టీటీవీ దినకరన్‌కు శశికళ సలహా?

ABN , First Publish Date - 2021-03-04T18:19:45+05:30 IST

భారతీయ జనతా పార్టీకి అధికార అన్నాడీఎంకేలా తలొగ్గకుండా

టీటీవీ దినకరన్‌కు శశికళ సలహా?

చెన్నై/ప్యారీస్‌ : భారతీయ జనతా పార్టీకి అధికార అన్నాడీఎంకేలా తలొగ్గకుండా  ఒంటరిగా పోటీచేయాలని అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌కు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ సలహా ఇచ్చినట్టు సమాచారం. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని నియోజకవర్గాల కేటాయింపుపై బీజేపీ పెద్దలతో అన్నాడీఎంకే చర్చలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ 60 సీట్లు కోరగా, వాటిలో 20 నియోజకవర్గాల్లో శశికళవర్గం పోటీచేసేందుకు నిర్ణయించిన విషయం తెలిసి అన్నాడీఎంకే నేతలు ఆందోళనకు గురైనట్టు తెలిసింది. ఇదిలా ఉండగా, గత పార్లమెంటు ఎన్నికల్లో తమిళనాడులోని 52 శాసనసభ నియోజకవర్గాల్లో ఏఎంఎంకే ఓట్ల శాతం మెరుగ్గా ఉందని, ఆ ఓటు బ్యాంక్‌ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగకరంగా ఉంటుందని కేంద్ర మంత్రి అమిత్‌షా ఇటీవల ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంతో సమావేశమైన సమయంలో తెలిపారని, శశికళ వర్గానికి అన్నాడీఎంకే-బీజేపీ కూటమిలో చేర్చుకోకుంటే ఓటమి పాలయ్యే అవకాశముందని అమిత్‌షా చెప్పినట్టు సమాచారం.


బీజేపీ తనకు అనుకూలంగా మాట్లాడుతుండడంపై స్పందించిన టీటీవీ దినకరన్‌, ఆ పార్టీకి మద్దతుగా నిలిచారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ వ్యవహారంపై  శశికళ తన సోదరుడు దివాకరన్‌, ఇళవరసి, కృష్ణప్రియ, ఇళవరసి సోదరుడు వడగనాథన్‌, కన్నదాసన్‌లతో రహస్యంగా చర్చించారని, ఖర్చు గురించి ఆలోచించకుండా 10 స్థానాల్లోనైనా గెలిచేలా ఒంటరిగా పోటీచేయాలని దినకరన్‌కు ఆమె సలహా ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం.

Updated Date - 2021-03-04T18:19:45+05:30 IST