సర్కారు వారి భూముల్లో పాగా

ABN , First Publish Date - 2022-05-15T06:26:02+05:30 IST

జిల్లాలో ఆక్రమణదారులకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. ఖాళీగా ప్రభుత్వ జాగా కనిపిస్తే చాలు స్థానిక నేతల దన్నుతో ఆక్రమించి షెడ్లు వేసేస్తున్నారు.

సర్కారు వారి భూముల్లో పాగా
గొలగాంలో ప్రభుత్వ గెడ్డ భూమిలో షెడ్డు వేసిన దృశ్యం

- ఆక్రమించి విక్రయించేస్తున్న కబ్జాదారులు

- ఖాళీగా ప్రభుత్వ జాగా కనిపిస్తే అంతే సంగతులు

- స్థానిక నేతల సహకారంతో చెలరేగిపోతున్న వైనం

- అధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు!



ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండాపోయింది. ఆక్రమణదారులు బరితెగించి కబ్జాలకు పాల్పడుతున్నారు. స్థానిక నేతల దన్నుతో చెలరేగిపోతున్నారు. అనకాపల్లి జిల్లా కేంద్రం కావడంతో భూముల ధరలు పెరిగిన నేపథ్యంలో వీరి కన్ను ఈ పరిసర ప్రాంతాలపై పడ్డాయి. ఖాళీగా ప్రభుత్వ జాగా కనిపిస్తే చాలు ఆక్రమించి షెడ్లు వేసేస్తున్నారు.


                                  (అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)


జిల్లాలో ఆక్రమణదారులకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. ఖాళీగా ప్రభుత్వ జాగా కనిపిస్తే చాలు స్థానిక నేతల దన్నుతో ఆక్రమించి షెడ్లు వేసేస్తున్నారు. కొండలు, గ్రామకంఠాలు, గెడ్డలు.. ఇలా దేన్ని వదలడం లేదు. ప్రభుత్వ స్థలాల్లో కొందరు పక్కా భవనాల నిర్మాణాలకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నప్పుడు అనకాపల్లి పరిసర ప్రాంతంలో సెంటు భూమి లక్ష రూపాయలు ఉంటే, ప్రస్తుతం రెండు రెట్లు ధరలు పెరిగిపోయాయి. అనకాపల్లి జిల్లా కేంద్రంగా మారిన తరువాత నగర చుట్టుపక్కల గ్రామాల్లో సెంటు భూమి కొనాలంటే రూ.4 లక్షల వరకు ధర పలుకుతోంది. గతంలో తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేసిన అనేక మంది భూముల ధరలు పెరగడంతో రియల్టర్లుగా మారిపోయారు. శంకరం ప్రాంతంలో కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాలు రావడంతో ఈ ప్రాంతంలోని భూములకు ఒక్కసారిగా రెక్క లొచ్చాయి. రేబాక, కొండకొప్పాక, గొలగాం, భట్టపూడి మారేడుపూడి ప్రాంతాల్లో కొందరు ఇన్నాళ్లు వృథాగా వదిలేసిన భూములను కాపాడుకునే పనిలో ఉన్నారు. అనకాపల్లి పరిసర గ్రామీణ ప్రాంతంలోని ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. పలుచోట్ల ఇప్పటికే ప్రభుత్వ భూములను కొందరు ఆక్రమించుకున్నారు. మరికొందరు నకిలీ పట్టాలు సృష్టించి ప్రభుత్వ భూములను విక్రయిస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారని, ఈ వ్యవహారాల వెనుక వీరి ప్రమేయంపై అనుమానాలు ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.  

గొలగాంలో..

- మండలంలోని గొలగాం సర్వే నంబరు 279లో ప్రభుత్వ గెడ్డ భూమి సుమారు ఎకరా స్థలాన్ని ఓ వ్యక్తి ఆక్రమించి ఫ్లాట్లుగా విభజించి షెడ్లు వేశాడు. అలాగే సర్వే నంబరు 283లో సుమారు 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గతంలో ప్రభుత్వ కళాశాల ఏర్పాటుకు కేటాయించారు. ఆ భూమి ప్రస్తుతం ఖాళీగా ఉండడంతో కొందరు ఆక్రమించి ఇళ్లు నిర్మించుకునేందుకు సిద్ధమవుతున్నారు. 

వేటజంగాలపాలెంలో..

వేటజంగాలపాలెం సర్వే నంబరు 50లో సుమారు 110 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇక్కడ కొందరు క్వారీ పేరిట సుమారు 30 ఎకరాల భూమిలో డీపట్టాలు పొందారు. ఇదే సర్వే నంబరులో కొంత భూమిని సబ్‌ డివిజన్‌ చేసి జగనన్న కాలనీకి ఇచ్చారు. మిగిలిన సుమారు 10 ఎకరాల్లో స్థానిక అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. అలాగే వేటజంగాలపాలెం పంచాయతీలో కార్యాలయానికి ఎదురుగా సర్వే నంబరు 69లో దాదాపు 4 ఎకరాల భూముల్లో కోళ్ల ఫారం పెట్టేందుకు కొందరు గతంలో బ్యాంకు రుణం తీసుకున్నారు. తరువాత దాన్ని ఎత్తేశారు. కోళ్లఫారం భూములు ఇంకా రికార్డుల్లో జిరాయితీగానే చూపుతుండడంతో ఈ భూమిని కబ్జాదారులు విక్రయిస్తున్నారు. మండలంలో పలుచోట్ల స్థానిక నాయకుల సహకారంతో ఆక్రమణదారులు ప్రభుత్వ భూముల్లో పాగా వేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, ఫిర్యాదు చేస్తే నోటీసు ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. 

-----

ప్రభుత్వ భూములకు రక్షణ కల్పిస్తాం

ప్రభుత్వ భూములకు రక్షణ కల్పిస్తాం. గొలగాం, వేటజంగాలపాలెం భూముల ఆక్రమణ విషయంపై ఎటువంటి ఫిర్యాదు అందలేదు. స్థానిక వీఆర్వోలతో విచారణ జరిపించి, ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైనట్టు రుజువైతే చర్యలు చేపడతాం. ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తప్పవు.

- శ్రీనివాసరావు, తహసీల్దారు, అనకాపల్లి


Updated Date - 2022-05-15T06:26:02+05:30 IST