రాజానగరం, జనవరి 28: మండలంలో ఇప్పటి వరకు 476 మంది బడి బయట పిల్లలను గుర్తించి తిరిగి పాఠశాలలల్లో చేర్పించామని ఎంఈవో లజపతిరాయ్ తెలిపారు. మండలంలోని సూర్యారావుపేటలో జరుగుతున్న ఓఎస్సీ సర్వేను ఎంఈవో లపపతిరాయ్, సర్పంచ్ కుందేటి ప్రసాద్ శుక్రవారం పరిశీలించారు. దీనిలో భాగంగా సూర్యారావుపేటలో మధ్యలో చదువు ఆపేసి బయట తిరుగుతున్న అల్లూరి సురేష్ (5వ తరగతి), రాయి శ్రీను(8వ తరగతి)విద్యార్ధుల తల్లిదండ్రులతో మాట్లాడి ఇద్దరిని సూర్యారావుపేట, రాజానగరం పాఠశాలల్లో చేర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రసాద్ మాట్లాడుతూ 6నుంచి 18 ఏళ్లు నిండిన పిల్లలంతా మధ్యలో బడి మానేయకుండా ఉన్నత విద్యనభ్యసించేలా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలన్నారు. విద్యారంగానికి ప్రభుత్వం ఎన్నో సదుపాయాలు కల్పిస్తోందన్నారు. ఈ సర్వేలో పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్ సంధ, సీఆర్పీలు రామకృష్ణ, పూసలరావు తదితరులు పాల్గొన్నారు.