప్రచార ఘట్టం. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచార పర్వం సరికొత్త రికార్డుగా నిలువనున్నది. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడక ముందే... ఆ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో ఎవరికీ తెలియని పరిస్థితుల్లో  టీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. ముందెన్నడూ లేని విధంగా ఐదునెలలపాటు కొనసాగిన ఈ ప్రచారానికి బుధవారం సాయంత్రం తెరపడనున్నది. అసెంబ్లీకి, పార్లమెంట్‌కు ఏ ఎన్నికలు జరిగినా 15, 20 రోజులకు మించి ప్రచారాలు జరిగిన దాఖలాలు లేవు. హుజూరాబాద్‌ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణలు రాగా ఆ ఆరోపణలపై విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ మే 1న వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఆయనను తప్పించి శాఖలేని మంత్రిగా చేశారు. మే 2న ప్రాథమిక నివేదిక అనంతరం మంత్రివర్గం నుంచి ఆయనను బర్తరఫ్‌ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈటల రాజేందర్‌ నియోజకవర్గానికి వచ్చి మద్దతుదారులతో చర్చించి జూన్‌ 12న తన శాసనసభ్యత్వానికి,  టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు. జూన్‌ 14న ఆయన బీజేపీలో చేరారు. 

టీఆర్‌ఎస్‌, బీజేపీ హోరాహోరీ

తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన నాటి నుంచే ఆయన నియోజకవర్గానికి చేరుకొని ఎన్నికలు ఎప్పుడు వస్తాయన్న దానిని పరిగణలోకి తీసుకోకుండా ప్రచారానికి శ్రీకారం చుట్టి ప్రజలను తనకు అండగా నిలువాలని కోరుతూ వచ్చారు. టీఆర్‌ఎస్‌ పార్టీ కూడా ఈ పరిణామాన్ని సీరియస్‌గా తీసుకొని మంత్రి హరీష్‌రావును రంగంలోకి దింపి ఈటల వెంట వెళ్లిన పార్టీ నాయకులను, శ్రేణులను తిరిగి పార్టీలోకి రప్పించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించడంతోపాటు మండల స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ టీఆర్‌ఎస్‌కు మద్దతు కూడగట్టడానికి చర్యలు తీసుకున్నది. జూన్‌ 12 నుంచి ఈ రెండు పార్టీలు అప్రకటిత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. నాలుగు నెలల పదిహేను రోజులుగా బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీల ప్రచారం కొనసాగుతుండగా  అంతకుముందు  పది రోజులు అటు ఈటల, ఇటు టీఆర్‌ఎస్‌ నాయకుల మద్దతును కూడగట్టుకునే ప్రయత్నాలు చేశాయి. మొత్తంగా ఈటల మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ అయిన మరుసటి రోజు నుంచే హుజురాబాద్‌లో ఎన్నికల వాతావరణం ప్రారంభమై ఐదు నెలలుగా హోరాహోరీ ప్రచారం చేసి నాయకుల, శ్రేణుల సమీకరణ, ప్రజల మద్దతు కోసం ప్రయత్నాలు కొనసాగాయి. అప్పటి నుంచే విందులు, వినోదాలు, డబ్బుల పంపిణీ, కానుకల పంపిణీ కొనసాగుతూ వస్తున్నాయి. అక్టోబరు 1న ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కాగా ఆ రోజు నుంచే నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ఈనెల 8వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించి ఉపసంహరణ అనంతరం 13న పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. మొత్తం 17 రోజులపాటు ఎన్నికల కమిషన్‌ ప్రచారానికి అవకాశమిచ్చింది. ఈనెల 27 సాయంత్రంతో ప్రచార ఘట్టం ముగియనున్నది. 

కఠినంగా కొవిడ్‌ నిబంధనలు

కేంద్ర ఎన్నికల సంఘం కొవిడ్‌ కారణంగా విధించిన కఠిన నిబంధనల కారణంగా భారీ బహిరంగ సభలు నిర్వహించుకునే అవకాశం లేక పోవడంతో కేసీఆర్‌, అమిత్‌షా, జేపీ నడ్డా లాంటి అగ్రనేతలెవరూ ప్రచార పర్వంలో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. ప్రచార ఘట్టంలో చివరిరోజైన 27న జిల్లా సరిహద్దులోని పెంచికల్‌పేటలో టీఆర్‌ఎస్‌ సభ నిర్వహించాలని తలపెట్టి ఏర్పాట్లు కూడా ప్రారంభించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ సభలో పాల్గొని ప్రసంగించాల్సి ఉన్నది. కేంద్ర ఎన్నికల సంఘం కరీంనగర్‌, హన్మకొండ జిల్లాలకు కూడా ఎన్నికల కోడ్‌ వర్తిస్తుందని తేల్చిచెప్పడంతో చివరి క్షణంలో కేసీఆర్‌ పాల్గొనే ఆ సభను టీఆర్‌ఎస్‌ రద్దు చేసుకున్నది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు మద్దతుగా ప్రచారంలో మంత్రులు హరీష్‌రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎరబెల్లి దయాకర్‌రావు, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, సబితా ఇంద్రారెడ్డి, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి,  ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావు, వాణిదేవి, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్‌, కెప్టెన్‌ లక్ష్మికాంతరావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌, పలువురు శాసనసభ్యులు, పార్టీ సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు. ప్రచార బాధ్యతలను తన భుజస్కందాలపై వేసుకొని మంత్రి హరీష్‌రావు సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మద్దతుగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మరో కేంద్ర మంత్రి మురళీధర్‌గౌడ్‌, స్మృతి ఇరానీ, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకె అరుణ, బీజేపీ రాష్ట్ర  వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌చుగ్‌, మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగర్‌రావు, హిమాచల్‌ ప్రదేశ్‌ ఇన్‌చార్జి మురళీధర్‌రావు, రాష్ట్ర నాయకులు పి.సుగుణాకర్‌రావు, గుజ్జుల రామకృష్ణారెడ్డి, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి పలువురు మాజీ శాసనసభ్యులు, పార్టీ సీనియర్‌ నాయకులు విజయశాంతి, బాబుమోహన్‌, ఎంపీ అర్వింద్‌, ఎమ్మెల్యే రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ప్రచార బాధ్యతలను నిర్వహిస్తూ నియోజకవర్గంలోనే మకాం వేసి తనతోపాటు కమిటీలో ఇన్‌చార్జిలుగా నియమితులైన రఘునందన్‌రావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, బండ కార్తీకరెడ్డి, చాడ సురేశ్‌రెడి,్డ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తదితరులతో కలిసి అధికార పార్టీకి ధీటుగా పార్టీశ్రేణులను ప్రచార రంగంలోకి పరుగులు పెట్టించారు. పార్టీ అభ్యర్థి అయిన ఈటల రాజేందర్‌ తనదైన శైలిలో గ్రామగ్రామాన పర్యటిస్తూ తానే ఒక స్టార్‌ కాంపెయినర్‌గా ప్రచారం నిర్వహించగా ఆయన సతీమణి ఈటల జమున కూడా పాదయాత్రలతో ప్రచారాన్ని హోరెత్తించారు. 

ఆలస్యంగా వచ్చినా..

కాంగ్రెస్‌ నుంచి బల్మూరి వెంకట్‌నర్సింగారావు అభ్యర్థిగా పోటీలో ఉండగా ప్రచారంలోకి ఆలస్యంగా అడుగుపెట్టారు. అయినా వారంరోజుల్లోనే నియోజకవర్గమంతా చుట్టుముట్టి ఆ పార్టీ నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ఇన్‌చార్జి మానిక్కం ఠాగూర్‌, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర నర్సింహ, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, మాజీ మంత్రులు షబ్బీర్‌ అలీ, శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి, శాసనసభ్యురాలు సీతక్క,  మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ పలువురు మాజీ శాసనసభ్యులు, నేతలు పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల అభ్యర్థులు నువ్వా..నేనా అనే విధంగా ప్రచారాన్ని కొనసాగిస్తుండగా చివరి క్షణంలో వచ్చిన కాంగ్రెస్‌ అభ్యర్థి కూడా ఈ పోటీని ముక్కోణంగా మార్చేందుకు ప్రచారాన్ని దూకుడుగా కొనసాగిస్తున్నారు. రెండు రోజులుగా అన్ని పార్టీలు ప్రచారంతో నియోజకవర్గాన్ని హోరెత్తిస్తున్నాయి. బుధవారంతో ప్రచారం ముగియనుండగా ఆఖరిరోజు ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. 


Updated Date - 2021-10-27T06:06:06+05:30 IST