విలీనం వద్దు

ABN , First Publish Date - 2022-01-23T05:50:02+05:30 IST

తమ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 3, 4, 5 తరగతులను పాత తుంగపాడు ఉన్నత పాఠశాలలో విలీనం చేయడాన్ని నిలుపుదల చేయాలని కొత్త తుంగపాడు గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్‌ సి.హరికిరణ్‌కు విజ్ఞప్తి చేశారు. కొత్తతుంగపాడు వచ్చిన కలెక్టర్‌కు ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు.

విలీనం వద్దు
కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తున్న దృశ్యం

  • ఉన్నత పాఠశాలలో ‘ప్రాథమిక’ తరగతులను  కలిపితే పిల్లలకు ఇబ్బందులు 
  • కలెక్టర్‌కు వినతి

దివాన్‌చెరువు. జనవరి 22: తమ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 3, 4, 5 తరగతులను  పాత తుంగపాడు  ఉన్నత పాఠశాలలో విలీనం చేయడాన్ని నిలుపుదల చేయాలని కొత్త తుంగపాడు గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్‌ సి.హరికిరణ్‌కు విజ్ఞప్తి చేశారు. కొత్తతుంగపాడు వచ్చిన కలెక్టర్‌కు ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానంలో భాగంగా 3 కిమీ పరిధిలోని ప్రాథమిక పాఠశాల మూడు, నాలుగు, ఐదు తరగతులను సమీప హైస్కూల్‌కు విలీనం చేసే నిమిత్తం విద్యాశాఖాధికారులు ప్రణాళికలు తయారు చేశారన్నారు. తమ గ్రామం నుంచి  పాత తుంగపాడు జడ్పీ ఉన్నత పాఠశాల 2.5 కిమీ పైబడి ఉంటుందన్నారు. అయితే తమ గ్రామం నుంచి 3వ తరగతి విద్యార్థులు వెళ్లేందుకు రవాణా సౌకర్యం అనుకూలంగా లేదని దీని వల్ల పిల్లలకు ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు రోజువారీ కూలీ పనులు చేసుకుంటారని, పిల్లలను బడికి తీసుకెళ్లాలంటే వారి ఉపాధికి ఆటంకం కలుగుతుందన్నారు.   సర్పంచ్‌ కోలపాటి వెంకన్న, ఎంపీటీసీ ఆర్‌.లక్ష్మీపతి, ఎస్‌ఎంసీ చైర్మన్‌ ఆర్‌.శివరామకృష్ణ, సభ్యులు తదితరులు వినతిపత్రంపై సంతకాలు చేశారు. అలాగే తమ గ్రామంలోని డ్రైనేజీ అవుట్‌లెట్‌ సమస్య పరిష్కరించాలని కోరుతూ భూపాలపట్నం సర్పంచ్‌ జి.అన్నపూర్ణ. గ్రామస్థులు ఎం.సత్తిబాబు, వి.రాంబాబు జిల్లా కలెక్టర్‌ను కోరారు. డ్రైనేజీ, చెరువునీరు పారుదల పోవు మార్గం పూర్వం నుంచి ఉందన్నారు. అయితే ఆ మార్గాన్ని తోరాటి శ్రీను అనే వ్యక్తి అడ్డుకట్ట వేసి మురుగునీరు పోయేందుకు మార్గం లేకుండా చేశారని ఆరోపించారు. దీనివల్ల ఏర్పడుతున్న సమస్యలను వివరించారు. ఈ సమస్యను గత 8 నెలలుగా  ఎంపీడీవో, ఈవోపీఆర్డీ, డీఎల్పీవో, సబ్‌కలెక్టర్‌ల దృష్టికి  తీసుకువెళ్లినా పరిష్కా రం కాలేదన్నారు.  

అమీనాబాద్‌లో ఆందోళన

అమీనబాద్‌ (కొత్తపల్లి), జనవరి 22: ప్రాథమిక పాఠశాలలో 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ అమీనాబాద్‌ వాడబలిజపేట ఎంపీపీ ఎలిమెంటరీ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు సుమారు 100 మంది శుక్రవారం ఆందోళన చేపట్టారు. మత్స్యకారుడు చొక్కా బుజ్జి మాట్లాడుతూ ప్రభుత్వం నూతన విద్యావిధానం పేరుతో ప్రాథమిక పాఠశాలలో 3,4,5 తరగతులను ఉప్పాడ కొత్తపల్లి ఉన్నత పాఠశాలలలో విలీనం చేయడం దారుణమన్నారు. అమీనాబాద్‌ నుంచి కొత్తపల్లి ఉన్నత పాఠశాలకు సుమారు కిలోమీటరున్నర దూరం ఉంటుందన్నారు. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ఉప్పాడ రోడ్డులో చిన్నపిల్లలు ఉన్నత పాఠశాలకు నడిచి వెళ్లిరావడం కష్టసాధ్యమన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని, లేకపోతే తీవ్రస్థాయిలో ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయునికి తల్లిదండ్రులు వినతిపత్రం సమర్పించారు. బొందు జగన్నాథం, చొక్కా లక్ష్మి, యజ్జల సత్యవేణి పాల్గొన్నారు.

Updated Date - 2022-01-23T05:50:02+05:30 IST