Hyderabad సిటీలో సంక్రాంతి.. పిండి వంటల ఘుమఘుమలు

ABN , First Publish Date - 2022-01-13T16:12:33+05:30 IST

ఓ వైపు పల్లె‘టూరు’కు నగరం పయనమవుతుంటే.. మరోవైపు నగరంలో సంక్రాంతి సందడి

Hyderabad సిటీలో సంక్రాంతి.. పిండి వంటల ఘుమఘుమలు

  • కాలనీల్లో పండగ సందడి 
  • స్వగ్రామాలకు నగర వాసులు

ఓ వైపు పల్లె‘టూరు’కు నగరం పయనమవుతుంటే.. మరోవైపు నగరంలో సంక్రాంతి సందడి కనిపిస్తోంది. ఇళ్లల్లో పిండి వంటల తయారీ.. ఆకాశంలో పతంగుల విహారం.. కాలనీల్లో ముగ్గుల పోటీలు.. అక్కడక్కడ బసవన్నల  విన్యాసాలు.. పండగ శోభను సాక్షాత్కరిస్తున్నాయి. సిటీజనులు సొంతూళ్లకు వెళ్లడంతో నగరంలోని దారులు ఖాళీగా కనిపిస్తున్నాయి.


హైదరాబాద్ సిటీ/మల్కాజిగిరి : సంక్రాంతి వస్తోందంటే ప్రతి ఇంటా పిండి వంటలు ఉండాల్సిందే. దీంతో చాలా మంది మహిళలు ఇళ్లల్లో సకినాలు, అరిసెలు, అప్పాలు, లడ్డూల తయారీలో బిజీగా ఉన్నారు. ఒకే అపార్ట్‌మెంట్‌వాసులు, బంధువులు, స్నేహితులు ఒకరికి మరొకరు సహకారం అందించుకుంటూ పిండివంటలు తయారు చేస్తున్నారు.


పద పదవే గాలిపటమా..! 

పండగ రోజుల్లో అపార్ట్‌మెంట్‌ టెర్రస్‌, ఖాళీ స్థలాల్లో గాలిపటాలు ఎగురవేస్తూ పిల్లలు, పెద్దలు సందడి చేస్తారు. ప్రస్తుతం మార్కెట్లో సరికొత్త రకాలు అందుబాటులోకి వచ్చాయి. డప్పన్‌, లంగోట్‌, జోరండి, నామమ్‌, బ్యాజ్‌ లంగోటి తదితర రకాలు చిన్నారులను ఆకట్టుకుంటున్నాయి. ఏరోప్లేన్‌, ఈగల్‌, త్రికోణం, చతురస్రాకారం మోడళ్లు ఆకర్షిస్తున్నాయి. రూ. 5 నుం చి రూ. వెయ్యి వరకు వాటి ధరలు ఉన్నాయి. మాంజాలో తంగూస్‌, భరళీ, సాధారణ మాంజాలు రూ.5 నుంచి వందల వరకు విక్రయిస్తున్నారు. శంకర్‌ మార్క్‌, గన్‌ మార్క్‌, కృష్ణమార్క్‌, షోలేమార్క్‌ దారాలు 100 మీటర్లకు పైగా అందుబాటులో ఉన్నాయి.


మెటాలిక్‌ మాంజాతో ప్రమాదం

పతంగులను విద్యుత్‌ తీగలకు దూరంగా ఎగరేయాలని టీఎస్ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. మెటాలిక్‌ మాంజాతో విద్యుత్‌షాక్‌ తగిలే ప్రమాదముందని, తీగలకు తగిలిన మాంజాలను పట్టుకోవద్దని సూచించారు. పతంగులు విద్యుత్‌ తీగలు, స్తంభాలకు చిక్కితే వాటినే తీసేందుకు ప్రయత్నించొద్దని తెలిపారు.


నాటుకోడి రెడీ..!

పండగకు వచ్చే చుట్టాలకు నాటుకోడితో విందు ఇవ్వడం చాలా మందికి అలవాటు. అలాంటి వాళ్ల కోసం శివార్లలోని ఫామ్స్‌తో పాటు, వ్యవసాయ క్షేత్రాల్లో షెడ్లను ఏర్పాటు చేసి కోళ్లను పెంచుతున్నారు. అయితే, ఈసారి ధర అమాంతం పెరిగింది. మొయినాబాద్‌ మండలం, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌-బీజాపూర్‌ హైవేపై ప్రత్యేకంగా నాటుకోళ్ల అమ్మకాలు చేపడుతున్నారు. ప్రస్తుతం పండగ సీజన్‌ కాబట్టి కిలో కోడి ధర రూ.800 వరకు పలుకుతోంది. 



Updated Date - 2022-01-13T16:12:33+05:30 IST