బడి బియ్యం ఆగమవుతున్నాయ్‌

ABN , First Publish Date - 2020-08-03T10:57:27+05:30 IST

పాలకులు, ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా విలువైన సన్న బియ్యం పురుగుల పాలవుతోంది. కరోనా వ్యాప్తితో

బడి బియ్యం ఆగమవుతున్నాయ్‌

నాలుగున్నర నెలలుగా నిర్లక్ష్యం

పురుగులు, తుట్టెలతో రూ.70 లక్షల విలువైన సన్నబియ్యం వృథా

ఉమ్మడి జిల్లాలో 2వేల క్వింటాళ్ల నిల్వలు


నల్లగొండ, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పాలకులు, ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా విలువైన సన్న బియ్యం పురుగుల పాలవుతోంది. కరోనా వ్యాప్తితో అనూహ్యంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో బడులకు తాళం పడింది. దీంతో పాఠశాలల్లో మిగిలిన మధ్యాహ్న భోజన పథకం సన్నబియ్యం గురించి పట్టించుకునే నాథుడే లేరు. ఆకలితో వలస కూలీలు, ఉపాధి లేక పేదలు అల్లాడుతుంటే అందుబాటులో ఉన్న బియ్యాన్ని పంపిణీ చేయాలన్న ఆలోచన ఎవ్వరూ చేయలేదు. కనీసం పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేసినా ఉపయోగం ఉండేదన్న వాదన ఉపాధ్యాయవర్గాల్లో ఉంది. 


వృథాగా 2వేల క్వింటాళ్లు

విద్యా సంవత్సరం ముగింపు సమయం కావడంతో ప్రభుత్వాధికారులు ఎక్కువ మొత్తంలోనే పాఠశాలలకు బియ్యం సరఫరా చేస్తారు. జూన్‌ మొదటి వారంలో పాఠశాలలు తెరిచే సమయానికి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందుబాటులో ఉండాలన్న యోచనతో అదనంగా బియ్యాన్ని పాఠశాలలకు చేరవేశారు. ఆ క్రమంలో మార్చి 22న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా ప్రకటించింది. దీంతో మార్చి 21 పాఠశాలలకు చివరి పనిదినమైంది. ఆరోజుకు నల్లగొండ జిల్లాలోని పాఠశాలల్లో 1,01,368 కిలోల సన్న బియ్యం ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నట్టు అధికారులు ధ్రువీకరించారు. నల్లగొండ మండలంలో 363కిలోలు, మిర్యాలగూడ మండలంలో 8,461కిలోలు, నిడమనూరు మండలంలో 5వేల కిలోల బియ్యం నిల్వలు అలాగే ఉన్నాయి. వీటిని పాఠశాలల్లోని గదుల్లో ఉంచి తాళాలు వేశారు. వేపాకులు, ఉప్పు వంటివి వేసి గాలి తగిలేలా ఉంచితేనే ఇంట్లో బియ్యానికి పురుగులు పట్టి, వాటిని ఏరివేయడం, చెరగడం చేస్తుంటాం. అలాంటిది నాలుగున్నర నెలలుగా పాఠశాలల్లో ఉన్న బియ్యం మూటలను పట్టించుకోకపోవడంతో తెల్లపురుగు పట్టింది. బియ్యం తుట్టెలు కట్టి గడ్డలుగా మారాయి.


పాఠశాలల్లోని బియ్యం బస్తాలపై లక్కపురుగులు తిరుగుతున్నాయి. ‘ఈ బియ్యాన్ని తింటే పిల్లలకు వాంతులు, విరేచనాలు చేసుకుంటారు. వారానికి ఒకసారి పాఠశాలకు వెళ్లి బియ్యం చూసుకొని రావాలని ఉన్నతాధికారులు నోటి మాటగా చెప్పారు. వారానికి ఒకసారి వెళ్తే పురుగులను ఆపగలుగుతమా అంటూ నార్కెట్‌పల్లి మండలానికి చెందిన ఓ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా నల్లగొండ జిల్లాలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో 1,01,368లక్షల కిలోలు ఉండగా, సూర్యాపేట జిల్లాలో సుమారు 60వేలు, యాదాద్రి జిల్లాలో 40వేల కిలోల సన్నబియ్యం పాఠశాలల్లో మగ్గుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాల విద్యార్థులకు, లేదంటే రేషన్‌ దుకాణాల ద్వారా పేదలకు పంచినా ఉపయోగమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. సన్న బియ్యానికి కనీసంగా కిలోకు రూ.35 వ్యయం వేసుకున్నా, ఉమ్మడి జిల్లాలో బడి బియ్యం విలువ రూ.70లక్షలుగా ఉంది.


ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షిస్తున్నారు : భిక్షపతి, డీఈవో

ఏ పాఠశాలలో ఎంత బియ్యం ఉన్నదనే సమాచారం సేకరించాం. ఉన్న బియ్యాన్ని సంరక్షించాల్సిందిగా ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశాం. వారు వారానికి ఒక సారి పాఠశాలకు వెళ్లి బియ్యం సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. 


ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా..అలుగుబెల్లి నర్సిరెడ్డి, టీచర్స్‌ ఎమ్మెల్సీ

ఉమ్మడి జిల్లాలో 2వేల క్వింటాళ్ల వరక బియ్యం నిల్వలు ఉన్నాయి. వాటిని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రెండు కిలోల చొప్పున పంపిణీ చేయాలని, లేదా ఇతర రకాలుగా అయినా ఉపయోగించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ దృష్టికి తీసుకెళతా. ప్రభుత్వానికి లేఖ కూడా రాస్తా. నాలుగు నెలలు ప్రధానోపాధ్యాయులు ఎంత కష్టపడ్డా ఎలుకలు, పురుగుల నుంచి బియ్యాన్ని రక్షించడం సాధ్యం కాదు.


Updated Date - 2020-08-03T10:57:27+05:30 IST