ప్రపంచానికి ఆపద వచ్చినా ఈ బ్యాంకులు మాత్రం మారవా?

ABN , First Publish Date - 2020-04-22T00:13:56+05:30 IST

అవును. కఠోరమైన బ్యాంకులు మారవు.. ఇఎమ్‌ఐలు కట్‌ చేయక మానవు... అదే బ్యాంక్‌ మారకఠోరియం... మారటోరియం తీసుకోకపోతేనే నయం అనిపించడం..

ప్రపంచానికి ఆపద వచ్చినా ఈ బ్యాంకులు మాత్రం మారవా?

అవును. కఠోరమైన బ్యాంకులు మారవు.. ఇఎమ్‌ఐలు కట్‌ చేయక మానవు... అదే బ్యాంక్‌ మారకఠోరియం... మారటోరియం తీసుకోకపోతేనే నయం అనిపించడం.. మెసేజ్‌లతో నరకం సృష్టించడం.. ఇదే కొన్ని బ్యాంకుల పాలసీ! దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడట. ఆర్బీఐ వరం ఇచ్చినా కొన్ని బ్యాంకుల పాలసీలు మాత్రం జనానికి శాపాలుగా మారాయి. ప్రపంచానికే ఆపద వచ్చినా వాటికి పైసా మీదే ధ్యాస. మారటోరియం ఉన్నా ఇఎమ్‌ఐ కటింగ్స్‌... మారటోరియం తీసుకుంటే మితిమీరిన మెసేజ్‌లు... అవునో కాదో మీ అనుభవంలోకి వస్తే చెప్పండి. సామాన్యుడి ఆపదని కమర్షియల్‌గా ఉపయోగించుకునే కఠోరమైన బ్యాంకుల పాలసీల్ని ఎండగట్టే ఈ సెటైర్‌ చూడండి. వీలైనంతమందికి షేర్‌ చేయండి.


బ్యాంక్‌ మారక విద్య


( SN లోగో సంపన్నుడికి సై .. సామాన్యుడికి నై .. ట్యాగ్ లైన్ తో బ్యాంక్ లోగో . బ్యాంక్ లోపల మేనేజర్ సీటు ముందు ఒక సామాన్యుడు, అజయ్‌ కూల్యా అనే ఒక ధనవంతుడు .. పక్కన బ్యాంక్ అసిస్టెంట్ )


సామాన్యుడు : ( మేనేజర్‌తో ) సార్‌. నా ఇఎమ్‌ఐ ఎమౌంట్‌ కట్‌ అయిపోయిందండీ.

మేనేజర్ : ఓకే.. ( పక్కనున్న అజయ్‌ కూల్యాతో ) సారీ సార్‌. మీరు కాస్త ఆగండి. ఇది పెట్టీ ఇస్యూ. మీ పనే మాకు ముఖ్యం. వీణ్ణి పంపించేసి... ( సామా.తో) ఏంటండీ ఏంటి మీ గోల?


సామాన్యుడు : అదేనండీ. నా ఇఎమ్‌ఐ ఎమౌంట్‌ ...

మేనేజర్ : ( చిరాగ్గా ) కట్‌ అవుతుందండీ. అది ఆటోమేటిక్‌.


సామాన్యుడు : అదేంటండీ? కరోనా టైమ్‌. అసలే ఫుల్‌ సేలరీ పడలేదని కంగారుపడుతుంటే... ఆ పడ్డది కాస్తా … పడీ పడగానే అకౌంట్లోంచి మీరు కట్‌ చేసేస్తే ఎలాగ?

అసిస్టెంట్‌ : కస్టమర్‌ అకౌంట్లో డబ్బులు చూస్తే చాలు.. కట్‌ చేసేయాలన్నది మా బ్యాంక్‌ పాలసీ ... అసలు సేలరీ ఎకౌంటున్న బ్యాంకులో లోన్‌ తీసుకోవడం మీదే తప్పు.( మేనేజర్‌తో ) ఏం సార్‌?


సామాన్యుడు : ( ఎక్స్ ప్రెషన్ )

సామాన్యుడు : ఆర్బీఐ వాళ్లు పాపం మూడు నెలల మారటోరియం ఆప్షనిచ్చారు. మీరు మాయ చేసి రెండు నెలలకే కుదించారు. అదయినా ఆటోమేటిగ్గా అప్లై చేయచ్చు కదా?

మేనేజర్‌ : అందరికీ అన్నది ఆర్బీఐ పాలసీ... అడుక్కున్నవాళ్లకే ఇవ్వాలన్నది మా పాలసీ. సామాన్యుడికి మేం ఎప్పుడూ హెల్ప్‌ చెయ్యకూడదండీ. మా బ్యాంక్‌ ట్యాగ్‌లైన్‌ చూడలేదా? సంపన్నుడికి సై .. సామాన్యుడికి నై ..


సామాన్యుడు : అదేంటండీ? ఇలాంటి క్లిష్టసమయంలో ... అందులోనూ ఆర్బీఐ చెప్పినా కూడా ... ఇంతేనా?

అసిస్టెంట్‌ : ఆర్బీఐయే కాదండి, సాక్షాత్తూ పీఎంగారొచ్చి చెప్పినా మా బ్యాంక్‌ వినదు. మాటల్లో తప్ప... సేవ అన్నది మా డిక్షనరీలో ఉండదు.


సామాన్యుడు : అదేంటండీ?

మేనేజర్ : అవునండీ. ఫ్రాంక్‌గా చెబుతున్నాం. మాకు సామాన్యుడి డబ్బుతో అవసరం... ఆ డబ్బుతో సంపన్నుణ్ణి ఆదుకుంటాం. అంతేగానీ... కష్టాల్లో ఉన్నారు కదా అని ఇఎమ్‌ఐ కట్‌ చేయకుండా ఊరుకోడానికి ఇదేం ధర్మ సత్రం కాదు. అంతగా కావాలంటే ఈ అజయ్‌ కూల్యా గారిలాగ కోట్లలో అప్పు తీసుకోండి. ఎగ్గొట్టుకోండి. హ్యాపీగా ఇస్తాం.

అసిస్టెంట్‌ : ఇంకా అర్థం కాలేదా మీకు? అవసరంలో ఉన్నవాడు అడుక్కోవాలి. అడ్డదారిలో పట్టుకుపోయేవాడు బాగుపడాలి. అదేనండి మా బ్యాంక్‌ పాలసీ... ( మేనేజర్‌తో ) ఏం సార్‌?


మేనేజర్ : ( ఎక్స్‌ప్రెషన్‌ )

మేనేజర్ : అసలు మారటోరియంకి మీరు అప్లై ఎందుకు చేయలేదు?

సామాన్యుడు : ట్రై చేశానండీ. కానీ మీ వెబ్‌సైట్లో అప్లికేషన్‌ పనిచేయలేదు.


మేనేజర్ : అది పనిచేయదండీ. మారటోరియం అప్లికేషన్‌ పనిచేయకూడదన్నది మా బ్యాంక్‌ పాలసీ.

సామాన్యుడు : సబ్‌మిట్‌ బటన్‌ నొక్కితే క్లిక్‌ అవ్వట్లేదు.


మేనేజర్ : చెప్పా కదండీ? పాలసీ అని...

సామాన్యుడు : మరేం చేయాలండీ?


మేనేజర్ : అప్లికేషన్‌ పని చేయట్లేదని కంప్లయింట్‌ ఇవ్వచ్చు.

సామాన్యుడు : కాల్‌ చేశానండీ. కానీ కస్టమర్‌ కేర్లో ఎవరూ ఎత్తలేదు.


మేనేజర్ : కరోనా టైమ్‌ కదండీ? ఎవరూ ఎత్తరు. అది మా పాలసీ.

సామాన్యుడు : మెయిల్‌ పెట్టినా రిప్లై లేదు.


మేనేజర్ : కరోనా టైమ్‌ కదండీ. చాలామంది వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నారు. వాళ్లకి మెయిల్‌ యాక్సెస్‌ ఇవ్వం.

సామాన్యుడు : అది కూడా పాలసీయేనా? సరే. ఇఎమ్‌ఐ కట్‌ చేయద్దని కాగితం మీద రాసిస్తా.


మేనేజర్ : కుదరదండీ. మా బ్యాంక్‌ టెక్నికల్లీ ఎడ్వాన్స్‌డ్‌. పేపర్‌ యూజ్‌ చెయ్యం. పర్యావరణానికి ఇబ్బంది కలిగించం.

సామాన్యుడు : బావుంది. ఆదర్శాలకి తక్కువేం లేదు. ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. కానీ అప్లికేషన్‌ పనిచేయదు. కాల్స్‌ ఎత్తరు. మెయిల్స్‌కి రిప్లై ఉండదు. అసలేంటండి మీ ఉద్దేశం?

అసిస్టెంట్‌ : అసలు రహస్యం నన్ను చెప్పమంటారా? మీరు అప్లై చేసుకున్నా ... మీ ఇఎమ్‌ఐ మాత్రం కట్‌ చేసే తీరుతుంది మా బ్యాంక్‌. అంతగా పేచీ పెడితే.. వడ్డీ మీద వడ్డీ వేసి రేపు మీ నడ్డి విరుస్తుంది తప్ప... మీకు మాత్రం రిలాక్సేషనేం ఉండదు.


మేనేజర్ : అవునండీ. మీరేదో మిస్‌ అయ్యానని వర్రీ అవ్వద్దు. మారటోరియం ఆపర్చునిటీ తీసుకోకపోవడమే బెటర్‌.

సామాన్యుడు : అదేంటండీ?


మేనేజర్ : అవునండీ. మేం ఒకవేళ మీకు మారటోరియం అవకాశం ఇస్తే... మీరు బిల్లు కట్టలేదన్న విషయాన్ని ప్రతీక్షణం గుర్తు చేస్తూ ఉంటాం. మెసెజెసూ మెయిల్సూ పంపిస్తూనే ఉంటాం. బిల్లులు పెంచేస్తూ బీపీ తెప్పిస్తాం. అంతకంటే ఆ ఆప్షన్‌ తీసుకోకపోవడమే బెటర్‌ కదా?

అసిస్టెంట్‌ : అవును సార్‌. సామాన్యుడికి వరం ఇచ్చిన ఆర్బీఐ మీద ఉన్న కసి.. ఆ సామాన్యుడి మీదే చూపించాలన్నది మా బ్యాంక్‌ పాలసీ. పాపం మా ఫ్రెండొకడు ఇలాగే ఆర్బీఐ చెప్పింది కదా అని... మారటోరియం ఆప్షన్‌ తీసుకున్నాడు... ఆ తరవాత ఇంత కట్టాలి అంత కట్టాలి అని గుర్తు చేస్తూ రోజూ బ్యాంక్‌ పంపిన ఎస్‌ఎమ్‌ఎస్‌లు చదివి గుండెపోటు తెచ్చుకున్నాడు.

మేనేజర్ : అవునండీ. కస్టమర్‌ మారటోరియం తీసుకుంటే... ఎందుకు తీసుకున్నాన్రా బాబూ అని పశ్చాత్తాపపడేవరకూ అతనికి నరకం చూపించాలన్నది మా బ్యాంక్‌ పాలసీ!


సామాన్యుడు : ( ఎక్స్‌ప్రెషన్‌ )

సామాన్యుడు : ఛీ! మీరూ మీ బ్యాంక్‌! ఇంతమందికి ఇంత విపత్తు వచ్చినప్పుడు కూడా ఇదేనా మీ పద్ధతి?

మేనేజర్ : విపత్తులూ గిపత్తులూ మీకండీ.. మా బ్యాంక్‌ మాత్రం అలా అనుకోదు. మేం చాలా ప్రొఫెషనల్‌.


సామాన్యుడు : ఏంటండీ ప్రొఫెషనల్‌? డబ్బొక్కటే ముఖ్యమా? కాస్తయినా సర్వీస్‌ యాంగిల్‌ ఉండదా?

అసిస్టెంట్‌ : ప్రపంచం మొత్తం మునిగిపోయినా మా బ్యాంక్‌కి అక్కర్లేదుసార్‌. ఏదో మాటలకి సర్వీస్‌ సర్వీస్‌ అంటుంది గానీ... అసలు కస్టమర్ల కష్టాలన్నీ మాకు కమర్షియల్‌ అవకాశాలే! వీలైతే మరింత లాక్కుంటాం.


సామాన్యుడు : ఇదేం దారుణమండీ? అసలు మీ బ్యాంక్‌ ఎదగడానికి మాలాంటి కస్టమర్లు కారణం కాదా?

మేనేజర్ : ఛీ.ఛీ. అలాంటి చీప్‌ సెంటిమెంట్లన్నీ మేం పట్టించుకోమండీ. కస్టమర్లు కష్టాలతో గగ్గోలు పెట్టినా వి గో స్ట్రయిట్‌ కమర్షియల్లీ!


అసిస్టెంట్‌ : అదండీ మా ప్రొఫెషనలిజం! ఎవడెలా పోయినా మేం ఇలాగే ఉంటాం.

మేనేజర్ : అవునండీ. మా బ్యాంక్‌కి ఎకనమిక్సే తప్ప ఎథిక్స్‌ ఉండవ్‌. ప్లీజ్‌! అర్థం చేసుకోండి. త్వరలో మా బ్యాంక్‌ ట్యాగ్‌ కూడా మారుస్తున్నాం. కస్టమర్‌ ఆపద... మనకి కమర్షియల్‌ సంపద... ఎలా ఉంది?


సామాన్యుడు : ( ఎక్స్‌ప్రెషన్‌ )


వీడియో ఇక్కడ చూడండి :




Updated Date - 2020-04-22T00:13:56+05:30 IST