ఆయిల్‌పాం సాగుకు ప్రోత్సాహం

ABN , First Publish Date - 2021-08-04T04:45:27+05:30 IST

జిల్లాలో ఆయిల్‌పాం సాగును ప్రోత్సహిస్తున్నట్లు కలెక్టర్‌ శ్రుతి ఓజా అన్నారు.

ఆయిల్‌పాం సాగుకు ప్రోత్సాహం
విజ్ఞానయాత్ర బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తున్న కలెక్టర్‌ శ్రుతి ఓజా

- కలెక్టర్‌ శ్రుతి ఓజా

- వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారుల విజ్ఞాన యాత్ర 

గద్వాల క్రైం, ఆగస్ట్‌ 3 : జిల్లాలో ఆయిల్‌పాం సాగును ప్రోత్సహిస్తున్నట్లు కలెక్టర్‌ శ్రుతి ఓజా అన్నారు. ఆయిల్‌ ఫాం యూనిట్‌ సాగుపై అవగాహన కోసం ఉద్యానశాఖ, వ్యవసాయశాఖ అధికారులు మంగళవారం ఖమ్మ జిల్లా అశ్వరావుపేటకు బయలు దేరారు. వారు వెళ్తున్న రెండు ఆర్టీసీ బస్సులను కలెక్టర్‌ శ్రుతి ఓజా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గద్వాల, మల్దకల్‌, ఇటిక్యాల, ధరూర్‌, కేటీదొడ్డి మండలాల ఏఈవోలు, ఏవోలు, ఉద్యానవన శాఖ అధికారులు 70 మంది పాల్గొంటున్న ఈ యాత్ర రెండు రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. వచ్చే సంవత్సరం జిల్లాలో మూడు వేల హెక్టార్లలో ఆయిల్‌పాం సాగు చేయలన్నదే ఈ విజ్ఞానయాత్ర లక్ష్యమని ఉద్యానవన శాఖ జిల్లా అధికారి సురేష్‌ తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ అధికారి గోవిందనాయక్‌, సక్రియ నాయక్‌, తదితరులు పాల్గొన్నారు.


లేఅవుట్లను క్రమబద్ధీకరించాలి

లేఅవుట్లను క్రమబద్ధీకరించాలని కలెక్టర్‌ శ్రుతి ఓజా అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో గద్వాల, అలంపూర్‌, వడ్డెపల్లి, అయిజ మున్సిపల్‌ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అనుమతి పొందిన లే అవుట్లలో 10 శాతం భూమికి అనుమతి ఇచ్చారా లేదా పరిశీలించాలని, ఇవ్వకపోతే మూడు రోజుల  మయం ఇచ్చి భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించాలని ఆదేశించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం క్లస్టర్‌ను సిద్ధం చేసుకోవాలని, అందుకు జిల్లా కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. విద్యుత్‌ స్తంభాలు వేసేందుకు ఆ శాఖ అనుమతి ఇచ్చిందా లేదా చూసుకోవాలని, నాలా పరిమిషన్‌ను తనిఖీ చేయాలని ఆదేశించారు. హరితహారంపై సమీక్షిస్తూ అయిజ, గద్వాల రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి చేయాలని సూచించారు. సీసీ రహదారుల పనులు, వైకుంఠధా మాలు, సెగ్రిగేషన్‌ షెడ్ల పనులు ఈ నెల 15 వరకు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పనుల పురోగతిని ఫొటో తీసి గ్రూప్‌లో పెట్టాలని ఆదేశించారు. మునిసిపాలిటీల వారీగా జరుగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష, మునిసిపల్‌ కమిషనర్లు శ్రీనివాస్‌రెడ్డి, వేణుగోపాల్‌, పల్లారావు, నిత్యానంద్‌ ఉన్నారు.


ఇంటింటా ఇన్నోవేటర్‌ పోస్టర్‌ విడుదల

ఇంటింటా ఇన్నోవేటర్‌ ఆన్‌లైన్‌ ఆవిష్కరణలకు సంబంధించిన పోస్టర్‌ను కలెక్టర్‌ శ్రుతి ఓజా మంగళవారం విడుదల చేసారు. తెలంగాణ రాష్ట్రంలో ఇన్నోవేషన్‌, సృజనాత్మకతను ప్రోత్సహించడానికి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆన్‌లైన్‌లో ఆవిష్కరణల ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని రంగాల, వర్గాల ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. అన్‌లైన్‌ ఎగ్జిబిషన్‌ లింక్‌ ద్వారా ప్రజలు ఈ ప్రదర్శనను చూడొచ్చని తెలిపారు. కార్యక్రమంలో డీఈవో సిరాజుద్దీన్‌, సీపీవో లక్ష్మన్‌, డీపీఆర్‌వో చెన్నమ్మ, జిల్లా సైన్స్‌ అధికారి భాస్కర్‌, పాపన్న తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-04T04:45:27+05:30 IST