శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసిన వదురుబోతు పిట్టలు!

ABN , First Publish Date - 2022-02-23T00:08:02+05:30 IST

ఓ అధ్యయనం కోసం ఎంచుకున్న ఆస్ట్రేలియన్ మాగ్పీలు (వదురుబోతు పిట్టలు) శాస్త్రవేత్తలను నోరెళ్లబెట్టేలా చేశాయి..

శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసిన వదురుబోతు పిట్టలు!

న్యూఢిల్లీ: ఓ అధ్యయనం కోసం ఎంచుకున్న ఆస్ట్రేలియన్ మాగ్పీలు (వదురుబోతు పిట్టలు) శాస్త్రవేత్తలను నోరెళ్లబెట్టేలా చేశాయి. బ్యాక్‌ప్యాక్ లాంటి ట్రాకింగ్ పరికరాల పరీక్షించడం, ఈ పక్షుల కదలికలు, వాటి సామాజిక స్థితిగతుల గురించి తెలుసుకోవడం లక్ష్యంగా ఈ పరిశోధన సాగింది.


ఈ సందర్భంగా వారు పక్షులలో చాలా అరుదుగా కనిపించే పూర్తి కొత్త సామాజిక ప్రవర్తనను గుర్తించారు. ఈ అధ్యయనంలో అవి తమను ఎంతగానో ఆశ్చర్యపరిచాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వాటికి తాము అమర్చిన ట్రాకర్‌ను తొలగించడంలో అవి ఒకదానికొకటి సాయం చేసుకోవడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు.  


నిజానికి ఈ వదురుబోతు పిట్టలు తెలివైన సామాజిక జీవులని తమకు తెలుసని, అయితే, ఈ రకమైన పరోపకార ప్రవర్తనను చూడడం మాత్రం ఇదే తొలిసారని వారు వివరించారు. ఈ పరిశోధనలో తాము పక్షులను మళ్లీ పట్టుకోవాల్సిన అవసరం లేని పద్ధతిని ఉపయోగించి ట్రాకర్లు అమర్చినట్టు చెప్పారు. ఈ ట్రాకర్లు మధ్యమ స్థాయి నుంచి చిన్న పక్షులకు సరిపోలేనంత పెద్దగా ఉన్నాయి. అంతేకాదు, డేటాను నిల్వ చేసుకోవడం, లేదంటే బ్యాటరీ జీవితకాలం చాలా పరిమిత సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.


ఇవి సింగిల్ యూజ్ కావడంతో వీటికి అమర్చిన పక్షులను తిరిగి పట్టుకోవాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. కాగా, వాతావరణ మార్పుల సమయంలో పెరుగుతున్న ఫ్రీక్వెన్సీ, హీట్‌వేవ్‌లు ఈ పక్షులకు తీవ్ర హాని చేస్తున్నాయని శాస్త్రవేత్తల పేర్కొన్నారు. వాటి బారి నుంచి వాటిని రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు సంబంధించిన అధ్యయన వివరాలు ఈ వారం ప్రచురితమయ్యాయి. మాగ్పీ పిల్లల మనుగడ రేటు 10 శాతంగా మాత్రమే ఉన్నట్టు పెర్త్ పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనంలో వెల్లడైంది. 

Updated Date - 2022-02-23T00:08:02+05:30 IST