బడిబాట.. ఫీజుల వేట..!

ABN , First Publish Date - 2021-01-18T06:54:40+05:30 IST

సుదీర్ఘ విరామం తర్వాత ప్రభుత్వ, పాఠశాలలు తెరుచుకోనున్నాయి.

బడిబాట.. ఫీజుల వేట..!

ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానున్న పాఠశాలలు

ఏర్పాట్లు చేస్తున్న విద్యాసంస్థలు

వసూళ్లపైనే ప్రైవేట్‌ నిర్వాహకుల దృష్టి

తల్లిదండ్రులకు రోజూ ఫోన్లు, మెసేజ్‌లు

జీవో 46కు విరుద్ధంగా ఇప్పటికే వసూలు

హైదరాబాద్‌ సిటీ, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): సుదీర్ఘ విరామం తర్వాత ప్రభుత్వ, పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఇప్పటికే ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఫిబ్రవరి 1 నుంచి 9, 10  తరగతుల విద్యార్థులకు తరగతి గదులలో పాఠాలు చెప్పనున్నాయి. పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రైవేటు యాజమాన్యాలు ఫీజుల వసూళ్లపై మళ్లీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కరోనాతో గతేడాది  నష్టాలను మూట గట్టుకున్న స్కూళ్లు.. ఇప్పుడు ఒకేసారి ఫీజుల మొత్తాన్ని రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తోన్నట్లు తెలుస్తోంది. గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో 5,526 ప్రైవేట్‌, 2,249 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. సుమారు 16 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులే అధికం.  9, 10 విద్యార్థులతోపాటు 1 నుంచి 8 వరకు చదువుతున్న పిల్లల మొత్తం ఫీజును ఫిబ్రవరి 1లోపే చెల్లించాలని పాఠశాలల నిర్వాహకులు తల్లిదండ్రులకు ఫోన్లు చేయడంతోపాటు రోజూ మేసేజ్‌లు పంపుతున్నారు. 

నో డ్యూస్‌తోనే బడికి..  

ఆన్‌లైన్‌ క్లాస్‌ల నిర్వహణలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులు కొంతకాలంగా నెలవారీ ఫీజులు చెల్లిస్తూ వస్తున్నారు. దాదాపు 11 నెలల విరామం తర్వాత తరగతి గదిలో బోధనలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పెండింగ్‌ ఫీజులతోపాటు వార్షిక పరీక్షలకు సంబంధించిన ఫీజులు సైతం చెల్లించాలంటూ కొన్ని ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు తల్లిందండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ఇంటర్నేషనల్‌, కార్పొరేట్‌ స్కూళ్లు జీవో 46కు విరుద్ధంగా పాఠశాల, లైబ్రరీ, బస్సు ఫీజులు వసూలు చేసినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే సగం వరకు ఫీజు చెల్లించిన వారు పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి నో డ్యూస్‌తో హాజరుకావాలని తల్లిదండ్రుల ఫోన్లకు పాఠశాలల నిర్వాహకులు మెసేజ్‌లు పంపుతున్నారు. ప్రధానంగా 9, 10 తరగతుల విద్యార్థులు స్కూల్‌ కు వచ్చే సమయానికి పూర్తిస్థాయిలో ఫీజులు చెల్లించాలంటూ కొంతమంది నిర్వాహకులు డెడ్‌లైన్‌ పెట్టడంతో తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నారు. మరికొన్ని  పాఠశాలల యాజమాన్యాలు మాత్రం ఫీజులపై ఫోకస్‌ చేయకుండా పిల్లలను బడికి పంపించాలంటూ మెసేజ్‌లు పెడుతున్నాయి. 

శానిటేషన్‌ ఖర్చులూ.. 

కొవిడ్‌ నిబంధనల మేరకు పాఠశాలలు పునఃప్రారంభం అవుతుండటంతో తరగతి గదులు, వాష్‌రూంలతో పాటు పాఠశాల ఆవరణ రోజూ శానిటైజ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో శానిటైజేషన్‌ ఖర్చులతోపాటు ఇతర ఖర్చులనూ విద్యార్థుల నుంచే వసూలు చేయాలని కొన్ని పాఠశాలల యాజమాన్యాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 11 నెలలుగా పాఠశాలలు మూత పడటంతో తక్కువ మొత్తంలో ఫీజులు వసూలు అవుతున్నాయి. ఈ నేపథ్యం లో అదనపు ఖర్చులను విద్యార్థుల నుంచే వసూలు చేయాలని పలు పాఠశాలల యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఫీజులు వసూ లు కాకపోవడంతో రెండు, మూడు నెలలుగా టీచర్లకు వేతనాలు కూడా చెల్లించలేదని పలువురు నిర్వాహకులు చెబుతున్నారు. 9, 10 తరగతుల విద్యార్థుల సంఖ్య ప్రైవేట్‌ పాఠశాలల్లో తక్కువ సంఖ్యలో ఉండడడంతో నిర్వాహణ కొంత సులభంగానే ఉంటుందని మరికొందరు పేర్కొంటున్నారు. 

మార్గదర్శకాలు అమలయ్యేనా..

విద్యాసంస్థలు ప్రారంభిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ప్రభుత్వం గత నవంబర్‌లో మార్గదర్శకాలను విడుదల చేసింది. పాఠశాలలోని ఫర్నీచర్‌, వస్తువులు, స్టేషనరీ, నీటిట్యాంకులు, క్యాం టీన్‌, మరుగుదొడ్లు, ల్యాబొరేటరీ, లైబ్రరీ ఇలా అన్నింటినీ రసాయనాలతో శుభ్రం చేయాలని సూచించింది. విద్యార్థుల శరీర ఉష్ణోగ్రతలు పరిశీలించేందుకు డిజిటల్‌ థర్మామీటర్‌ అందుబాటులో ఉంచుకోవాలని చెప్పింది. తరగతి గదిలో విద్యార్థుల మధ్య కనీసం ఆరు అడుగుల భౌతిక దూరం ఉండాలని, విద్యార్థులు కూర్చునే ప్రాంతాలను ముందే మార్క్‌ (గుర్తులు వేయడం) చేయాలని, ఒక బల్లకు ఒకే విద్యార్థి మాత్రమే కూర్చొవాలని పేర్కొంది. ఈ మార్గదర్శకాలు ప్రతి ప్రైవేట్‌ పాఠశాలలో అమలు కొంత కష్టసాధ్యమేనని పలువురు నిర్వాహకులు చెబుతున్నారు. రోజూ జిల్లాస్థాయి విద్యాధికారులు పరిశీలిస్తే తప్పా.. నిబంధనలు అమలయ్యే పరిస్థితులు కనిపించడం లేదని తల్లిదండ్రులు అంటున్నారు. 

Updated Date - 2021-01-18T06:54:40+05:30 IST