సంతల్లో దొంగల హల్‌చల్‌

ABN , First Publish Date - 2022-05-19T05:25:29+05:30 IST

వారాంతపు సంతలు దొంగలకు అడ్డాలుగా మారుతున్నాయి. సంతలో హడావుడి వాతావరణం నెలకొని ఉండడంతో అదే అదునుగా భావించి చేతికి పనిచెబుతున్నారు.

సంతల్లో దొంగల హల్‌చల్‌

వారానికి 20 సెల్‌ఫోన్ల అపహరణ


మెదక్‌అర్బన్‌, మే 18: వారాంతపు సంతలు దొంగలకు అడ్డాలుగా మారుతున్నాయి. సంతలో హడావుడి వాతావరణం నెలకొని ఉండడంతో అదే అదునుగా భావించి చేతికి పనిచెబుతున్నారు. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా క్షణాల్లో సెల్‌ఫోన్లు మాయం చేస్తున్నారు. మెదక్‌, తూప్రాన్‌, రామాయంపేట, నర్సాపూర్‌లో ఒక్కో సంతలో ప్రతి వారం దాదాపు 20 సెల్‌ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం ఉం డడం లేదు. దొంగల భయానికి ప్రజలు వారాంతపు సంతలు అంటేనే భయపడుతున్నారు. 


పిల్లలతో వ్యవహారం?

గత నెలలో మెదక్‌ మార్కెట్‌లో సెల్‌ఫోన్‌ దొంగతనానికి పాల్పడుతున్న జనగాంకు చెందిన మైనర్‌ బాలుడిని స్థానికులు పట్టుకున్నారు. పిల్లవాడు కావడం, ఏడుస్తుండడంతో జాలిపడి వదిలేశారు. అయితే ఇదంతా పక్కా పథకం ప్రకారం చోరీ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ముఠా సభ్యులు వెనుక ఉండి పిల్లలతో వ్యవహారం చక్కబెడతారు. సెల్‌ఫోన్లు ఎలా అపహరించాలనే అంశంపై చిన్నారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఏ మాత్రం అనుమానం రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎంపిక చేసిన వ్యక్తుల వద్దకు చిన్నారులను పంపుతారు. ఆ వ్యక్తుల ఏమరుపాటుగా ఉన్న సమయంలో పని కానిచ్చేస్తున్నారు.ఎవరైనా గుర్తించి గొడవ చేయాలని ప్రయత్నిస్తే ముఠా సభ్యులే మధ్యవర్తులుగా రంగప్రవేశం చేసి పిల్లలు కదా.. వదిలేయండి అంటూ ప్రాధేయపడి వారిని తప్పిస్తారు. కొంత మంది బాధితులు పోలీస్‌ స్టేషన్‌ ఫిర్యాదు చేసి దొంగలు మాత్రం దొరకడం లేదు. 


సంతల్లో దొంగతనాలను అరికట్టాలి 

-యాచం నాగభూషణం, మెదక్‌

గత వారం మెదక్‌ మార్కెట్‌లో కూరగాయలు తీసుకోవడానికి వెళ్లాను. రూ.40వేల విలువైన సెల్‌ఫోన్‌ అపహరణకు గురైంది. ఎంత వెతికినా దొరకలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశా. సంతల్లో దొంగతనాలను అరికట్టాలి. 


అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలి

- మధు పట్టణ సీఐ మెదక్‌

ఫిర్యాదులు వచ్చిన మాట నిజమే. మార్కెట్‌లో రోజు గస్తీలో సిబ్బందిని పెడతాం. అనుమానితులు కంటపడితే సమాచారం ఇవ్వండి. సంతకు వెళ్లేవారు కాస్త అప్రమత్తంగా ఉండడం మంచింది.

Updated Date - 2022-05-19T05:25:29+05:30 IST