శిథిలావస్థలో పాఠశాల భవనం

ABN , First Publish Date - 2021-02-27T06:10:28+05:30 IST

మండలంలోని చినపవని ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. ఏడేళ్ల క్రితమే దెబ్బతిన్న ఈ భవనంలో నేటికీ తరగతులు నిర్వహించడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

శిథిలావస్థలో పాఠశాల భవనం
శిథిలావస్థకు చేరిన భవనం

లింగసముద్రం, ఫిబ్రవరి 26 : మండలంలోని చినపవని ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. ఏడేళ్ల క్రితమే దెబ్బతిన్న ఈ భవనంలో నేటికీ తరగతులు నిర్వహించడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 

పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు, 25 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడి విద్యార్థులకు ఈ శిథిలమైన భవనంలోనే విద్యాబోధన జరుగుతోంది. ఈ పాఠశాల గోడలు రెండు వైపులా నెర్రెలిచ్చి, స్లాబుపై కప్పు ఇనుప చువ్వలు బయటపడ్డాయి. తరచూ పైకప్పు పెచ్చులు ఊడి కిందపడుతున్నాయి. వరండాలోని పిల్లర్లు కూడా దెబ్బతిన్నాయి. ప్రహరి కూడా లేదు. దీంతో  వర్షాలు కురిసిన ప్రతిసారి ఇక్కడు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాలను వీడుతున్నారు.  విద్యార్ధులను కాలనీలోని కమ్యూనిటీ హాలులోకి పంపి అక్కడే బోధన చేస్తున్నారు. కొన్నాళ్లయితే చెట్ల కింద విద్యార్ధులను కూర్చోబెట్టి చదువులు చెప్పారు.  సొంత భవనం లేని ఈ పాఠశాల అభివృద్ధికి ‘నాడు-నేడు’లో కూడా చోటు దక్కలేదు. అంతేకాకుండా ఈ పాఠశాల ఆవరణలో కాలనీకి చెందిన ఒకరు గేదెలు కట్టేస్తున్నారు.దీంతో గేదెల మూత్రము, పేడతో విద్యార్ధులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. 

ఆ విషయమై ఎంఈవో నాగేంద్రవదన్‌ను వివరణ కోరగా, ఆ పాఠశాల శిధిలస్థితికి చేరిన విషయం వాస్తవమేనన్నారు. ప్రత్యామ్నాయం లేక అక్కడే తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. అయితే నాడు-నేడు కింద పంచాయతీలోని ఒక పాఠశాల మాత్రమే అభివృద్ధి చేశారని చెప్పారు. ఇక్కడ మరో పాఠశాల ఏర్పాటుకు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి దృష్టికి తీసుకెళతామన్నారు. అలాగే పాఠశాల ఆవరణలో గేదెలను కట్టేయకుండా సర్పంచ్‌, విద్యా కమిటీ ద్వారా చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - 2021-02-27T06:10:28+05:30 IST