Abn logo
Jul 7 2021 @ 08:30AM

40 మందిని కాపాడి.. ప్రాణాలొదిలి..!

విధి నిర్వహణలోనే గుండె ఆగింది..

బస్సు నడుపుతుండగా ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు

చికిత్స పొందుతూ మృతి


దాచేపల్లి: విధి నిర్వహణలో ఉండగానే గుండె పోటు వచ్చి ఆర్టీసీ డ్రైవర్‌ మృతి చెందిన ఘటన మంగళవారం దాచేపల్లి నగర పంచాయతీ నారాయణపురం వద్ద జరిగింది. సేకరించిన వివరాలు ఇలా ఉన్నాయి.. తెనాలి మండలం వేజెండ్ల గ్రామానికి చెందిన షేక్‌ సుభాని(54) పిడుగురాళ్ల డిపోలో 20 ఏళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం పల్లెవెలుగు బస్సు నడుపుతూ మాచర్ల నుంచి పిడుగురాళ్లకు వస్తుండగా నడికుడి సమీపంలోకి రాగా నే ఛాతిలో నొప్పి వచ్చింది. నారాయణపురంలోని ఆర్‌అండ్‌బి బంగ్లా వద్ద బస్సు ఆపి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రథమ చికిత్స పొందాడు. అక్కడి నుంచి 108లో పిడుగురాళ్లకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో తుదిశ్వాస విడిచాడు. బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. సుభాని మృతిపై నేషనల్‌ మజ్దూర్‌యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు అప్పయ్య, పిడుగురాళ్ల డిపో  అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, డివిజన్‌ కమిటీ సభ్యులు డీవీ రావు తదితరులు సంతాపం తెలిపారు.