వికాస్ దూబే ఎన్‌కౌంటర్ కేసు... లాయర్‌కి సుప్రీం చీవాట్లు!

ABN , First Publish Date - 2020-08-12T03:03:16+05:30 IST

యూపీ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్ కేసు విచారణ కోసం ఏర్పాటైన జ్యుడిషియల్ కమిషన్‌‌కు వ్యతిరేకంగా..

వికాస్ దూబే ఎన్‌కౌంటర్ కేసు... లాయర్‌కి సుప్రీం చీవాట్లు!

న్యూఢిల్లీ: యూపీ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌పై విచారణ కోసం ఏర్పాటైన జ్యుడిషియల్ కమిషన్‌‌కు వ్యతిరేకంగా పిటిషన్ వేసిన న్యాయవాది ఘన్‌శ్యాం ఉపాధ్యాయ్‌కు ఇవాళ సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. ఈ కమిషన్‌కు నేతృత్వం వహిస్తున్న రిటైర్డ్ జడ్జి బీఎస్ చౌహాన్‌‌కు ‘‘బీజేపీలో బంధువులు ఉన్నారనీ’’.. దీనివల్ల విచారణ ‘‘నిష్పక్షపాతంగా జరగదని’’ సదరు న్యాయవాది ఆరోపించడాన్ని ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది. ‘‘విచారణ నిష్పక్షపాతంగా ఎందుకు జరగదు? న్యాయమూర్తుల్లో చాలామంది ఎంపీల కుమారులు ఉన్నారు. చాలామంది జడ్జిలకు పార్లమెంటులో బంధువులు ఉన్నారు. అయినంత మాత్రాన ఆ న్యాయమూర్తులంతా మంచోళ్లు కాదా? అలాంటి సంబంధాలు ఏమైనా చట్ట వ్యతిరేకమా?’’ అని సుప్రీంకోర్టు సీజే జస్టిస్ ఎస్ఏ బాబ్డే సదరు న్యాయవాదిని నిలదీశారు.


కాగా జస్టిస్ చౌహాన్‌పై ఉపాధ్యాయ్ చేసిన ఆరోపణలు ‘‘అత్యంత దారుణ’’మని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి నివేదించారు. దీనిపై ఉపాధ్యాయ్ స్పందిస్తూ... ‘‘ఉత్తర ప్రదేశ్ ఇప్పుడు ఎన్‌కౌంటర్ల రాష్ట్రంగా మారిపోయింది. వాళ్లు న్యాయ వ్యవస్థను మొత్తం తలకిందులు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కూడా రాజీవ్ పాండే అనే వ్యక్తిని ఎన్‌కౌంటర్ చేశారు..’’ అని పేర్కొన్నారు. అయితే న్యాయవాది చెబుతున్న విషయాలకు ఏమాత్రం పొంతన లేదంటూ సుప్రీం సీజే మండిపడ్డారు. ‘‘ప్రతి రాష్ట్రంలో నిత్యం వేలాది నేరాలు జరుగుతుంటాయి. వాటన్నిటితో ఈ కమిషన్‌కి సంబంధం ఏమిటి’’ అని సీజే ప్రశ్నించారు.  ఈ వ్యవహారంపై ఉపాధ్యాయ్ ఇంకా ఏమైనా సూచనలు ఇవ్వదల్చుకుంటే ఇవ్వొచ్చంటూ తీర్పును వాయిదా వేశారు. గత నెలలో కాన్పూర్‌లో ఎనిమిది మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే... సరిగ్గా వారం రోజులకు అదే కాన్పూర్‌లో ఎన్‌కౌంటర్‌కు గురైన సంగతి తెలిసిందే.  

Updated Date - 2020-08-12T03:03:16+05:30 IST