‌విద్యాసంస్థల్లో.. వైరస్‌

ABN , First Publish Date - 2021-04-13T05:51:30+05:30 IST

జిల్లాలోని విద్యాసంస్థల్లో కొవిడ్‌ ప్రకంపనలు విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గుంటూరు నగరపాలక సంస్థకు చెందిన పాఠశాలల్లో ఇప్పటికే ఇద్దరు ఉపాధ్యాయులు కొవిడ్‌తో మృతి చెందారు.

‌విద్యాసంస్థల్లో.. వైరస్‌
దర్మల్‌ స్ర్కీనింగ్‌ చేస్తున్న ఉపాధ్యాయులు(పాతచిత్రం)

బడుల్లో కరోనా ప్రకంపనలు

ఉపాధ్యాయులకు, విద్యార్థులకు పాజిటివ్‌

గుంటూరులో ఇద్దరు ఉపాధ్యాయుల మృతి

భయాందోళనల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు

ప్రైవేటు పాఠశాలల్లో పట్టించుకోని కొవిడ్‌ నిబంధనలు


కరోనా.. విద్యాసంస్థలను వెంటాడుతోంది. జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలను వైరస్‌ వణికించేస్తోంది. పలు ప్రభుత్వ పాఠశాలలు కరోనా కారణంగా మూతపడ్డాయి. ప్రైవేటు విద్యాసంస్థలు మాత్రం కరోనాను పక్కన పెట్టి యథేచ్ఛగా తరగతులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయ కుటుంబాలను కూడా కరోనా వీడనంటోంది. ఇటీవల ఎన్నికల విధులకు హాజరై వచ్చిన వారు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. కొందరు ఉపాధ్యాయులు కరోనా టెస్టులు చేయించుకుని చికిత్స పొందుతున్నారు. మరికొందరు వారికి కరోనా అన్న విషయం తెలుసుకునేలోగా ఆయా తరగతుల్లోని విద్యార్థులకు వైరస్‌ వ్యాపిస్తోంది. విద్యార్థుల నుంచి వారి తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులు వైరస్‌ బారిన పడుతున్నారు. ఇలా వైరస్‌ వ్యాప్తికి విద్యాసంస్థలు కేంద్రాలుగా మారుతున్నాయి. గుంటూరు నగర పాలక సంస్థ పాఠశాలల్లో పని చేసే ఇద్దరు ఉపాధ్యాయులు కరోనా కారణంగా మృతి చెందారు. జిల్లాలోని పలు పాఠశాలల్లో పలువురు ఉపాధ్యాయులు కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. 


గుంటూరు(విద్య), గుంటూరు(తూర్పు), ఈపూరు, ఏప్రిల్‌ 12: జిల్లాలోని విద్యాసంస్థల్లో కొవిడ్‌ ప్రకంపనలు విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గుంటూరు నగరపాలక సంస్థకు చెందిన పాఠశాలల్లో ఇప్పటికే ఇద్దరు ఉపాధ్యాయులు కొవిడ్‌తో మృతి చెందారు. ఆ పాఠశాలల్లో మరో 9 మంది ఉపాధ్యాయులకు పాజిటివ్‌ రావడం కలకలం సృష్టిస్తోంది. ఇటీవల కొత్తపేటలోని కాసుశాయమ్మ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయిని కరోనాతో మృతి చెందగా, ఆ తర్వాత రోజు ఆమె కుటుంబంలో మరొకరు మృత్యువాతపడ్డారు. తాజాగా సోమవారం జలగం రామారావు పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయుడు కరోనాతో మృతి చెందారు. కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన శ్వాసఅందక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తోటి ఉపాధ్యాయులు తెలిపారు. జలగం రామారావు పాఠశాలలో వారం క్రితం 9 మంది ఉపాధ్యాయులు కరోనా బారిన పడిన విషయం  ఉన్నాతాధికారుల దృష్టికి వెళ్లింది. అయినా వారు పెద్దగా పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి. మొదటే స్పందించి అధికారులు చర్యలు తీసుకుని ఉంటే ఉపాధ్యాయుడు మృతి చెంది ఉండేవారు కాదని పలువురు ఉపాధ్యాయులు వాదిస్తున్నారు. ఇజ్రాయిల్‌పేటలోని బొర్రా నాగేశ్వరరావు పాఠశాలలో కూడా ఓ ఉపాధ్యాయిని కరోనా బారిన పడినట్లు సమాచారం.    ఇటీవల ఎన్‌జీవో కాలనీ సమీపంలోని ఓ పాఠశాల వద్ద ఉన్న దుకాణదారుడికి కొవిడ్‌ సోకింది. దీంతో అక్కడ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు. సమీపంలోని అన్ని దుకాణాలు ఉపాధ్యాయులు మూసివేయించారు. విద్యార్థులకు సెలవులు ప్రకటించి ఉపాధ్యాయులు పరీక్షలు చేయించుకునేలా ఆదేశాలు జారీ అయ్యాయి. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలు, జడ్పీటీసీ, మండల పరిషత్‌ ఎన్నికల్లో పాల్గొని వచ్చిన ఉపాధ్యాయుల్లో అనేక మందికి కరోనా సోకినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో బాపట్ల, తెనాలి తదితర ప్రాంతాల్లోని పలు పాఠశాలల్లో విద్యార్థులకు పరీక్షలు చేయగా పాజిటివ్‌ రిపోర్టులు వచ్చాయి. దీంతో వెంటనే ఆయా విద్యాసంస్థల్ని మూసివేశారు. ఈపూరులోని ఏపీ మోడల్‌ స్కూల్‌లో ఓ టీచర్‌కు కరోనా సోకింది. దీంతో ఆ టీచర్‌ బోధించే తరగతిలోని 56 మంది విద్యార్థులకు కొవిడ్‌ పరీక్షలు చేయించినట్లు ప్రిన్సిపాల్‌ వేళంగిణిమేరి తెలిపారు.  

పాఠశాలల్లో కొవిడ్‌ ప్రబలిన విషయం గురించి బయటకు చెప్పవద్దని ఉన్నత స్థాయి అధికారుల నుంచి ఒత్తిడి రావడంతో ప్రధానోపాధ్యాయులు మౌనంగా ఉంటున్నారని సమాచారం.   


కొవిడ్‌ నిబంధనలు గాలికి 

కొన్ని రోజులుగా జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అయినా అధికారులు పట్టించుకోవడంలేదు. దీంతో ఆయా విద్యాసంస్థల్లో కొవిడ్‌ నిబంధనలు గాలికి వదిలేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభమైన పాఠశాలల్లో తొలివారం రోజులు ధర్మల్‌ స్ర్కీనింగ్‌, గదుల శానిటైజేషన్‌, చేతుల శానిటైజ్‌, భౌతిక దూరం తదితర నిబంధనల అమలుపై ఉపాధ్యాయులు, యాజమాన్యాలు శ్రద్ధ చూపాయి. ఆ తర్వాత వాటి గురించి పట్టించుకునే వారు పర్యవేక్షించేవారు లేకుండాపోయారు. దీంతో విద్యాసంస్థల్లో చాపకింద నీరులా కొవిడ్‌ విస్తరిస్తోంది. ఇప్పటికే జిల్లాలో రోజువారీ కేసులు 500పైగా వస్తున్నాయి. అయినా విద్యాసంస్థల్లో మాత్రం కొవిడ్‌పై విద్యార్థుల్ని చైతన్యవంతం చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. కరోనా భయంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో నెలకొంది. దీంతో అనేక మంది విద్యార్థుల్ని పాఠశాలలకు పంపడం లేదు. ఇక ప్రైవేటు పాఠశాలల విషయానికి వస్తే విద్యార్థుల్ని ఆటోల్లో కుక్కి తీసుకెళ్తున్నారు. కనీసం అనేక పాఠశాలల్లో శానిటైజర్‌ కూడా అందుబాటులో ఉండటం లేదు. విద్యార్థులే సీసాల్లో తెచ్చుకుని చేతులు శుభ్రం చేసుకోవాలని యాజమాన్యాలు ఉచిత సలహాలు ఇస్తున్నాయి.  


2,142 టెస్టులు.. 388 కేసులు

జిల్లాలో కరోనా పాజిటివ్‌ రేటు 18.11 శాతం

25వ తేదీకి 20,373కి కేసులు చేరుకోవచ్చన్న ఆరోగ్యశాఖ

ఆ స్థాయిలో ఆస్పత్రుల్లో పడకలు సిద్ధం చేయాలని ఆదేశాలు

వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ నుంచి కలెక్టర్‌కు పలు సూచనలు


గుంటూరు(ఆంధ్రజ్యోతి): కరోనా పాజిటివ్‌ శాతం జిల్లా ప్రజలను భీతిల్లేలా చేస్తోన్నది. నిన్నమొన్నటి వరకు 10 శాతం లోపే వైరస్‌ వ్యాప్తి ఉండగా ఇప్పుడు ఏకంగా 18.11 శాతానికి పెరిగింది. వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైన తర్వాత ఈ స్థాయిలో పాజిటివ్‌ రేట్‌ నమోదు కావడం సోమవారం ప్రథమమని వైద్యశాఖ వర్గాలు చెప్తున్నాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు విడుదలైన 2,142 శాంపిల్స్‌ ఫలితాల్లో 388(18.11 శాతం) మందికి పాజిటివ్‌ వచ్చింది. కాగా సాయంత్రానికి మరికొన్ని శాంపిల్స్‌ ఫలితాలు రాగా ఒక్క రోజులో బాధితుల సంఖ్య 418గా నమోదైంది. ఇందులో 208 మంది బాధితులు గుంటూరు నగరానికి చెందిన వారే ఉన్నారు. కరోనా కిట్ల కొరత కారణంగా శాంపిల్స్‌ సేకరణ రెండు రోజుల నుంచి చాలా తక్కువగా జరుగుతున్నది. మూడు రోజులుగా జిల్లాలో నమోదైన సగటు పాజిటివ్‌ కేసుల సంఖ్య 509గా ఉన్నది. దీని ప్రకారం ఈ నెల 18 నాటికి 10,187 మందికి వైరస్‌ సోకవచ్చని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో 509 మందికి ఆక్సిజన్‌ పడకలు, 1,019 మందికి నాన్‌ ఆక్సిజన్‌ పడకలు, 3,056 మందికి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో పడకలు సిద్ధం చేయాలన్నారు. 5,603 మంది హోం ఐసోలేషన్‌లో ఉండే అవకాశం ఉన్నట్లుగా పేర్కొన్నారు. అలానే ఈ నెల 25 నాటికి పాజిటివ్‌ల సంఖ్య 20,373కి చేరవచ్చని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ అంచనా వేశారు. ఆ ప్రకారం 1,019 ఆక్సిజన్‌, 2,037 నాన్‌ ఆక్సిజన్‌, 6,112 కొవిడ్‌ కేర్‌ సెంటర్స్‌లో పడకలు సిద్ధం చేయాలన్నారు. హోం ఐసోలేషన్‌లో 11,205 మంది ఉండొచ్చని అంచనా వేశారు. ఇందుకు తగినట్లుగా ఏర్పాట్లు సిద్ధం చేయాల్సిందిగా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ని ఆయన ఆదేశించారు. అలానే ఈ విషయంలో జాయింట్‌ కలెక్టర్‌(సచివాలయాలు) పీ ప్రశాంతి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ సమీక్షించుకొని అవసరమైన ఏర్పాట్లని డైనమిక్‌ పద్ధతిన చేపట్టాలన్నారు. 


తాజాగా 418 మందికి కరోనా

సోమవారం సాయంత్రం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం జిల్లాలో 418 మందికి కరోనా సోకింది. గుంటూరు నగరంలో 208, తెనాలిలో 38, మంగళగిరిలో 36, తాడేపల్లిలో 23, నరసరావుపేటలో 14 మందికి వైరస్‌ సోకింది.  రేపల్లె, నిజాంపట్నం, కొల్లిపర, వినుకొండ, ఈపూరు, వెల్దుర్తి, దాచేపల్లి, గురజాల, తాడికొండ, ఫిరంగిపురం, మేడికొండూరు, క్రోసూరు, అమరావతిలో 2, గుంటూరు రూరల్‌లో 8, ముప్పాళ్ల, చేబ్రోలు, వేమూరు, పెదకాకానిలో 4, చిలకలూరిపేట, చెరుకుపల్లి, కాకుమాను, భట్టిప్రోలు, సత్తెనపల్లి, తుళ్లూరు, చుండూరు, నాదెండ్ల, పెదకూరపాడులో మూడేసి, అమృతలూరు, రెంటచింతల, వట్టిచెరుకూరు, మాచవరంలో ఒక్కొక్కటి, పిడుగురాళ్లలో 6, బాపట్లలో 5 కేసులు నమోదయ్యాయి. 


టిడ్కో గృహాల్లో కొవిడ్‌ కేంద్రం


తెనాలి అర్బన్‌: తెనాలికి సమీపంలోని వైకుంఠపురం వద్ద నిర్మించిన టిడ్కో గృహాలలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో 220 బెడ్లు నిండిపోయాయి. కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతో ప్రత్యామ్నాయంగా టిడ్కో గృహాలను వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. ఇక్కడ సేవలకు వైద్య ఆరోగ్య, పారిశుధ్య సిబ్బంది, భోజన వసతి తదితర సౌకర్యాలను సమకూర్చాలని కలెక్టర్‌ ఆదేశించారు.  

 

టీకా ఉత్సవ్‌కు.. విరామం


గుంటూరు(సంగడిగుంట): టీకా ఉత్సవ్‌కు మంగళవారం జిల్లాలో అధికారులు విరామం ప్రకటించారు. జిల్లాకు రావాల్సిన టీకాలు మంగళవారం అర్ధరాత్రి తర్వాత వచ్చే అవకాశం ఉంది. దీంతో  బుధవారం పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్‌ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం వచ్చిన డోసులతో మంగళవారం కేవలం 4 వేల మందికే వ్యాక్సిన్‌ అందించగలిగారు. దీంతో అనేక చోట్ల  వ్యాక్సిన్‌ లేక పలువురు వెనుతిరగాల్సి వచ్చింది.  


జీజీహెచ్‌లో.. కల్లోలం

నర్సింగ్‌ సిబ్బందిలో 60 మందికి పాజిటివ్‌ 

అనేక విభాగాల్లో సోమవారం లోపించిన సేవలు


గుంటూరు(సంగడిగుంట): జిల్లాలో కరోనా రెండో విడత విజృంభిస్తున్నది. వైద్య సేవలు అందించాల్సిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనూ కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే 60 మంది నర్సింగ్‌  సిబ్బందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో వారంతా క్వారంటైన్‌కు వెళ్ళిపోయారు. మరో వంద మంది వివిధ కారణాలతో సెలవులో ఉన్నారు. దీంతో మొత్తం 460 మందిలో అధిక సంఖ్యలో సిబ్బంది అందుబాటులో లేక పోవడంతో సోమవారం పలు విభాగాల్లో సేవలకు ఆటంకం కలిగింది. ఉన్న సిబ్బందికే మూడు షిప్టుల్లో విధులు కేటాయిస్తున్నారు. కనీసం ధర్మామీటర్‌ పెట్టి జ్వరం చూసే నాధుడు కూడా కొన్ని విభాగాల్లో కరువయ్యారు. ఈ పరిస్థితి మూడు రోజుల నుంచి ఉంది. అయితే నర్సింగ్‌ విద్యార్థినులతో సమస్యను కొంతవరకు పరిష్కరించుకుంటూ వచ్చారు. ఆదివారం నర్సింగ్‌ విద్యార్థుల్లో కూడా కొందరికి పాజిటవ్‌ వచ్చింది. దీంతో మిగిలిన వారందరినీ సోమవారం పరీక్షలకు పంపారు. దీంతో ఆసుపత్రిలో విధులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. గతంలో కరోనా సందర్భంగా జీజీహెచ్‌లో పనిచేసేందుకు 300 మంది కాంట్రాక్టు పద్ధతిపై నర్సులను విధుల్లోకి తీసుకున్నారు. కరోనా తగ్గిపోయిందని రెండు నెలల క్రితమే వారందరినీ, వారితో పాటు 60 మంది ఎంఎన్‌వోలు, ఎఫ్‌ఎంవోలను విధుల నుంచి తొలగించారు. దీంతో సోమవారం జీజీహెచ్‌లో సిబ్బంది కొరతతో అనేక సేవల్లో అంతరాయం ఏర్పడింది. పరిస్థితి తీవ్రతరమయ్యే అవకాశం ఉండటంతో కలెక్టర్‌కు జీజీహెచ్‌ వైద్యాధికారులు సమాచారం ఇచ్చారు.  


లాక్‌ డౌన్‌ ప్రారంభం

తెనాలి రూరల్‌: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెనాలి మండలంలో ప్రకటించిన లాక్‌డౌన్‌ సోమవారం నుంచి ప్రారంభించారు. తహసీల్దారు రవిబాబు ఆదేశాల మేరకు అంగలకుదురు, కఠెవరం, పెదరావూరు గ్రామాల్లో కట్టడి నిబంధనలు అమలు చేశారు. ఆయా గ్రామాల్లో ఉదయం 6 నుంచి 11 గంటల వరకూ మాత్రమే   దుకాణాలు, హోటళ్లను తెరిచారు. 11 గంటల తర్వాత వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసేశారు. ప్రజలు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఆయా గ్రామాల్లో జనసంచారం లేక రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. లాక్‌డౌన్‌ ఈ నెల 27 వరకూ కొనసాగనుంది.




Updated Date - 2021-04-13T05:51:30+05:30 IST