అన్ని కరోనా వేరియంట్లకు సూపర్ వ్యాక్సీన్... వచ్చే ఏడాదే ట్రయల్స్!
ABN , First Publish Date - 2021-06-24T12:58:15+05:30 IST
కరోనా కొత్త వేరియంట్లు ప్రపంచానికి సవాలుగా నిలిచాయి.
వాషింగ్టన్: కరోనా కొత్త వేరియంట్లు ప్రపంచానికి సవాలుగా నిలిచాయి. అయితే ఇంతలోనే ఒక శుభవార్త వినిపిస్తోంది. కరోనా కారణంగా భవిష్యత్తులో వచ్చే అంటువ్యాధుల నుంచి రక్షణ అందించగల సూపర్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఈ టీకాను ఇప్పటికే ఎలుకలపై విజయవంతంగా ప్రయోగించారు. ఈ టీకాను అమెరికాలోని నార్త్ కరోలినా విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసింది. దీనికి సంబంధించిన వివరాలను విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో నడిచే సైన్స్ పత్రికలో ప్రచురించారు.
శాస్త్రవేత్తలు ఈ ఆవిష్కరణను రెండవతరం టీకాగా వర్ణించారు. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ఈ టీకా కోవిడ్ -19 తో పాటు కరోనా వైరస్ కుటుంబంలోని అన్ని ప్రమాదకరమైన వైరస్‌లతో పోరాడటానికి సహాయపడుతుంది. వచ్చే ఏడాది నాటికి ఈ టీకాను మనుషులపై పరీక్షించాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. కరోనా వైరస్‌లోని కొత్త వేరియంట్లు భవిష్యత్తులో కొత్త అంటువ్యాధులకు దారి తీసే అవకాశముందని, అలాంటి ప్రమాదాన్ని నివారించడానికే ఈ టీకాను రూపొందిస్తున్నామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎలుకలపై చేసిన పరీక్షల్లో ఈ టీకా ప్రతిరోధకాలను సృష్టించింది. ఇవి స్పైక్ ప్రోటీన్‌కు వ్యతిరేకంగా కూడా ప్రభావవంతంగా ఉంటాయి. ఈ టీకా దక్షిణాఫ్రికాలో కనిపించిన బీ.1.351 వేరియంట్‌పై కూడా ప్రభావాన్ని చూపించింది. కరోనా వైరస్ బయటి ఉపరితలంపై ముల్లు లాంటి భాగం నుంచి వైరస్ ప్రోటీన్ విడుదలవుతుంది. దీనిని స్పైక్ ప్రోటీన్ అంటారు.ఈ ప్రోటీన్‌తో ఇన్‌ఫెక్షన్ ప్రారంభమవుతుంది. ఇది మానవ ఎంజైమ్ ఏసీఈ2 రిస్పెక్టర్‌తో జతకట్టడం ద్వారా ఊపిరితిత్తులకు చేరుకుంటుంది. తద్వారా వ్యాధి వ్యాప్తి చెందుతుంది.